Srikakulam

News July 2, 2024

13న తోటపల్లి పాత ఆయకట్టు నీటి విడుదల

image

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 64వేల ఎకరాల పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈనెల 13న సాగునీరు విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ డీఈఈ ధమలపాటి రవికుమార్ తెలిపారు. ఈ ఖరీఫ్‌లో వీరఘట్టం, పాలకొండ, బూర్జ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వంగర మండలాలకు సాగునీటిని ప్రణాళిక బద్ధంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

News July 2, 2024

కేదార్నాథ్‌లో జనసేన జెండాతో శ్రీకాకుళం యువకుడు

image

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బేరిపేటకు చెందిన కోరాడ హరీష్ కుమార్ కేదార్నాథ్ యాత్రలో జనసేన జెండాను ఎగరవేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 సీట్లకు 21 గెలవడం, అలాగే తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు ఈ యాత్ర ప్రారంభించానని తెలిపాడు.

News July 2, 2024

శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ నియామకం

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన శ్రీకాకుళం కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో ఆయన నేతృత్వంలోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.

News July 2, 2024

SKLM: పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి: కలెక్టర్

image

పరిశ్రమలకు మంజూరు చేసిన భూమి వివరాలు తెలపాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టరేట్లో ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు. పరిశ్రమలకు మంజూరు చేసిన భూమిలో ఇండస్ట్రీ లేకపోతే వాటి వివరాలు, అలాగే ల్యాండ్ కావాలని కోరిన వివరాలు తెలియజేయాలని కోరారు.

News July 2, 2024

జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి

image

ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని VZN ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు.

News July 2, 2024

శ్రీకాకుళం: జులై 4న బంద్‌కు పిలుపు

image

ఈనెల 4వ తేదీన జరగబోయే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. టెక్కలి మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మంగళవారం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జడి చందు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాతీయస్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందన్నారు. నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News July 2, 2024

శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా హౌరా(HWH), యశ్వంత్‌పూర్(YPR) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొద్దిరోజులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.02863 HWH- YPR ట్రైన్‌ను జులై 4 నుంచి 25 వరకు ప్రతి గురువారం, నం.02864 YPR- HWH ట్రైన్‌ను జులై 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం నడుపుతామని తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది.

News July 2, 2024

టెక్కలిలో బోరుభధ్ర-విశాఖ ఎక్స్ ప్రెస్ సర్వీసు ప్రారంభం

image

టెక్కలి ఆర్టీసీ డిపో నుంచి బోరుభధ్ర-విశాఖ ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ సర్వీసును మంగళవారం నుంచి ప్రారంభించారు. టెక్కలి, బోరుభధ్ర, నిమ్మాడ మీదుగా శ్రీకాకుళం, విశాఖ చేరుకునేందుకు వీలుగా ప్రయాణికుల సౌకర్యం కోసం బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టెక్కలి మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరి జండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

News July 2, 2024

శ్రీకాకుళం: మొదటి రోజు 96.81 శాతం పింఛన్లు పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లాలో జూలై నెల 1వ తేదీన 96.81 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పింఛన్లు పంపిణీ ప్రక్రియ రాత్రి 8.45 గంటల వరకు కొనసాగింది అన్నారు. జిల్లాలో 3,19,147 మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులు ఉండగా మొదటి రోజు 3,08,215 మందికి పంపిణీ చేశామన్నారు.

News July 2, 2024

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో సేవలు జులై 1న పునఃప్రారంభం అయ్యాయని శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన Xలో ట్వీట్ చేశారు. కార్గో రవాణా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, స్థానిక ఉత్పత్తులకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.