Andhra Pradesh

News April 3, 2024

కర్నూలు: గుండెపోటుతో వాలంటీర్ మృతి

image

దేవనకొండ మండలం పాలకుర్తిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న బోయ లక్ష్మన్న(35) గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య సరస్వతి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. లక్ష్మన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 3, 2024

చిత్తూరు జిల్లాలో CM పర్యటన ఇలా..!

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలోకి నేడు ప్రవేశించనుంది. జిల్లాలోని పూతలపట్టు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం పాకాల మండలం గాదంకి మీదుగా ముంగళిపట్టు, మామండూరు, ఐతేపల్లి, తిరుపతి మీదుగా రేణిగుంటకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 3, 2024

శ్రీకాకుళం: కొబ్బరి జీడి మామిడి తోటలు అగ్నికి ఆహుతి

image

గార మండల పరిధి శ్రీకూర్మం పంచాయతీ నగిరెడ్లపేట, చుక్కపేట గ్రామాలమధ్య మంగళవారం రేగి కొబ్బరి, జీడి మామిడి, నీలగిరి తోటలు దగ్ధమయ్యాయి. వ్యర్థాలకు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్ ఐ.అనీల్, వీఆర్వో జగదీష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

News April 3, 2024

నెల్లూరు సిటీ బరిలో సీపీఎం..!

image

కాంగ్రెస్ పార్టీతో వామపక్షాల పొత్తు నేపథ్యంలో నెల్లూరు సిటీ స్థానం నుంచి సీపీఎం బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీపీఎం నేతలు నెల్లూరులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే నిన్న విడుదలైన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్థి పేరు లేదు. సీపీఎం అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేశ్ పేరు వినిపిస్తోంది.

News April 3, 2024

ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్లు ఇద్దరూ నరసరావుపేట వారే

image

రాజకీయ చైతన్యానికి మారుపేరైన నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు తొలి స్పీకర్లను అందించింది. మద్రాసు నుంచి ఏపీ విడిపోయిన తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్‌గా నరసరావుపేటకు చెందిన నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి ఎన్నికయ్యారు. అదేవిధంగా 2014లో తెలంగాణ, ఆంధ్రా విడిపోయిన నేపథ్యంలో నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు.

News April 3, 2024

వ్యూహాత్మక పనులకు ప్రాధాన్యత ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్

image

పూడికతీత పనులకు కాకుండా నూతన వ్యూహాత్మక పనులను చేపట్టడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరమంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులపై మంగళవారం డ్వామా కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పొలాలలో ఇంకుడు గుంతలు, కాలువ గట్లపై మొక్కలు నాటడం, కల్చర్ ప్లాంటేషన్ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

News April 3, 2024

YVU కాన్వకేషన్ దరఖాస్తు గడువు మరోమారు పెంపు

image

YVU స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్.డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువును ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 8 తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటిదాకా 11,725 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

News April 3, 2024

హోం ఓటింగ్‌కు సంబంధించి సమాచారం సేకరించండి: నంద్యాల కలెక్టర్

image

అత్యవసర సేవలందించే వ్యక్తుల పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన ప్రక్రియను బుధవారం సాయంత్రంలోగా పూర్తిచేయాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో మొత్తం సుమారు 36 వేల పోస్టల్ బ్యాలెట్ల అవసరం ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి సమర్పించాలి, సంబంధిత ఫార్మేట్‌లపై అవగాహన కల్పించాలన్నారు.

News April 3, 2024

విజయనగరం జిల్లాలో 15 మంది వాలంటీర్లు రాజీనామా

image

విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 15 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేకాధికారి నిర్మలాదేవి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గరనుంచి ఏప్రెల్ 1 వరకు, జిల్లాలో వాలంటీర్లకు సంబంధించి మొత్తం 29 ఫిర్యాదులు అందాయని, వీరిలో 14 మందిని ఇప్పటివరకు తొలగించగా, మిగిలిన 15 మంది రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.

News April 3, 2024

VZM: వడగాల్పులపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

image

జిల్లాలో ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా వుంటూ ఎండల నుంచి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి కోరారు. ఏప్రిల్, మే నెలలో 46. 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ మంగళవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.