Andhra Pradesh

News July 7, 2024

నెల్లూరు: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

image

రైలులో నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగింది. గాంధీనగర్‌లో నివాసముంటున్న నసీర్ నాయుడుపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం నాయుడుపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ ప్రెస్‌లో నెల్లూరుకు బయలుదేరాడు.  వేదాయపాళెం రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

News July 7, 2024

రాయచోటి: ఆన్‌లైన్ మోసంపై కేసు నమోదు

image

పెట్టుబడులపై అధిక లాభాలు ఇస్తామని ఆన్‌లైన్ ద్వారా మోసానికి పాల్పడిన ఓ యాప్పై కేసు నమోదు చేసినట్లు బి. కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టణానికి చెందిన మన్సూర్ అలీ ఆన్‌లైన్ ద్వారా ఓ యాప్‌కు ఇటీవల విడతల వారీగా రూ.3,14,300 డబ్బు పంపాడు. అయితే ఈ నగదును తిరిగి చెల్లించకుండా బాధితుడి ఖాతాను మూసివేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి ఫిర్యాదు ఇవ్వడంతో సీఐ కేసు నమోదు చేశారు.

News July 7, 2024

అనకాపల్లి: బాలికపై కక్ష కట్టి హత్య..!

image

రాంబిల్లి(మ) కొప్పుగుండుపాలేనికి చెందిన B.దర్శిని(14)హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కశింకోటకు చెందిన బి.సురేశ్(26) కొప్పుగుండుపాలెంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఏడాదిగా బాలిక వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై పోక్సో కేసుపెట్టి జైలుకు పంపారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్‌పై వచ్చి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

News July 7, 2024

కాకినాడ: రేబిస్‌తో కార్మిక నాయకుడు మృతి

image

ప్రపంచ జూనోసిస్ డే రోజునే ప్రాణాంతక రేబిస్ వ్యాధితో కార్మిక నాయకుడు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. తాళ్లరేవు మండలం జెల్లావారిపేటకు చెందిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మందనక్క తనుకురాజు (64) నెల క్రితం కుక్కకాటుకు గురయ్యాడు. వైద్యం చేయించుకోగా 2 రోజుల క్రితం అతనికి రేబిస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.

News July 7, 2024

VZM: మంత్రి శ్రీనివాస్‌కు డిజిటల్ అసిస్టెంట్స్ వినతి

image

ఉమ్మడి జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. డిజిటల్ ‌అసిస్టెంట్ల ఉన్నత విద్యార్హతలు, జాబ్ చార్ట్‌లో లోపాలు మంత్రికి తెలియజేశారు. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించాలని కోరారు. డిజిటల్ అసిస్టెంట్స్‌ని స్కూల్స్‌లో కంప్యూటర్ టీచర్ లేదా జూనియర్ అసిస్టెంట్‌గా మార్చాలన్నారు.

News July 7, 2024

ఒంగోలు: అర్ధరాత్రి ఫోన్ చేసి మహిళకు వేధింపులు

image

మద్యం మత్తులో అర్ధరాత్రి సీనియర్ పోలీస్ అధికారి ఓ మహిళా సిబ్బందికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి మహిళా పోలీసుకు ఫోన్ చేసి ‘మీరు చాలా బాగుంటారు, భలే ఉంటారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె కాల్ రికార్డ్ ఆధారంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఎస్పీ వెంటనే ఆ అధికారిని రిలీవ్ అయి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలిసింది.

News July 7, 2024

కృష్ణా: సైకిల్‌ పంపుతో దాడిచేసి హత్య.!

image

బంటుమిల్లి మండలం జానకిరామపురం వ్యాపారి చిగురుశెట్టి సుభాశ్ (42) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యారు. DSP తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నారాయణపురంలో ఆటోలో ఉల్లి డెలివరీ చేసేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు గాలికొట్టే పంపుతో దాడి చేసినట్లు తెలిపారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆటోను పక్కనున్న పంట బోదెలోకి తోసేశారు. దర్యాప్తు చేస్తున్నామని మచిలీపట్నం DSP సుభాని తెలిపారు.

News July 7, 2024

శ్రీకాకుళం: అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

image

భారత ప్రభుత్వం అగ్నివీర్ వాయుసేన విభాగంలో అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొత్తలంక సుధా శనివారం తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 8 నుంచి 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులని స్పష్టం చేశారు.

News July 7, 2024

పుత్తూరు: రూ.14.18 లక్షలు స్వాహా చేసిన ఆర్పీ

image

స్వయం సహాయక సంఘాల నగదు రూ.14.18 లక్షలు ఆర్పీ భాగ్యలక్ష్మి స్వాహా చేయడంతో బాధితులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు.. పుత్తూరులో ఆర్పీ భాగ్యలక్ష్మి పరిధిలో 28 సంఘాలున్నాయి. 2016-18 మధ్యలో 13 సంఘాలకు సంబంధించి పొదుపు, గ్రూపులకు వచ్చిన బ్యాంకు రుణాలు కలిపి రూ.14.18 లక్షలు స్వాహా చేసినట్లు సభ్యులు గుర్తించారు. సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News July 7, 2024

ఇసుక కోసం ముందుగా వచ్చిన వారికే ప్రాధాన్యత: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలులోకి రానుందని, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని శనివారం అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని గుండిమెడ, మున్నంగి, కొల్లిపర డిపో, తాళ్లాయపాలెం, లింగాయపాలెం నుంచి సరఫరా చేస్తారని, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.