Prakasam

News April 17, 2024

మే 5 నుంచి ఇంటి వద్ద ఓటు: కలెక్టర్

image

మే 5వ తేదీ నుంచి అర్హత ఉన్నవారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వికలాంగులకు ఎన్నికల కమిషన్ ఈ అవకాశం కల్పించిందని కలెక్టర్ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తామని కలెక్టర్ తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

News April 17, 2024

రాచర్ల: ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

image

రాచర్ల మండలం చినగానపల్లె గ్రామ సమీపంలో బుధవారం ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News April 17, 2024

అద్దంకి వాసికి యుపీఎస్సీ ఫలితాల్లో 873వ ర్యాంక్

image

అద్దంకికి చెందిన జగన్నాథం రాహుల్ యూపీఎస్సీ ఫలితాల్లో 873వ ర్యాంక్ సాధించారు. తల్లిదండ్రులు బాబూరావు, ప్రభావతి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి ముగ్గురు పిల్లలు కాగా వారిలో మొదటి కుమారుడు రాహుల్. 1 నుంచి 5 వరకు అద్దంకిలో, 6, 7 తరగతులు గుంటూరులో, విజయవాడలో ఇంటర్, ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చదివారు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించిన రాహుల్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News April 17, 2024

ప్రకాశం: మాజీ కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 780వ ర్యాంక్

image

జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకి చెందిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో 780 ర్యాంక్ సాధించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో ఒంగోలులో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఐఏఎస్ అవ్వాలన్నా దృఢ సంకల్పంతో చదివి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా పలువురు ఉదయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News April 17, 2024

ప్రకాశం: ఎలుకల మందు తిని యువకుడు మృతి

image

ఎలుకల మందు తిని యువకుడు మృతిచెందిన ఘటన కొత్తపట్నం మండలం రంగాయపాలెం పంచాయతీ క్రాంతినగర్‌లో మంగళవారం జరిగింది. SI సాంబశివరావు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి కల్యాణ్‌ (39) చేపల వేటతో జీవనం సాగిస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు చేసి తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

News April 17, 2024

ప్రకాశం: ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

image

ఇంటర్ అడ్మిషన్లపై షెడ్యూల్ ను బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ విడుదల చేసినట్లు ఆర్ ఐవో సైమన్ విక్టర్ తెలిపారు. అడ్మిషన్లను రెండు దశల్లో నిర్వహిస్తారు. మే 15 నుంచి కళాశాలల్లో దరఖాస్తులు విక్రయిస్తారు. మే 22నుంచి విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. రెండో దశ అడ్మిషన్లకు జూన్ 10నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 1కి అడ్మిషన్లు పూర్తి చేయాలి.

News April 16, 2024

ప్రకాశం జిల్లాలో ఓటు నమోదుకు 8,320 దరఖాస్తులు

image

ప్రకాశం జిల్లాలో వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ క్రమంలో జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి ఓటు హక్కు నమోదు కోసం 8,320 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి సంబంధిత బిఎల్ఓ‌లకు పంపారు. వారం రోజుల్లో ఓటు హక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి అర్హత ఉంటే ఓటు హక్కు కల్పించనున్నారు.

News April 16, 2024

ప్రకాశం: దొంగలు హల్చల్.. గాయపడ్డ భార్యాభర్తలు

image

జిల్లాలోని అర్దవీడు మండలం మొహిద్దీన్ పురంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలో 2 గంటల సమయంలో గొర్రెల దొంగతనానికి వచ్చి దొంగలు గొర్రెల కాస్తున్న దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో గొర్రెల కాపరికి స్వల్ప గాయాలు కాగా.. భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంగళగిరి హస్పిటల్‌కు తరలించారు

News April 16, 2024

18 నుంచి నామినేషన్లు స్వీకరణ: సబ్ కలెక్టర్

image

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న ఎన్నికల కమిషన్ జారీ చేస్తుందని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరిస్తామని తెలిపారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్‌కు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.

News April 16, 2024

ప్రకాశం: రైలు పట్టా జారిపడి వ్యక్తి మృతి

image

జిల్లాలోని కురిచేడు మండలం మర్లపాలెం వద్ద రైల్వే ట్రాక్‌పై ఉన్న పాత పట్టాలను లారీలోకి లోడు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఒకటి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం బిహార్‌కు చెందిన అనిష (40) రైలు పాత పట్టాలను లారీకి లోడ్ చేస్తుండగా, అతనిపై రైలు పట్టా జారి పడింది. క్షతగాత్రుడిని దర్శి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.