Andhra Pradesh

News July 8, 2024

అన్నవరం దేవస్థానానికి 2 కొత్త బస్సులు

image

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.

News July 8, 2024

విశాఖ మన్యంలో సీతాఫలాల విక్రయాలు ప్రారంభం

image

సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. పాడేరు ఘాట్‌లోని వంట్లమామిడి, 12వమైలురాయి జంక్షన్ వద్ద గిరిజన రైతులు అమ్మకాలను ప్రారంభించారు. పక్వానికి వచ్చిన 10 పండ్ల బుట్టను సైజును బట్టి రూ.150 నుంచి రూ.200కు విక్రయిస్తున్నారు. స్థానికులతో పాటు సందర్శకులు కొనుగోలు చేస్తున్నారు. వంట్లమామిడి, సలుగు, దేవాపురం, మినుములూరు, మోదాపల్లి, వనుగుపల్లి తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సీతాఫలం తోటలు ఉన్నాయి.

News July 8, 2024

కోనసీమ: పంట కాలువలో ‘దెయ్యం చేప’

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం అగ్రహారం పంట కాలువలో ఆదివారం స్థానిక రైతులకు అరుదైన ‘డెవిల్ ఫిష్’ దొరికింది. ఒంటిపై మచ్చలతో ఉన్న ఈ చేపను డెవిల్ ఫిష్ (దెయ్యం చేప)గా పిలుస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వాటి చుట్టూ ఉండే చేపలను గాయపరిచి, చంపి తినడం ఈ చేపలకు అలవాటని అన్నారు. ఇవి ఉన్న చోట మిగతా చేపలు అంతరించిపోతాయని పేర్కొన్నారు.

News July 8, 2024

నేటి నుంచి పిన్నెల్లి విచారణ

image

మాచర్ల YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజు పాల్వాయిగేట్‌లో ఈవీఎం ధ్వంసం, TDP ఏజెంట్‌ శేషగిరిరావుపై దాడి, కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి ఆయన్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు (8, 9 తేదీల్లో) నెల్లూరు జైలులోనే ఆయన విచారణ జరగనుంది. విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

News July 8, 2024

నెల్లూరు: DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

నెల్లూరు జిల్లాకు చెందిన SC, ST, BC కులాలకు చెందిన DSC అభ్యర్థులకు నెల్లూరులోని BC స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఆ శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో రూ.3 వేలు స్టైపెండ్, స్టడీ మెటీరియల్‌ అందజేస్తారన్నారు. వివరాలకు నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌‌లో సంప్రదించాలని అన్నారు.

News July 8, 2024

పల్నాడు: ‘విత్తనం.. క్రయవిక్రయాల్లో జాగ్రత్త అవసరం’

image

ఖరీఫ్‌ సీజన్‌ రావడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆయా షాపుల నిర్వాహకులు మోసాలకు పాల్పడకుండా వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఎరువులు విత్తనాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, విత్తన ఎరువుల దుకాణాలపై నిరంతరం నిఘా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు.

News July 8, 2024

చీరాల: ఆడపిల్లలు పుట్టారని.. ఇంటి నుంచి గెంటేశారు

image

చీరాల కొత్తపాలేనికి చెందిన మణికంఠరెడ్డి, కుసుమాంజలికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా పాప పుట్టగా, కుసుమాంజలి గర్భవతిగా ఉన్న సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. కుసుమాంజలికి రెండో కాన్పులో ఆడ కవలలకు జన్మనిచ్చింది. దీంతో అత్తా, మామ, మరిది ఇంట్లోకి రానివ్వలేదని అత్తింటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. కుసుమ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి ఉచితంగా ఇసుక

image

నేటి నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి రానుంది. జిల్లాలో రెండు నిల్వకేంద్రాల నుంచి ఇసుక సరఫరా చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా నిల్వ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుకను టన్ను రూ.340 ధరకు సామాన్యులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News July 8, 2024

మదనపల్లెలో భార్యపై కత్తితో దాడి

image

భార్యపై భర్త కత్తితో దాడిచేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. టూ టౌన్ పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె, చౌడేశ్వరీ నగర్లో ఉండే ఎస్.ఆర్.దుర్గ (28), కే.భాస్కర్ నాయుడుకు ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భాస్కర్ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యపై అనుమానంతో కొడుతూ వుండేవాడు. రాత్రి కత్తితో దాడి చేయగా దుర్గ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

News July 8, 2024

ఏలూరు: 3ఏళ్లుగా పరారీలో.. ఎట్టకేలకు చిక్కాడు

image

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పరారీలో ఉన్న గోడే పశుపతి రమణను 3 సంవత్సరాల తర్వాత పట్టుకున్నట్లు ఎస్సై రాజారెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. 3 సంవత్సరాల కింద గంజాయి రవాణా కేసులో కారు, 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న రమణను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశామని ఎస్సై పేర్కొన్నారు.