Andhra Pradesh

News October 1, 2024

పుచ్చకాయలమడ గ్రామానికి 203 ఇళ్లు: సీఎం చంద్రబాబు

image

పుచ్చకాయలమడ గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నామని, ముఖ్యంగా ఇళ్ల సమస్య తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పుచ్చకాయలమడ గ్రామంలో 203 మందికి ఇంటి జాగాలు కొని ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం తెలిపారు. 48 మందికి పెన్షన్లు లేవని, వారికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు.

News October 1, 2024

వరద బాధితులకు భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ విరాళం

image

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం రూ.1,50,116 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.

News October 1, 2024

కలెక్టర్‌ని కలిసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే

image

ఇచ్ఛాపురం నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కవిటి, సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలంలో ప్రధాన సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

News October 1, 2024

పింఛన్ పంపిణీ@2PM: కర్నూలు 96.43%, నంద్యాల 94.26%

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లాలో 96.43%, నంద్యాల జిల్లాలో 94.26% పంపిణీ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 2,41,843 మందికి గానూ 2,33,204 మందికి, నంద్యాల జిల్లాలో 2,18,225 మందికి గానూ 2,05,691 మందికి పింఛన్ల సొమ్ము అందింది.

News October 1, 2024

చిత్తూరులో 90 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలియజేశారు. నగిరి, యాదమరి, పుంగనూరు మండలాలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. బంగారుపాలెం, వీకోట, రామకుప్పం మండలాలు చివరి మూడు స్థానాలలో నిలిచాయి. సాయంత్రం లోపు లక్ష్యాలను చేరుకునేలా పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

News October 1, 2024

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మందికి గాయాలు

image

కురబలకోట మండలంలోని సర్కార్ తోపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జేసీబీ సాయంతో వెలికి తీస్తున్నారు.

News October 1, 2024

ఒంగోలు: పింఛన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్

image

ఒంగోలులో నిర్వహించిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి పెన్షన్ దారుడికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ సుజాత, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.

News October 1, 2024

భీమవరంలో యువకుడి ఆత్మహత్య

image

భీమవరంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కె.మణికంఠ కుమార్(32) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మంగళవారం ఉదయం అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

News October 1, 2024

అక్టోబర్ 2 నుంచి గ్రామ సభలు: ప్రకాశం కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.

News October 1, 2024

కమలాపురం వద్ద చెట్టును ఢీకొన్న కళాశాల బస్సు

image

కమలాపురం పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన వ్యాను మంగళవారం ఉదయం చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే కళాశాలకు చెందిన వ్యాను విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా కొండాయపల్లె వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉండే చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.