Andhra Pradesh

News April 11, 2024

పార్వతీపురం: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

image

ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పార్వతీపురం మండలం హెచ్ కారడవలస గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పార్వతీపురం రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్ల బురిడీ గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళుతున్న ఆటో కారాడవలస సమీపంలో బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో పైలా సింహాచలం (67) మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామన్నారు.

News April 11, 2024

చిత్తూరు: మద్యం దుకాణాలపై ఆంక్షలు?

image

చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో .. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. కుప్పం మందుబాబులు కర్ణాటక దుకాణాలకు వెళ్తున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటి?

News April 11, 2024

రాయచోటిలో రమేశ్ రెడ్డి ప్రభావం ఎంత?

image

మాజీ ఎమ్మెల్యే రమేశ్ రెడ్డి తొలిసారి 1999లో లక్కిరెడ్డిపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి గడికోట మోహన్ రెడ్డిపై 10,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో మోహన్ రెడ్డి చేతిలో 13,052 ఓట్లతో ఓడిపోయారు. 2014, 19లో రాయచోటిలో పరాజయం పాలయ్యారు. 2019లో 66,128 ఓట్లు, 2014లో 62,109 ఓట్లు సాధించిన ఆయన టీడీపీకి రాజీనామా చేయడం తాజా ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

News April 11, 2024

కర్నూలు: ఈనెల 16న వైఎస్ షర్మిల ప్రచార యాత్ర

image

ఈనెల 16న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచార యాత్రను ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లాలోని బ్రాహ్మణ కొట్టుకూరు నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని గార్గేయపురంలోకి ప్రచార యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు కర్నూలులో రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. 17న పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో పర్యటించి, సాయంత్రం 6 గంటలకు కోడుమూరులో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహిస్తారు.

News April 11, 2024

తూ.గో: తెలుగు రాష్ట్రాల్లో ఎత్తైన గాలి గోపురాల ఆలయం

image

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో అపర భద్రాద్రిగా ఖ్యాతి గాంచిన కోదండ రామస్వామి వారి ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ఎత్తైన గాలి గోపురాలు గల రామాలయం ఇది ఒక్కటే. ఈ ఆలయాన్ని 1889వ సంవత్సరంలో నిర్మించారు. మయసభను తలపించేలా ఉండే అద్దాల మండపం
ఈ దేవాలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం.

News April 11, 2024

ఈనెల 14న సీఎం జగన్ గుడివాడ రాక

image

బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 14 సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్ యాత్ర గుడివాడ రానున్నట్లు, గుడివాడ కొడాలి నాని కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా.. భారీ బహిరంగ సభ నాగవరప్పాడు చివర అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో స్థానిక గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

News April 11, 2024

విశాఖలో గెలుపును నిర్ణయించేది వీరే..!

image

విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని గాజువాక మినహా విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పురుష ఓటర్లు ఎక్కవగా ఉంటే.. 2024 నాటికి మహిళా ఓటర్లు వారిని అధికమించారు. లోక్ సభ పరిధిలో ఇప్పటి వరకు 19,03,175 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 9,36,667, మహిళలు 9,66,389, ఇతరులు 119 మంది ఉన్నారు.

News April 11, 2024

ఏలూరులో ‘లవ్ మౌళి’ మూవీ టీం సందడి

image

ఏలూరులోని SVC మహల్‌లో హీరో నవదీప్ సందడి చేశారు. నవదీప్ నటించిన ‘లవ్ మౌళి’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఏలూరు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ.. లవ్ మౌళి చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు. రచయిత అనంత శ్రీరామ్, చిత్ర నటీమణులు, తదితరులు ఉన్నారు.

News April 11, 2024

సత్యసాయి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని కొత్త పల్లి గ్రామ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో విద్యుత్ షాక్‌తో రాధమ్మ అనే‌ మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. తన ఇంటి సమీపంలో పంచాయతీ బోరు ఉండడంతో వంట పాత్రలు కడగడానికి వెళ్ళగా.. విద్యుత్ తీగలు ఆమెకు తగలడంతో మృతి చెందినట్లు భర్త హనుమంతు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News April 11, 2024

ప్రకాశం: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

జిల్లాలోని రాచర్ల మండలం అనుములపల్లిలో ఉపాధి పనికి వెళ్లిన కూలీ గల్ల ఆంజనేయులు (55) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనిచేస్తుండగా ఆంజనేయులుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మిగతా కూలీలు గమనించి హుటాహుటిన రాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.