Andhra Pradesh

News April 18, 2024

గుంటూరు: కాలువలో మునిగి విద్యార్థి మృతి

image

తెనాలి మండలం సంగం జాగర్లమూడిలోని కొమ్మమూరు కాలువలో మునిగి విద్యార్థి మృతిచెందాడు. నర్సరావుపేటకు చెందిన వంశీకృష్ణ వడ్లమూడిలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తాను మరో ముగ్గురితో కలసి సంగం జాగర్లమూడి సంగమేశ్వరస్వామి దేవస్థానం వద్ద కాల్వకు బుధవారం సాయంత్రం వెళ్లారు. ఈత కొడుతుండగా.. వంశీకృష్ణ మునిగిపోగా.. రాత్రికి మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

News April 18, 2024

ఫారం-12 సేకరణ కేంద్రం ఏర్పాటు: జేసీ

image

ఎన్నికల విధులు నిర్వహించే ఓపిఓ , మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు రాజమహేంద్రవరం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో ఫారం 12 సేకరణ కేంద్రం ఏర్పాటు చేసామని టర్నింగ్ అధికారి, జెసి తేజ్ భరత్ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు పోస్టల్ బ్యాలెట్ సేకరణ కేంద్రంలో ఫారం-12, ఎన్నికల విధుల ఉత్తర్వు పత్రం, ఆధార్, గుర్తింపు కార్డు అందించాలన్నారు.

News April 18, 2024

తిరుపతిలో 16.97 లక్షలు సీజ్

image

సరైన పేపర్లు లేకుండా తరలిస్తున్న డబ్బును అలిపిరి పోలీసులు సీజ్ చేశారు. సీఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ వాహనాలు తనిఖీ చేశారు. కాటన్ మిల్లు వద్ద బైకుపై తీసుకెళ్తున్న రూ.12.98 లక్షలు పట్టుకున్నారు. మంగళం రోడ్డు డీమార్ట్ వద్ద రూ.1.99 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కేటీ రోడ్డులో మరో రూ.2 లక్షలు పట్టుబడింది. మొత్తంగా రూ.16.97 లక్షలు సీజ్ చేసి ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారు.

News April 18, 2024

నలుగురికే అనుమతి: ప్రకాశం SP

image

నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తామని ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పష్టం చేశారు. అభ్యర్థుల పీఎస్వోలను ఆర్వో కార్యాలయంలోకి అనుమతించబోమన్నారు. తుపాకులను వెంట తీసుకు వెళ్లరాదని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ర్యాలీలో టపాసులు కాల్చకూడదని చెప్పారు.

News April 18, 2024

రాజంపేటకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు

image

రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఏప్రిల్ 24న వారు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. అలాగే ఇవాళ రాజంపేట వైసీపీ శ్రేణులు పలువురు TDPలో చేరుతున్నట్లు సమాచారం.

News April 18, 2024

ఖాళీలు పెట్టకండి: నెల్లూరు కలెక్టర్

image

ఇవాల్టి నుంచి నెల్లూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో కలెక్టర్ హరినారాయణన్ కీలక సూచనలు చేశారు. ‘అన్ని రాజకీయ పార్టీల నేతలకు కొత్త నామినేషన్ పేపర్లు ఇచ్చాం. ఎటువంటి తప్పులు లేకుండా, ఖాళీలు పెట్టకుండా అన్ని వివరాలు పొందుపరచాలి. ఫాం-ఏ, బీ పత్రాలపై ఇంకుతోనే సంతకం పెట్టాలి. తాజా అఫిడవిట్ పత్రాలను అందజేయాలి. నామినేషన్ వేసే ఆఫీసులోకి నలుగురినే అనుమతిస్తాం’ అని ఆయన చెప్పారు.

News April 18, 2024

పెదగోగాడ గెడ్డలో పడి ఆర్మీ ఉద్యోగి మృతి

image

గెడ్డలో పడి ఆర్మీ ఉద్యోగి మృతి చెందినట్లు చీడికాడ ఎస్సై జి.నారాయణరావు బుధవారం తెలిపారు. బుచ్చెయ్యపేట మం. పి.భీమవరంకి చెందిన పడాల వరహాలు ఆర్మీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి సెలవుపై స్వగ్రామం వచ్చిన వరహాలు దేవరాపల్లి మం. వాకపల్లిలో అత్తవారింటికి బయలుదేరాడు. పెదగోగాడ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న గెడ్డలో పడిపోయాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.

News April 18, 2024

అనంత: ఇద్దరు ఉద్యోగులపై వేటు

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్  అయిన వారిలో యల్లనూరు గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఇ.విజయకుమారి, కూడేరు మండలం గొటుకూరు గ్రామ సీనియర్ మేట్ ఎన్. జయప్ప ఉన్నారు. అలాగే పలు చోట్ల ఎస్ఎస్ఈ బృందాలు రూ.2.80 కోట్ల నగదును సీజ్ చేశారన్నారు.

News April 18, 2024

గార: వత్సవలసలో పిడుగుపాటుకు మహిళ మృతి

image

పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వత్సవలస పంచాయతీ మొగదాల పాడు గ్రామానికి చెందిన కుందు భాగ్యలక్ష్మి (39) బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆరేసిన దుస్తులు తీసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. భాగ్యలక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని గార ఎస్సై కె. కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

News April 18, 2024

నేటి నుంచి నామినేషన్లు మొదలు: ముకేశ్ కుమార్‌ మీనా

image

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి నుంచి ప్రారంభమవుతుందని, ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్‌ మీనా తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.