Visakhapatnam

News August 4, 2024

బొర్రాగుహల పరిరక్షణకు చర్యలు: ఎంపీ తనూజారాణి

image

అనంతగిరి మండలంలో సహజసిద్ధ బొర్రాగుహల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా.తనుజారాణి తెలిపారు. ఈ విషయమై లోక్ సభలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. రైల్వే ట్రాక్ నిర్మాణంతో బొర్రాగుహలకు వచ్చే నష్టాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సహజసిద్ధ గుహలను పరిరక్షించడం, కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అరకు ఎంపీగా వీటిని కాపాడాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని చెప్పారు.

News August 4, 2024

ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా చర్యలు: VMRDA కమిషనర్

image

VMRDA పరిధిలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా వినూత్న ప్రాజెక్టులు, ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రకృతిని పరిరక్షించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో అదనంగా 500 ఎకరాల్లో ఏరో సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

News August 4, 2024

విశాఖ రైల్వే జోన్‌కు ప్రాధాన్యత: కేంద్ర మంత్రి

image

కూటమి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌కు గతంలోనే బడ్జెట్ కేటాయించిందన్నారు. 52 ఎకరాల స్థలం విశాఖలో కేటాయించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం భూమిని సేకరించలేకపోయిందన్నారు. భూసేకరణకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు.

News August 4, 2024

‘మధురవాడ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి’

image

మధురవాడ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విశాఖలో మంత్రితో గంటా భేటీ అయ్యారు. భీమిలిలో ప్రధాన రహదారులను విస్తరించాలని కోరారు. భీమిలి, పీఎం పాలెం, కొమ్మాదిలో ఫ్లై ఓవర్ వంతెనలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. భీమిలి తగరపువలసలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలన్నారు.

News August 3, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు పీఎం దృష్టికి: సీఎం చంద్రబాబు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. చంద్రబాబును వారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కలిశారు. ప్లాంట్ సమస్యలను సీఎంకు వివరించారు. కార్మికులు అంకితభావంతో పనిచేసి పరిశ్రమను లాభాలు బాటలో నడిపితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారని వారు తెలిపారు.

News August 3, 2024

‘షూ’లో కొండచిలువ.. విశాఖలో కలకలం

image

విశాఖ వెంకోజిపాలెంలోని ఓ ఇంట్లో కొండచిలువ కలకలం రేపింది. ‘షూ’లోకి ఓ చిన్న కొండచిలువ దూరింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ దివ్యకాంత్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఆయన కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

News August 3, 2024

విశాఖలో ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్ర యూనిట్ సందడి

image

‘కమిటీ కుర్రాళ్లు’ చిత్ర యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర నిర్మాత నిహారిక కొణిదల విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇందులో పెద్దోడు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. కాగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

News August 3, 2024

విశాఖ: స్థాయిా సంఘం ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు

image

జీవీఎంసీ స్థాయిా సంఘం ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు నిలిచినట్లు అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

News August 3, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక సహాయం అందించాలి: YS షర్మిల

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. ఎన్డీఏ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలను వెంటనే సమకూర్చాలని ఆమె ట్విటర్ ద్వారా కోరారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా ప్లాంట్‌ను చంపాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.

News August 3, 2024

విశాఖ: ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందేందుకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక జరుగుతుందన్నారు. అర్హులైన వారు ఈ నెల 5వ తేదీ లోపు దరఖాస్తులను డీఈఓ కార్యాలయానికి అందజేయాలని కోరారు.