Andhra Pradesh

News September 19, 2025

కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్‌‌‌కు తెలపాలన్నారు. 9492250069 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News September 19, 2025

నెల్లూరు: రష్యాలో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

రష్యాలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ కయ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారని, భోజన వసతితో పాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. 18 నుంచి 20 ఏళ్ల వయస్సు కలిగి 75% ఇంగ్లీషులో మార్కులు సాధించిన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News September 19, 2025

‘విజయ’ సీటు కోసం వార్..!

image

నెల్లూరు విజయ డెయిరీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. 14 ఏళ్లుగా ఛైర్మన్‌గా కొనసాగుతున్న రంగారెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కీలకమైన ఈ పోస్టు కోసం సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నాయకులు పోటీపడుతున్నారు. మొదట సర్వేపల్లికి చెందిన బాబిరెడ్డి పేరు దాదాపు ఖాయమని ప్రచారం జరిగినప్పటికీ కోవూరు, ఆత్మకూరు నేతలు తీవ్రపోటీ ఇస్తున్నారు. ఫైనల్‌గా అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

News September 19, 2025

సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

image

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.

News September 19, 2025

మాజీ సీఎం జగన్ రూట్ మార్పు

image

తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ ప్రయాణంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో జగన్ వాహనశ్రేణి ప్రకాశం బ్యారేజీ మీదుగా గన్నవరం బయలుదేరింది.

News September 19, 2025

కడప: ఉల్లి రైతులకు శుభవార్త

image

ఉల్లి సాగు చేసిన రైతులంతా తమ పంటను రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో విక్రయించుకోవచ్చని, ఎటువంటి గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. కిలో రూ.12 చొప్పున రైతులు ఉల్లిని విక్రయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News September 19, 2025

డయేరియా బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

డయేరియాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం 33 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రోగులు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి ప్రబలిందని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.

News September 19, 2025

కడప: పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు..!

image

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్ద శెట్టిపల్లి వద్ద ఎర్రచందనం తరలించేందుకు వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 15 మంది కూలీలను అదుపులోకి తీసుకుంటూ సమాచారం. వీరి వెనుక ఉన్న ప్రధాన స్మగ్లర్ ఎవరనే దానిపై కడపకు తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

News September 19, 2025

గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సదుపాయం

image

రాబోయే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికుల కోసం టిక్కెట్ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గుంటూరు స్టేషన్‌లో సిబ్బంది ధరించే జాకెట్ల వెనుక భాగాన క్యూఆర్ కోడ్ అమర్చారు. ప్రయాణికులు యూటీఎస్, రైల్ వన్ యాప్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేసి కాగిత రహిత టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇకపై 5KM లోపు ఇంటి నుంచే జనరల్, ప్లాట్‌ఫామ్, సీజన్ టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం లభిస్తోంది.

News September 19, 2025

గుంటూరు జిల్లా రైతులకు శుభవార్త

image

గుంటూరు జిల్లాలో రైతుల అవసరాల నిమిత్తం తాజా ఎరువుల సరఫరా జరిగింది. గురువారం రెడ్డిపాలెం రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌కు 330 మెట్రిక్ టన్నుల యూరియా వ్యాగన్ల ద్వారా చేరింది. స్టాక్‌ను ఏడీఏ మెహనరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాకు వచ్చిన ఈ సరఫరాలో మార్క్‌ఫెడ్‌కు 250 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్లకు 80 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.