Andhra Pradesh

News April 10, 2024

ప్రలోభాలుంటే సమాచారం ఇవ్వండి: ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో సోమవారం సాయంత్రం 7గంటల నుంచి మంగళవారం సాయంత్రం 7 వరకు రూ.22 వేల విలువ కలిగిన 88.60 లీటర్ల మద్యం, బెల్లం ఊట-1200 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.7,61,460 నగదును సీజ్ చేశారని ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. ప్రలోభాలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

News April 10, 2024

ఎన్నికల కోడ్.. అనపర్తిలో రూ.6.75 లక్షలు స్వాధీనం

image

అనపర్తికి చెందిన కాంట్రాక్టరు సతీష్‌ రెడ్డి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి కారులో వెళ్తుండగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద తనిఖీల్లో రూ.6.75 లక్షల నగదును మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును పోలీసులు తనిఖీ చేయగా.. రూ.6.75 లక్షల నగదు ఉంది. వాటికి సంబంధించిన ఎటువంటి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కె.గోవిందరావు తెలిపారు.

News April 10, 2024

ప.గో: నేడు ప్రజాగళం సభ.. CBN షెడ్యూల్ ఇదే

image

ప.గో జిల్లా తణుకు పట్టణంలో బుధవారం ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. మధ్యాహ్నం 3:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3:45 గంటలకు నరేంద్ర సెంటర్ చేరుకుంటారు. సాయంత్రం 5:30 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 7:00 నుంచి 8:30 వరకు నిడదవోలులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

News April 10, 2024

KNL: BCY పార్టీ అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలకు భారత చైతన్య యువజన పార్టీ(BCY) తరఫున MLA అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. మిగిలిన 10 స్థానాలకు కూడా త్వరలో MLA, నంద్యాల, కర్నూలు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నంద్యాల – చింతలపల్లె సుధాకర రావు, డోన్- తరి గోపుల, బాలసుబ్బయ్య (బాలు యాదవ్) పత్తికొండ – మిద్దె వెంకటేశ్వర్లు ఆలూరు – మోహన్ ప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.

News April 10, 2024

శ్రీకాకుళం: జీడిపంటకు భారీ నష్టం

image

జిల్లా వ్యాప్తంగా 46,743.63 ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. అందులో ఒక్క పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోనే సుమారు 24,753 ఎకరాల్లో జీడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల టన్నుల జీడి పిక్కలు దిగుబడి వస్తుండగా, సుమారు 13వేల మందికి ఈ పంట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కొన్ని తెగుళ్ల వల్ల పంటకు భారీ నష్టం వాటిల్లింది. 

News April 10, 2024

విశాఖ నుంచి బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం

image

విశాఖపట్నం విదేశీ ప్రయాణికులకు ఎయిర్ ఏషియా సంస్థ తీపి కబురు అందించింది. మంగళవారం బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సదుపాయాన్ని కల్పించింది. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో బ్యాంకాక్ నుంచి రాత్రి 10.05 కి బయల్దేరి విశాఖకు 11.20 కి ఫ్లైట్ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 11.50 కి విశాఖ నుంచి ఎయిర్ ఏషియా ఫ్లైట్ బయలుదేరి వెళ్తుంది. ఈ నేపథ్యంలో తొలి సర్వీస్ ప్రయాణికులకు పుష్ప గుచ్చాలు ఇచ్చి వీడ్కోలు పలికారు.

News April 10, 2024

పల్నాడు: నేటి జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే

image

పల్నాడు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర నేటి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం నుంచి ప్రారంభమవుతుంది. రొంపిచర్ల, విప్పర్ల, నకరికల్లు, దేవరంపాడు క్రాస్ రోడ్డు కొండమోడు మీదగా పిడుగురాళ్లకు చేరుకుంటుంది. పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ వద్ద సీఎం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కొండమోడు జంక్షన్ మీదుగా రాజుపాలెం, అనుపాలెం, రెడ్డిగూడెం మీదగా దూళిపాళ్ళ చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు.

News April 10, 2024

రామభద్రపురం: నిన్న టీడీపీ లోకి… నేడు వైసీపీ లోకి

image

మండల పరిధిలోని ఆరికతోట గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు మాజీ సర్పంచ్‌ పెంకి భీమయ్య ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. స్థానిక మండల వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి కండువాలు వేయించి పార్టీలో చేర్చారని చెప్పారు.

News April 10, 2024

ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

image

అనంతపురం నగరంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని STPO కార్యాలయంలో నగర పోలీస్ అధికారులతో సమావేశమై, ఎన్నికల వేళ తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. నగరం, పోలీస్ స్టేషన్ల పరిధిలో, భౌగోళిక స్థితిగతులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

News April 10, 2024

కృష్ణా: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం(MTM), తిరుపతి(TPTY) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07121 TPTY- MTM మధ్య నడిచే రైలును ఈ నెల 14 నుంచి మే 26 వరకు ప్రతి ఆదివారం, నెం.07122 MTM- TPTY మధ్య నడిచే రైలును ఈ నెల 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, పెడన, గుడివాడ స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.