Andhra Pradesh

News July 3, 2024

పోలవరంలో మరోసారి చిరుత కలకలం

image

ఏలూరు జిల్లా పోలవరంలో మరోసారి చిరుత కలకలం రేపింది. అటవీ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సున్నాలుగండికి చెందిన మడకం పుల్లారావు తన పశువుల పాకలో కట్టేసిన మేక కనిపించడం లేదని సమీప అటవీ ప్రాంతంలో వెతికారు. తల లేకుండా మొండెంతో ఉన్న మేక కళేబరం కనిపించింది. పాదముద్రల ఆధారంగా చిరుత దాడి చేసి చంపినట్లు అధికారులు ధ్రువీకరించారు. కొద్దిరోజుల కింద కూడా ఇదే మండలంలో చిరుత మేకను చంపేసిన విషయం తెలిసిందే.

News July 3, 2024

శ్రీకాకుళం: ఎంపీ కలిశెట్టి జిల్లా పర్యటన వాయిదా

image

విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా పర్యటన ఈనెల 5న తేది నుంచి 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. సీఎం చంద్రబాబు అదే రోజున ఢిల్లీలో పర్యటించనున్న సందర్భంగా ఎంపీ కలిశెట్టి జిల్లా పర్యటన వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కూటమి నేతలు, ప్రజలు గమనించాలని కోరారు.

News July 3, 2024

కావలిలో హోటల్ సీజ్ చేసిన అధికారులు

image

కావలి పట్టణంలోని ఓ డాబా హోటల్ లో బుధవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, తదితర తప్పిదాలను అధికారులు గుర్తించారు. రోజుల తరబడి మాంసం నిల్వ ఉండటంతో వెంటనే హోటల్‌ను సీజ్ చేసి గేట్లకు సీల్ వేశారు. వారు మాట్లాడుతూ.. హోటల్స్‌లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 3, 2024

కడప: YVUలో డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రారంభం

image

వైవీయూలో 2024-25 విద్యా సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీకాం కంప్యూటర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎస్.రఘునాథరెడ్డి వెల్లడించారు. ప్రొ. కృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం-2020ని అనుసరించి కోర్సులను తెచ్చామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువుకోవచ్చన్నారు.

News July 3, 2024

దుర్గిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

దుర్గి మండలం బుగ్గవాగు రిజర్వాయర్లో ఒక గుర్తు తెలియని మృతదేహం బుధవారం లభ్యమైనట్లు స్థానికులు తెలియజేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి దుర్గి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి సంబంధించిన సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

News July 3, 2024

రాజాం: మంత్రి శ్రీనివాస్‌తో ఎమ్మెల్యే కళా భేటీ

image

రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటర్రావు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని పలు సమస్యలపై ఇరువురు చర్చించారు. అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా తమ నివాసానికి విచ్చేసిన శ్రీనివాస్‌ను కళా ఘనంగా సన్మానించారు.

News July 3, 2024

VZM: పోక్సో కేసులో నిందితులకు జైలు శిక్ష

image

బాలికను అపహరించి.. అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక దిశ పోలీస్ స్టేషన్‌లో 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ కేసులోని నిందితులకు కోర్టు జైలు శిక్ష విధించిందని దిశ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. నిందితులుగా ఉన్న పూసపాటిరేగ మం. తిప్పలవలసకు చెందిన రాగితి.సత్తయ్య(A1)కు రూ.2,500 జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష, వాసుపల్లి కన్నయ్య(A2)కు రూ.500 జరిమానా, ఏడాది శిక్ష ఖరారైందని చెప్పారు.

News July 3, 2024

ఈనెల 6న శ్రీకాకుళం జిల్లాకు విజయనగరం ఎంపీ

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈనెల 6న శనివారం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. ఇటీవల ఢిల్లీలో కలిశెట్టి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీకాకుళం మొదటిసారి వెళ్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్త నుంచి కలిశెట్టి ఎంపీగా అత్యధిక మెజారిటితో గెలిచిన విషయం తెలిసిందే.

News July 3, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించడంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 3, 2024

శ్రీకాళహస్తి: ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు శిక్ష

image

శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముగ్గురు ముద్దాయిలకు శిక్ష విధిస్తూ తిరుపతి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నిరోధక కోర్టు జూనియర్ సివిల్ జడ్జి బుధవారం తీర్పును వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం ఆటోనగర్ కు చెందిన కొల్లగుంట శివ, తిరుపతికి చెందిన బోయలపల్లి మురళి, మురళి లకు 6నెలలు జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించారు.