Andhra Pradesh

News March 21, 2024

రాజమండ్రి: 23 మంది వాలంటీర్లు సస్పెన్షన్

image

రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో మార్గదర్శకాలు ఉల్లంఘించిన 23 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రాజమండ్రి అర్బన్ రిటర్నింగ్ అధికారి/మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులు కచ్చితంగా ఎన్నికల నియమావళిని అనుసరించాలని తెలిపారు. స్థానిక 44వ వార్డు పరిధిలోని సచివాలయం 76, 77లకు చెందిన వాలంటీర్లు సస్పెన్షన్ కు గురయ్యారు.

News March 21, 2024

అనకాపల్లి: నీళ్ల తొట్టిలో పడి బాలుడు మృతి

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయితీలోని కోడాపల్లిలో ఘోరం జరిగింది. గ్రామానికి చెరుకు చంద్రరావు, జానకి దంపతుల ఏడాదిన్నర కుమారుడు గణేష్ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి మృతి చెందాడు. తొట్టిలో పడిన బాలుడిని దేవరాపల్లి పీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News March 21, 2024

ఎన్నికల్లో వీరికి పోస్టల్ బ్యాలెట్లు

image

పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.

News March 21, 2024

ప్రకాశం జిల్లాలో ట్రాక్టరు బోల్తా.. డ్రైవర్ మృతి

image

త్రిపురాంతకం మండలం రాజుపాలెంకు చెందిన గంపసాని సింహాద్రి (20) ఇటుకల బట్టీలో ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గురువారం ఇటుకల లోడు ట్రాక్టరును తీసుకుని త్రిపురాంతకం వస్తున్న క్రమంలో చెరువు చప్టాపై స్పీడ్ బ్రేకర్ వద్ద ఆదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఇటుకలు సింహాద్రిపై పడ్డాయి. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసి వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 21, 2024

పొన్నూరు: కోడిపందేల స్థావరాలపై దాడులు.. 14 మంది అరెస్ట్

image

పొన్నూరు మండలం మాచవరం గ్రామం తుంగభద్ర డ్రెయిన్ కట్టపై గురువారం పొన్నూరు రూరల్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై బండ్ల భార్గవ్ ఆధ్వర్యంలో కోడి పందేల స్థావరాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, 6 కోడిపుంజులతో పాటు 16 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై భార్గవ్ మీడియాకు తెలిపారు.

News March 21, 2024

నెల్లూరు: ఆ నియోజకవర్గంలో గెలిస్తే రికార్డే..

image

సూళ్లూరుపేట నియోజకవర్గంలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినా.. గెలిచిన దాఖలాలు లేవు. 1983లో కాంగ్రెస్ నుంచి M.లక్ష్మీకాంతమ్మ పోటీ చేయగా..TDP అభ్యర్థి S.ప్రకాశం చేతిలో ఓడిపోయారు. 2009లో V.సరస్వతి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా..TDP అభ్యర్థి పరసా వెంకటరత్నం చేతిలో ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో TDP తరఫున నెలవల విజయశ్రీ.. వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తున్నారు. విజయశ్రీ గెలిచి రికార్డు సృష్టిస్తారా?

News March 21, 2024

అన్నమయ్య: Love Failureతో యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమై మహేష్ (19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లి మండలం, బి.ఎర్రగుడి గ్రామం, కాపుపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు హుటాహుటిన లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2024

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆమె ఐదుసార్లు ఎమ్మెల్యే?

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. నేటి రోజుల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారింది. అలాంటిది ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కె.ప్రతిభా భారతి టీడీపీ తరఫున 1983 నుంచి 2004 వరకు పోటీ చేసి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించింది. పోటీ చేసిన ప్రతిసారి 10 వేలకుపైగానే మెజార్టీతో గెలుపొందారు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటి మహిళ స్పీకర్ గా పనిచేశారు.

News March 21, 2024

అమలాపురం MP చింతా అనురాధ పార్టీ మార్పు.. క్లారిటీ

image

తాను వైసీపీ నుంచి వేరే పార్టీలోకి మారుతున్నట్లు ప్రచారం సాగుతుందని ఇది పూర్తిగా అవాస్తవం అని అమలాపురం MP చింతా అనురాధ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంలో సీఎం జగన్ చేసిన సాయం మరువలేనిదన్నారు. అటువంటి వ్యక్తి నీడలోనే పని చేస్తాను తప్ప మరో గూటికి చేరే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు.

News March 21, 2024

ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి: మన్యం కలెక్టర్

image

సి.విజల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులు కోడ్ ఉల్లంఘన సంబంధించి చర్యలు గుర్తించిన వెంటనే సి.విజల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించాలనిక సిబ్బందికి సూచించారు.