Andhra Pradesh

News April 14, 2024

శ్రీకాకుళం: చెరువులో చేపల వేటకు పోటీపడ్డ గ్రామస్థులు

image

నందిగాం మండలం పాత్రునివలస గ్రామానికి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెరువులో ఆదివారం చేపలు పట్టేందుకు గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. గ్రామ పెద్దల ఆదేశాల మేరకు ఉదయం గ్రామంలో ఉన్న వారంతా చెరువులో చేపలు పట్టేందుకు ఒక్కసారిగా వందలాది మంది చెరువులో దిగి పోటీపడ్డారు. ఇలా ఒక్కసారిగా చేపలవేట సాగిస్తున్న గ్రామస్థులను అటుగా వెళుతున్న ప్రయాణికులు ఆశ్చర్యంగా చూశారు. ఈ రోజు గ్రామమంతా చేపల కూరే మరీ.

News April 14, 2024

విశాఖ: టీడీపీలోకి అక్కరమాని విజయనిర్మల..!

image

విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. VMRDA ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె.. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా 16న చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణపై ఓడిపోయారు.

News April 14, 2024

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు కలెక్టర్ నివాళులు 

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండు కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ అదితి సింగ్, ఆర్డిఓ నిశాంత్ రెడ్డి తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2024

గిద్దలూరు: రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గిద్దలూరు పట్టణ సమీపంలో ఎడవల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్నది. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఖాజావలి (38) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొనటంతో తీవ్ర గాయాలతో ఖాజావలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 14, 2024

దాడి చేసిన ఎవరినీ వదిలి పెట్టబోం: హోంమంత్రి వనిత

image

విజయవాడలో సీఎం జగన్ మీద జరిగిన దాడి పూర్తిగా ప్రతిపక్షాల కుట్రేనని హోంమంత్రి వనిత ఆరోపించారు. శనివారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాడికి కారణం అయిన ఏ ఒక్కరిని విడిచి పెట్టబోమని, ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని, దేవుడి ఆశీసులు జగన్‌కు, వైస్సార్సీపీ ప్రజా ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.

News April 14, 2024

గుత్తి: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

image

గుత్తి జీఆర్పీ పరిధిలోని జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప.. పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 14, 2024

బాపట్ల జై భీమ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కోటయ్య

image

అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్యను జై భీమ్ రావు భారత్ పార్టీ బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. బాపట్ల పార్లమెంటులో అత్యధిక ఓట్లతో పార్టీని అగ్రస్థానంలో నిలబెట్టాలని కోటయ్యకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల గొంతుకగా ఓటర్ల ఓట్లను అభ్యర్థిస్తానని కోటయ్య తెలిపారు.

News April 14, 2024

విశాఖలో కిడ్నాప్ కలకలం

image

వ్యక్తిని కిడ్నాప్‌కు యత్నించిన ఘటన విశాఖ ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన యుగంధర్ శనివారం క్యాబ్‌ బుక్ రుషికొండ బీచ్ రోడ్డులో బీజేపీ ఆఫీసు వద్ద దిగాడు. వెనుక కారులో ఐదుగురు ఆ వ్యక్తిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. గమనించిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విశాఖకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంటటంతో ఆమె భర్త కిడ్నాప్‌నకు యత్నించినట్లు తెలుస్తోంది.

News April 14, 2024

విజయనగరంలో భారీగా బంగారం పట్టివేత

image

ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం కన్యాకాపరమేశ్వరి ఆలయం దగ్గరలో నిన్న రాత్రి అన్నవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి భారీగా బంగారాన్ని 1టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో అతని వద్ద నుంచి 2.68 కేజీల బంగారు ఆభరణాలు, రూ.17,50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసిడి వ్యాపారస్థులకు సంభందించినదిగా పోలీసులు భావిస్తున్నారు.

News April 14, 2024

కొత్తూరు: మామిడి చెట్టు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

image

కొత్తూరు మండలం గూనభద్ర ఆపోజిట్ కాలనీలో అదే కాలనీకి చెందిన మీసాల మిన్నారావు(33) మామిడి చెట్టు ఎక్కుతూ జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం కాలనీలో రోడ్డు పక్కన ఉన్న మామిడి చెట్టు నుంచి కాయలు తీసేందుకు చెట్టు ఎక్కాడు. పట్టు తప్పి చెట్టు మీద నుంచి జారిపడి బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టానికి తరలించారు.