Andhra Pradesh

News March 18, 2024

పది పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: పల్నాడు ఎస్పీ

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్‌ అమలు చేస్తూ, పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.

News March 18, 2024

అనంత: కొండ గుట్టలో చిరుత పులి మృతి

image

శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామ సమీపంలోని కొండ గుట్టల్లో సోమవారం ఓ చిరుత పులి మృతిచెందింది. స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులి అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిందా?.. లేదా ఇతర కారణాలతో మృతి చెందిందా? తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

News March 18, 2024

నంద్యాల: టెన్త్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

image

నంద్యాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్, ఎస్పీజీ హైస్కూళ్లను వారు పరిశీలించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు.

News March 18, 2024

కొత్తవలస: రైల్వే పట్టాలు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కొత్తవలస రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఔట్ పోస్ట్ పరిధి కంటకాపల్లి నిమ్మలపాలెం మధ్యలో గుర్తు తెలియని మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెళ్తున్న రైలు నుంచి జారీ పడి మరణించాడని ఆర్ఫీఫ్ పోలీసులు భావిస్తున్నారు. విజయనగరం జీఆర్పీ పోలీసులకు తెలిపామని అధికారి ఎఎస్ఐ కె. యు.ఎం. రావు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

ఈరోజు సాయంత్రం 3 గంటల వరకే టైం:  మన్యం పిఓ

image

సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 3 గంటలలోగా ప్రైవేటు స్థలాల్లో వివిధ రాజకీయ నాయకుల ప్లెక్సీలు, జెండాలను తొలగించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడిఏ పిఓ విష్ణు చరణ్ ఆదేశించారు. సోమవారం పాచిపెంట మండలం పి కొనవలస, పాచిపెంటలో పర్యటించారు. పి కొనవలస ఐటీడీఏ బంగ్లాలో జరుగుతున్న పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈఈ జే సంతేశ్వరరావు, డీఈ ఏ మనిరాజ్, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

News March 18, 2024

డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేశ్ కుమార్ మీనాను సచివాలయంలో సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కలిసారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయించాలని వినతి పత్రం అందించారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని ప్రిపరేషన్‌కు తగిన సమయం ఉండేలా చూడాలని కోరారు.

News March 18, 2024

కోవూరులో 62 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుందా?

image

నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ స్థానానికి 1962 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అత్యధికంగా నల్లపరెడ్డి కుటుంబ సభ్యులే ఇక్కడ గెలిచారు. తాజా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రశాంతి రెడ్డి 62 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతుందేమో చూడాలి మరి..

News March 18, 2024

అన్నమయ్య: ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లు స్వాహా

image

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువకుడి ఉదంతం అన్నమయ్య జిల్లా పీలేరులో వెలుగు చూసింది. పట్టణంలోని బండ్లవంకకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. 400 మందికి పైగా నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముందుగా డిపాజిట్ రూపంలో రూ.10 కోట్లకు పైగా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.

News March 18, 2024

ఎమ్మిగనూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరేస్తాం: బుట్టా రేణుక 

image

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండానే ఎగరవేస్తామని ఆ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని పలు ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికులను కలిసి మగ్గం అల్లారు. మహిళలతో కలిసి కుట్టు మిషన్లు కుట్టారు. అభివృద్ధి, సంక్షేమం వైసీపీకి రెండు కళ్ళ లాంటివన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

News March 18, 2024

కృష్ణా: బీఈడీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్‌ థియరీ పరీక్షల 2020, 2021, 2022బ్యాచ్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 25నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

error: Content is protected !!