Andhra Pradesh

News April 10, 2024

సైబర్ క్రైమ్ కేసులో నిందితులుగా నెల్లూరురోళ్లు

image

కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా టిపుటూరుకు చెందిన అనూషా సైబర్ మోసానికి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి వివిధ దశల్లో రూ.20 లక్షలను సైబర్ నేరస్తులు లాగేశారు. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో నెల్లూరు శోధన్ నగర్‌కు చెందిన డి.జగదీశ్, సంతోశ్, వెంకటగిరి మండలం వల్లివేడుకు చెందిన సురేశ్, కార్వేటినగరానికి చెందిన మునీంద్ర ఉన్నారు.

News April 10, 2024

తూ.గో: 70 కేసులు ఉన్న దొంగ అరెస్ట్

image

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డ యూనియన్ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తెచ్చిన వృద్ధురాలు వాకా కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.

News April 10, 2024

కడప: తమ్ముడు.. TDP అన్న YCP.!

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు పార్టీల ఫిరాయింపులతో ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా రాయచోటి మాజీ YCP ఆర్.రమేశ్ కుమార్ రెడ్డి TDPకి రాజీనామా చేసి, నేడు జగన్ సమక్షంలో YCPలో చేరుతున్నట్లు స్పష్టంచేశారు. అయితే సోదరుడు శ్రీనువాసులరెడ్డి సతీమణి మాధవిరెడ్డి కడప TDP MLA అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో సోదరులు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉండటంతో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

News April 10, 2024

నరసరావుపేట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అలెగ్జాండర్

image

కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ స్థానానికి జి.అలెగ్జాండర్‌ను పార్టీ ఖరారు చేసింది. ఆయన నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి 2014, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 1993 నుంచి అలెగ్జాండర్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఈయన పూర్తి పేరు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్. మండలంలోని గురవాయపాలెంలో పుట్టి, నరసరావుపేటలో స్థిరపడ్డారు.

News April 10, 2024

భానుడి భగభగలు.. ఆదోనిలో 42 డిగ్రీల నమోదు

image

భానుడి భగభగలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఆదోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంత్రాలయంలో 41.3 డిగ్రీలు, చాగలమర్రిలో 40.6, కౌతాళంలో 40.3, గడివేములలో 40.2, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, గోస్పాడు మండలాల్లో 40.1, చిప్పగిరిలో 36.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 10, 2024

విశాఖ జిల్లాలో నాలుగు ప్రభుత్వ పెట్రోల్ బంకులు

image

విశాఖ రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ మల్లిఖార్జున నిర్ణయం తీసుకున్నారు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగులు సంక్షేమం కోసం ఖర్చు చేయనున్నారు. మూడు మండలాల పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థలాలను కూడా కేటాయించారు. గాజువాక మండలం చినగంట్యాడ, అగనంపూడి, ఆనందపురం మండలం కుసులవాడ, సీతమ్మధార మండల పరిధిలో రేసపువానిపాలెంలో స్థలాలు కేటాయించారు.

News April 10, 2024

కొండపి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

image

కొండపి మండలం, కట్టుబడిపాలెం-వెన్నూరు గ్రామాల మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. గోగినేనివారిపాలెంకు చెందిన గోగినేని శాంతి తన కూతురు యశ్విత లక్ష్మి(9), కుమారుడు దేవాన్ష్‌తో కలిసి స్కూటీపై గ్రామానికి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యశ్విత లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణబాజీబాబు చెప్పారు.

News April 10, 2024

ఆరు సార్లు ఎంపీ… మరోసారి బరిలోకి

image

తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన ఘనత చింతామోహన్ దే. 1984లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 1989, 1991, 1998, 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి లోక్ సభలో ప్రవేశించారు. కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు.

News April 10, 2024

చంద్రగిరి: ఈతకు వెళ్లి యువకుడి మృతి

image

చంద్రగిరి పాతపేటకు చెందిన జయంత్ శర్మ ఐదుగురు స్నేహితులతో కలిసి డోర్నకంబాల గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి మంగళవారం వెళ్లాడు. ఈత సక్రమంగా రాని జయంత్ బావిలో మునిగిపోయాడు. అతని స్నేహితులు బావిలో గాలించి బయటికి తీశారు. చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయంతి శర్మ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.

News April 10, 2024

నెల్లూరు: రూ.2.70 లక్షలు స్వాధీనం

image

ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.2.70 లక్షల నగదును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పట్టుకున్నారు. వేదాయపాలెం, కొడవలూరు, కావలి ఒకటో పట్టణం, గ్రామీణం, జలదంకి, చేజర్ల, మర్రిపాడు, కలువాయి, సైదాపురం పరిధిలో 196 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ తెలియజేశారు