Andhra Pradesh

News March 18, 2024

ప్రకాశం: 74 మంది ఇంటర్ అధ్యాపకులకు నోటీసులు

image

జిల్లాలో ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి గైర్హాజరైన 74 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ అయ్యాయి. ఒంగోలులోని ఓ జూనియర్ కళాశాలలో సోమవారం తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, పౌరశాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందుకు 405 మంది అధ్యాపకులను నియమించారు. వీరిలో 331 మంది హాజరు కాగా, 74 మంది గైర్హాజరయ్యారు. వీరికి ఆర్‌ఐవో సైమన్ విక్టర్ నోటీసులు జారీ చేశారు.

News March 18, 2024

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ దర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు

image

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం కోసం రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. నిన్న, ఇవాళ కలిపి 2.30 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నూతన వధూవరులు, పరీక్షలు పూర్తయిన ఇంటర్ విద్యార్థులు, పరీక్షలకు సిద్ధమైన పదో తరగతి విద్యార్థులతో పాటు సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. రెండ్రోజుల్లో రూ.17 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News March 18, 2024

అనకాపల్లి: సచివాలయ ఉద్యోగి మృతి.. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా 

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ములకలపల్లిలో విద్యుత్ షాక్‌కి గురై మృతి చెందిన సచివాలయ ఉద్యోగి డి.చిరంజీవి కుటుంబానికి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చెక్కుని మృతుడి భార్య హేమలతకు దేవరాపల్లి హెచ్‌డీటీ డీ.ఆనంద్ రావు సోమవారం అందజేశారు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా కటౌట్లు తొలగిస్తూ విద్యుత్ షాక్‌తో చిరంజీవి ఆదివారం మృతి చెందాడు.

News March 18, 2024

ఆమదాలవలస: ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. ఆమదాలవలస రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఎన్నికల నియమావళి పై నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. పోటీలో నిలిచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను సక్రమంగా సమర్పించాలన్నారు. సమస్యలుంటే 90323 18521 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

News March 18, 2024

కొత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కోడుమూరు మండలంలోని కొత్తూరు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు వద్ద రోడ్డుపై వెళ్తున్న కొత్తూరు గ్రామానికి చెందిన ఎం.రామయ్య అనే(65) వ్యక్తిని కర్నూలు వైపు నుంచి కోడుమూరు వైపు వస్తున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

ప్రకాశం: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

image

అతివేగంగా వస్తున్న బైకు అదుపు తప్పడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మద్దిపాడు ఫ్లైఓవర్‌పై సోమవారం సాయంత్రం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు ఒంగోలు కేంద్రంగా ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పులను వసూలు చేసుకుని తిరిగి ఒంగోలు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను కొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతిచెందాడు.

News March 18, 2024

ప్రత్యర్థులందరూ కొత్తముఖాలే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.

News March 18, 2024

బత్తలపల్లిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డుకు ఉన్న వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. నర్సింపల్లి రోడ్డు పక్కన ఉన్న వెంకటేశ్‌కు చెందిన వ్యవసాయ పొలంలో విద్యుత్ వైర్ల మరమ్మతుల కోసం ఓ వ్యక్తి స్తంభం ఎక్కాడు. విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. బత్తలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా.. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి: డీఈవో

image

జాతీయ ఉపకార వేతనం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికైన విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో కోరారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాలలో స్కాలర్ షిప్ నకు ఎంపికై ప్రస్తుతం 9 నుంచి ఇంటర్ చదువుతూ రెన్యూవల్ చేయించుకున్న ప్రతి విద్యార్థి తప్పకుండా తమ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని తెలిపారు.

News March 18, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాకు వర్షసూచన

image

ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలకు వాతవరణ శాఖ తీపికబురు చెప్పింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.