Prakasam

News April 28, 2024

చీమకుర్తి: భారీగా గోవా మద్యం పట్టివేత 

image

చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో భారీ మద్యం డంపును సెబ్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన గంగిరేగుల వెంకట్‌రావు గోవా నుంచి తెచ్చిన 180ML బాటిళ్లు 1001లను మరోచోటకి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు సెబ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ.. అతని కాల్ డేటా ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.

News April 28, 2024

తర్లుపాడు: గుంటలో పడి వ్యక్తి మృతి

image

తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలోని సీతానాగులవరం గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోపడి చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్లుపాడు ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 28, 2024

దర్శిలో కత్తులతో దాడి.. యువకుడు మృతి

image

దర్శి మండలంలోని రాజంపల్లిలో ఆదివారం ఇద్దరు వ్యక్తులపై కొందరు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రురాలిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 28, 2024

కందుకూరులో వైసీపీపై అధికారుల కొరడా

image

ఆదివారం సాయంత్రం కందుకూరులో సీఎం జగన్ సభ జరుగుతున్న సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల అధికారులు కొరడా ఝళిపించారు. సీఎం సభ సందర్భంగా వైసీపీ అభ్యర్థి బుర్రా మధు, జగన్ ఫొటోలు ఉన్న అనేక ఫ్లెక్సీలు అనుమతి లేకుండా పట్టణంలో వెలిశాయి. దానిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది హడావుడిగా ఫ్లెక్సీలన్నింటిని తొలగించారు.

News April 28, 2024

ప్రకాశం: బదిలీ టీచర్ల జీతాలకు లైన్ క్లియర్

image

జిల్లాలో గత ఏడాది ప్రభుత్వం ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపునకు లైన్ క్లియర్ అయింది. తొమ్మిది నెలలుగా జీతాల కోసం నిరీక్షిస్తున్న వారి కల ఫలించింది. వీరి జీతాల చెల్లింపునకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 34 మంది టీచర్లకు జీతాలు నిలిచిపోయాయని డీఈవో సుభద్ర తెలిపారు.

News April 28, 2024

మార్కాపురం: కందులపై కేసు నమోదు

image

మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లుగా మార్కాపురం పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ శనివారం తెలిపారు. ఈనెల 25వ తేదీన నామినేషన్ సందర్భంగా కళాశాల రోడ్డులోని ఓ టీడీపీ నేత వెంచర్ లో అనుమతి లేకుండా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ అంశాలపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

News April 28, 2024

486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

image

ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,183 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 486 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News April 28, 2024

30న యర్రగొండపాలెంకు చంద్రబాబు రాక

image

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30వ తేదీన యర్రగొండపాలెంకు రానున్నారు. ఉదయం 10 గంటలకు నియోజకవర్గాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పార్టీ జిల్లా నాయకులకు సమాచారం అందగా వారు చంద్రబాబు నాయుడు సభ ఏర్పాట్లలో సన్నద్ధమయ్యారు.

News April 28, 2024

ఒంగోలులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలులోని గొడుగుపాలెంలో శనివారం వేకువజామున జరిగింది. ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న షేక్ ముస్తాక్ కుమార్తె ఆరిఫా సుల్తానా(19) నగరంలోని రైజ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.

News April 28, 2024

దర్శి: నిద్రిస్తున్న బాలికపై అత్యాచార యత్నం

image

బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన ముండ్లమూరు మండలంలో శనివారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, తల్లిదండ్రులతో కలిసి ఇంటి మేడపై నిద్రిస్తోంది. దోమలు కుడుతున్నాయని సోదరుడితో కలిసి కిందికి దిగి ఇంటి వరండాలో నిద్రపోయింది. అదే గ్రామానికి చెందిన బ్రహ్మయ్య బాలిక నోరు మూసి, అరిస్తే చంపేస్తానని బెదిరించి, అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.