Prakasam

News May 10, 2024

గిద్దలూరు: ఓటుకు నోటులో ఇద్దరు అరెస్ట్

image

గిద్దలూరు మండలంలోని ముళ్లపాడులో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరిని శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.29,500 నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వెల్లడించారు. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News May 10, 2024

ప్రకాశం: ప్రచారం @ మరో 24 గంటలే

image

ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. ఇప్పటికే చంద్రబాబు, జగన్ జిల్లాలో విస్త్రత పర్యటనలు చేశారు. మరికొన్నిచోట్ల డబ్బుల ప్రలోభాలకు తెరలేసింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

News May 10, 2024

మూడు రోజుల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, భద్రతపై నిత్యం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిదని కలెక్టర్ దినేష్ కుమార్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఓలు, ఏపీవోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

News May 10, 2024

ప్రకాశం: మే 13న కార్మిక సంస్థలకు సెలవు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన పోలింగ్ రోజున దుకాణాలు, కార్మిక సంస్థలకు ఈసీ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లుగా జిల్లా ఉపకార్మిక కమిషనర్ శ్రీనివాస కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు వేయటానికి అర్హులైన ప్రతి ఒక్కరికి పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్మిక దుకాణాల చట్టం అనుసరించి నిబంధనలు పాటించాలన్నారు.

News May 10, 2024

ప్రకాశం: సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్

image

జిల్లాలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,340 సెంటర్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందులో యర్రగొండపాలెం నియోజకవర్గంలో 162, దర్శిలో 187, సంతనూతలపాడులో 163, ఒంగోలులో 193, కొండపిలో 168, మార్కాపురంలో 147, గిద్దలూరులో 168, కనిగిరిలో 152 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే సగానికి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరగనుంది.

News May 10, 2024

 ప్రకాశం: రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

image

ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కావటానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన YCP, TDP, కాంగ్రెస్ చావో రేవో అన్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ముగియడానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో ఇరు పార్టీల ప్రచారాల ఊపందుకున్నాయి. ఒకవైపు ఆత్మీయ సమావేశాల పేరుతో వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారితో సమావేశమవుతూ, మరోవైపు వ్యూహాలు రచిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

News May 10, 2024

ప్రకాశం జిల్లాలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లా మొత్తంలో ఒంగోలు ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉద్యోగులు 99.07% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉద్యోగులు అత్యధికంగా దర్శిలో 98.76% మంది ఓటేశారు. నియోజవర్గాల వారీగా చూస్తే సంతనూతలపాడు 97.52, ఒంగోలు 97.28, కొండపి 96.24, మార్కాపురం 90.89, గిద్దలూరు 94.64, కనిగిరి 93.80 శాతాలుగా నమోదయ్యాయి.

News May 10, 2024

ప్రకాశ: పత్రికలకు, నాయకులకు కలెక్టర్ సూచనలు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈనెల 12, 13 తేదీల్లో పత్రికల్లో ప్రచురించే ప్రకటనలకు సంబంధించి పోటీలో ఉండే రాజకీయ అభ్యర్థులు రెండు రోజులు ముందుగానే ఎంసీఎంసీ ధ్రువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పత్రికల యాజమాన్యాలు కూడా ధ్రువీకరణ ముందస్తు అనుమతి లేకుండా అభ్యర్థుల ప్రకటనలను ప్రచురించకూడదని సూచించారు.

News May 10, 2024

నేడు ఒంగోలుకు రానున్న చంద్రబాబు

image

నారా చంద్రబాబు నేడు ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం అద్దంకి బస్టాండ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి ఉత్తర బైపాస్‌లోని బృందావనం కల్యాణ మండపంలో బస చేసి, శనివారం ఉదయం వెళ్తారు. దీంతో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు ఉండటంతో చంద్రబాబు పర్యటన జిల్లాలో ఆసక్తికరంగా ఉంది.

News May 10, 2024

ప్రకాశం: అకాల వర్షానికి 152 ఎకరాల అరటి నష్టం

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 7న కురిసిన అకాల వర్షానికి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వై గోపీచంద్ తెలిపారు. ఉద్యాన పంటలు అరటి 152 ఎకరాలు, బొప్పాయి 45 ఎకరాలు, కొంత మొక్కజొన్న పంట వర్షంతో పాటు వీచిన గాలులకు నేలకొరిగి దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు.