Andhra Pradesh

News May 25, 2024

తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

image

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరగడంతో దేవస్థానం అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం దైవ దర్శనానికి 20 గంటల సమయం పట్టడం గమనించదగ్గ అంశం. ఒకవైపు ఎన్నికలు ముగియడం మరోవైపు వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నెల చివరి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

News May 25, 2024

దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలి: చంద్రబాబు

image

ఎన్నికల్లో ఓటమి ఖాయమవ్వడంతో విచక్షణ కోల్పోయిన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం, 89పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు.. దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శేషాద్రి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

News May 25, 2024

కాళీపట్నంలో టిప్పర్‌ను ఢీకొన్న ఆటో.. మహిళ మృతి

image

ప.గో జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌‌ను ఆటో ఢీకొట్టగా.. ఆ ఆటోలో ఉన్న బొర్రా కుమారి(50) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇతర వాహనదారులు క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కుమారి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన మహిళగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News May 25, 2024

పారుపాక మాజీ సర్పంచి అనుమానాస్పద మృతి

image

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని పారుపాక మాజీ సర్పంచి గాడి నూకరాజేశ్వరరావు(58) బావిలో శవమై కనిపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన ఎన్నికల విషయమై గ్రామంలోని గానుగచెట్టు దిమ్మె వద్ద గురువారం రాత్రి నూకరాజేశ్వరరావుకు మరో వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నూకరాజేశ్వరరావు బావిలో శవమై తేలారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు SI అబ్ధుల్ నబీ తెలిపారు.

News May 25, 2024

అనంత: వంకలో కొట్టుకెళుతున్న ఆవులను రక్షించిన స్థానికులు

image

విడపనకల్లు మండలం వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాల్తూరు గ్రామం సమీపంలోని పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహించింది. వంకలో ఆవులు చిక్కుకుపోయి నీటిలో కొట్టుకుపోతుండగా అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే వాటిని కాపాడారు. మిగిలిన ఆవులు వరద తగ్గే వరకు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాయి.

News May 25, 2024

విశాఖ: వాల్తేర్ రైల్వే డివిజన్‌కు ప్రథమ స్థానం

image

రాజభాష అమలు చేసే ప్రధాన కార్యాలయాల జాబితాలో వాల్తేరు రైల్వే డివిజన్ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. డివిజన్‌‌‌కు చెందిన ఆరుగురు అధికారుల కృషి ఫలితంగా ఈ బహుమతిని సొంతం చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉద్యోగులకు వివిధ రకాల హిందీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన వారికి డివిజనల్ రైల్వే మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్ సౌరబ్ ప్రసాద్ ప్రశంసా పత్రాలు అందజేశారు.

News May 25, 2024

సత్యసాయి జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం 43,988 మంది నమోదు

image

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసే రైతులకు అందించే రాయితీ విత్తనాలకు 43,988 మంది పేర్లను నమోదు చేసుకున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు తెలిపారు. రైతులకు పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 43,988 మంది రైతులకు అనుగుణంగా 37,419 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని తెలిపారు.

News May 25, 2024

నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠిపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 25, 2024

చీరాలలో రైలు కింద పడి వ్యక్తి మృతి

image

చీరాల పట్టణ సమీపంలోని విజయనగర కాలనీ సమీపంలో తేళ్ల బుల్లయ్య (35) అనే వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

News May 25, 2024

తూ.గో: రోహిణి కార్తె.. సాగు పనులు ప్రారంభం

image

రోహిణి కార్తె ఆగమనం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఓ వైపు ఎండలకు భయపడుతూనే.. వానాకాలం దగ్గర పడిందంటూ సాగుకు సమాయత్తం అవుతున్నారు. సంబరంగా పనులు మొదలు పెట్టారు. రోహిణి కార్తె అనగానే రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని నానుడి. దీంతో పాటు తుపాన్ భయాలు ఉంటాయి. అయితే ప్రకృతి ధర్మాన్ని రైతన్న గౌరవిస్తూనే తనవంతు ధర్మం పాటిస్తూ హలం పట్టాడు. ఉభయ గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఖరీఫ్ సందడి కనబడుతోంది.