Andhra Pradesh

News July 5, 2024

పార్వతీపురం వైసీపీ ఆఫీస్‌కి రెండోసారి నోటీసులు

image

పార్వతీపురం వైసీపీ జిల్లా కార్యాలయానికి వార్డు సచివాలయాల టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలు గురువారం రెండోసారి నోటీసును అంటించారు. పట్టణంలోని బెలగాంలో 16వ వార్డులో సాయినగర్‌ కాలనీకి ఆనుకుని అనుమతులు పొందకుండా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాసరావు ఆదేశాలతో సిబ్బంది నోటీసులు అంటించారు.

News July 5, 2024

కడప: దొంగగా మారిన ఇంజినీరింగ్ విద్యార్థి

image

ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన ఇల్లూరు హరినాథరెడ్డి ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతున్నాడు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. రైళ్లలో తిరుగుతూ ఆదమరిచి నిద్రించే వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు దొంగిలించి వాటిని బెంగళూరు, గోవాలో విక్రయిస్తున్నాడు. సెల్ ఫోన్లు చోరీ చేస్తూ చీరాల పోలీసులకు దొరికిపోయాడు. రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ వివరాలు తెలిపారు.

News July 5, 2024

కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్

image

బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్‌‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మూడేళ్లుగా తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు నిన్న కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ప్రొహిబిషన్, ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎం.సరోజనమ్మ 14 రోజుల రిమాండ్ విధించడంతో సుధాకర్‌ను జిల్లా కారాగారానికి తరలించారు.

News July 5, 2024

పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఫిర్యాదు

image

టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీకి ఫిర్యాదు చేశారు. మంగంపేట ముగ్గురాయి గనుల అక్రమాలపై విచారణ జరిపాలని కోరారు. గనుల్లో రూ.2 వేల కోట్ల దోపిడీ చేశారని తెలిపారు. ఎంప్రెడా కంపెనీ ముసుగులో పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. మాజీ ఎండీ వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అక్రమార్కులకు అండగా నిలిచారన్నారు.

News July 5, 2024

అనంతపురంలో 6న జాబ్ మేళా

image

ఉమ్మడి అనంతపురం జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ నెల 6న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి తెలిపారు. ఓ కంపెనీలో క్రెడిట్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18-27 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు కోర్టు రోడ్డు సమీపంలో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయానికి ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

News July 5, 2024

గుంటూరు: ఆన్లైన్ మోసం.. రూ.10లక్షలు స్వాహా

image

ఆన్లైన్ మోసంపై అరండల్‌ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరిటెపా డుకు చెందిన హేమంత్ కుమార్ టెలిగ్రామ్ యాప్లో ఓ టాస్క్ ఆపరేట్ చేశాడు. అందులో టాస్క్ పెట్టి పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని చెబుతారు. టాస్క్ నిర్వాహకులు చెప్పిన విధంగా పలుమార్లుగా రూ.10లక్షలు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 5, 2024

విజయవాడలో భారీగా నకిలీ సిగరెట్లు స్వాధీనం

image

విజయవాడలో కేంద్ర జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో రూ.2.46కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. గోల్డ్ స్టెప్ టుబాకో సంస్థ వీటిని తయారు చేసినట్లు గుర్తించిన అధికారులు, బిహార్ నుంచి విజయవాడకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు.

News July 5, 2024

జగన్ నువ్వు మంచి చేయలేదు.. ముంచేశావ్: నారా లోకేశ్

image

మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ‘జగన్ నువ్వు మంచి చెయ్యలేదు.. ముంచేశావ్’ అని ‘X’ వేదికగా పోస్ట్ చేశారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం పరామర్శించిన జగన్.. మీడియాతో మాట్లాడారు. తాము ఎన్నికల్లో మంచి చేసి ఓడిపోయామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై లోకేశ్ తాజాగా స్పందించారు.

News July 5, 2024

మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన ఎమ్మెల్యే ఉగ్ర

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గం అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఉగ్ర తెలిపారు.

News July 5, 2024

బడి బయట పిల్లలను గుర్తించండి: ఆర్జేడీ

image

ఇప్పటికీ బడికి వెళ్లకుండా బడి బయట ఉన్న పిల్లలను వెంటనే గుర్తించాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలుకు వచ్చిన ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గతేడాది కంటే పెంచాలని సూచించారు. విద్యా కానుక కిట్ల పంపిణీ 100% పూర్తి చేయాలన్నారు.