Andhra Pradesh

News September 15, 2024

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

image

విజయవాడ రామవరప్పాడులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లి కొడుకు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనంపై నుంచి లారీ కిందపడి దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారు విజయవాడ గుణదలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పటమట సీఐ పవన్ కిషోర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

News September 15, 2024

దివాన్ చెరువు ప్రాంతంలో పులి కదలికలు: FRO భరణి

image

దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు ట్రాప్ కెమెరాలో రికార్డు అయ్యాయని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి తెలిపారు. చిరుత ప్రస్తుతం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. పులిని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, దాన్ని కచ్చితంగా పట్టుకుంటామన్నారు.

News September 15, 2024

కృష్ణా: వరద బాధితులకు రూ.7.70 కోట్ల విరాళం

image

వరద బాధితులకు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున రూ.7.70 కోట్ల విరాళం అందజేశామని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు YVB రాజేంద్ర తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు విరాళం చెక్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కు అందజేశామని YVB తెలిపారు. వరద బాధితులకై రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం ఇచ్చారని ఆ మొత్తం రూ.7.70 కోట్లు అవ్వగా, ఆ నగదు ప్రభుత్వానికి ఇచ్చామన్నారు.

News September 15, 2024

నెల్లూరు: రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం మిలాద్ ఉన్ నబీ పండగ సెలవు కావడంతో నిర్వహించడం లేదని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రజలు, ఫిర్యాదు దారులు ఈ విషయాన్ని గమనించగలరని పోలీస్ శాఖ అధికారులు కోరారు.

News September 15, 2024

కలికిరి: వినాయక నిమజ్జనం ఊరేగింపులో అపశ్రుతి

image

వినాయకుని నిమజ్జనం ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం కలికిరి చదివేవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల సమీపంలో వినాయకుని నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగసిపడి వెల్డింగ్ షాపు దగ్ధమైంది. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు అంటుకోకుండా పెద్ద ప్రమాదం తప్పింది. వెల్డింగ్ షాపులో ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది.

News September 15, 2024

విజయవాడ: అధికారులపై సస్పెన్షన్‌ వేటు

image

ముంబై సినీ నటి కాదంబరి కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా, పోలీస్ అధికారి విశాల్‌గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ వర్గాల నుంచి ఉత్వర్వులు తాజాగా వెలువడ్డాయి. కాగా ఈ కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల సస్పెండ్ చేశారు.

News September 15, 2024

అనంతపురం జిల్లాకు 8 మంది DSPల రాక

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎనిమిది మంది DSPలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్‌కు DSPగా వెంకటేశ్వర్లు, అనంతపురం-శ్రీనివాసరావు, గుంతకల్-అముదల శ్రీనివాస్, తాడిపత్రి-రామకృష్ణుడు, అనంతపురం ఉమెన్ పీఎస్-మహబూబ్ బాషా, అనంతపురం-శరత్ రాజ్ కుమార్, అనంతపురం-సునీల్, కదిరికి శివనారాయణ స్వామి బదిలీపై రానున్నారు.

News September 15, 2024

కంభంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

కంభం పట్టణంలోని స్థానిక చెరువు కట్ట సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆదివారం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెందాడ లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 15, 2024

నంద్యాల విద్యార్థికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు

image

నంద్యాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హావీస్ తన ప్రతిభతో ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. రమేశ్, స్వర్ణ దంపతుల కుమారుడు హావీస్ ప్రముఖ చిత్రకారుడు కోటేశ్ వద్ద చిత్రకళలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఆయన పోట్రేయిట్ చిత్రాన్ని 3 గంటల్లో 3,022 చిన్న బొట్టు బిళ్లలను అతికిస్తూ తయారు చేశాడు. హవీస్‌కు సంస్థ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని అందించారు.

News September 15, 2024

18న నరసరావుపేటలో జాబ్ మేళా

image

జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18న నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని 1500 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.