Andhra Pradesh

News July 15, 2024

హైకోర్టులో నందిగం సురేశ్ పిటిషన్‌ విచారణ.. రేపటికి వాయిదా

image

మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

News July 15, 2024

తూ.గో: యజమానిని కట్టేసి 40 కోడిపుంజుల చోరీ

image

ఉమ్మడి తూ.గో జిల్లా రాజవొమ్మంగి మండలం దూసారపాము గ్రామానికి చెందిన రైతు ఎల్.చంటి చేనులో పెంచుతున్న రూ.2 లక్షల విలువైన 40 కోడిపుంజులను దొంగలు ఎత్తుకెళ్లారు. చంటి కథనం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు తన చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి పందెం పుంజులను పట్టుకొని పోయారన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు MPTC సత్యనారాయణ తెలిపారు.

News July 15, 2024

ప్రతిపాదనలు తయారు చేయాలి: కృష్ణా JC

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పలు అంశాలపై సమీక్షించిన ఆమె పలు శాఖల అధికారులను మూలధన, వ్యయం ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా సీపీఓకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, ఆర్డీఓ ఎం వాణి తదితరులు పాల్గొన్నారు.

News July 15, 2024

ఏలూరు: ఘోరం.. పసికందును చంపిన CRPF కానిస్టేబుల్

image

ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. లింగపాలెం మండలం పాశ్చానగరంలో CRPF కానిస్టేబుల్ సీహెచ్.బాలాజీ 2 నెలల పసిబాబును హతమార్చాడు. పాత కేసు విషయంలో సోమవారం ఏలూరు కోర్టుకు వచ్చిన బాలాజీ.. అక్కడ భార్య, ఆమె తండ్రిని చితకబాదాడు. అనంతరం పాశ్చానగరంలోని ఇంటికెళ్లి మరదలు, అత్తను తీవ్రంగా కొట్టి, మరదలి 2 నెలల బాబు పీక నులుమి చంపాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 15, 2024

శ్రీకాకుళం: ‘నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేయండి’

image

రాష్ట్ర ప్రభుత్వం ‘నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం’ అమలు చేసి, తమ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని ‘శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు ఆదినారాయణ మూర్తి మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు లక్ష నిర్మాణ కార్మిక కుటుంబాలు, సంక్షేమ చట్టం నిలుపుదల వలన ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

News July 15, 2024

కర్నూలు: గూడ్స్ ట్రైన్ కిందపడి వ్యక్తి మృతి

image

మద్దికేర మండల కేంద్రానికి సమీపాన ఉన్న మల్లప్ప గేటు దగ్గర సోమవారం తెల్లవారుజామున గూడ్స్ ట్రైన్ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ మేరకు గుంతకల్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో గుర్తించలేకపోయామన్నారు. ఎవరైనా గుర్తిస్తే గుంతకల్లు ఆర్పీఎఫ్ స్టేషన్ ఫోన్ నంబర్‌కు 9550111589 తెలపాలని కోరారు.

News July 15, 2024

నరసరావుపేట: కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ శ్రీనివాసరావు

image

పల్నాడు జిల్లాకు నూతన ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం కలెక్టర్ పి. అరుణ్ బాబును కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలపై కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.

News July 15, 2024

విజయనగరంలో ఇద్దరు చిన్నారులు మిస్సింగ్

image

విజయనగరం పట్టణానికి చెందిన బూర ప్రసాద్, దొడ్డిరేసి రాఘవేంద్రరావు అనే ఇద్దరు పిల్లలు కనబడడం లేదని స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హరిబాబు నాయుడు సోమవారం తెలిపారు. పిల్లల ఆచూకీ తెలిసిన వారు విజయనగరం 84990 04114, 91211 09419 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు.

News July 15, 2024

ధర్మవరం ఆర్టీసీ బస్సు దగ్ధం.. జిల్లావాసులకు గాయాలు

image

తెలంగాణ రాష్ట్రం మహాబూబ్ నగర్(D) బురెడ్డిపల్లి దగ్గర హైదరాబాద్ నుంచి ధర్మవరం వస్తున్న ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొంది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తి దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మెుత్తం 15మంది గాయపడ్డగా వారిలో అనంతపురం జిల్లాకు చెందిన సంజీవ, సునీల్, గాయత్రిలు ఉన్నారు. వారు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

News July 15, 2024

నాయుడుపేట గురుకులం ప్రిన్సిపల్, వార్డెన్‌ సస్పెండ్

image

నాయుడుపేట గురుకులం విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ దాదాపీర్, వార్డెన్ విజయభాస్కర్‌ను కలెక్టర్ వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళపై మండిపడ్డారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.