Visakhapatnam

News October 18, 2024

కారుణ్య నియామకాలను చేపట్టాలి: అరకు ఎంపీ

image

ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజ రాణి కోరారు. ఈమేరకు గురువారం విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇదివరకు మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు కారుణ్య ఉద్యోగాల నియామకాలను చేపట్టాలని కోరారు. ఈమేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

News October 17, 2024

రాష్ట్రం తరఫున ఏయూ విద్యార్థినిల ప్రాతినిధ్యం

image

జాతీయ యువజనోత్సవాలు ప్రజాతంత్ర-2024కు ఏపీ నుంచి ఏయూకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.శశిభూషణరావు గురువారం తన కార్యాలయంలో అభినందించారు. నవంబర్ 16 నుంచి 18 వరకు లక్నోలో జరిగే ఈ యువజన ఉత్సవాలలో విద్యార్థినులు ఎం.శివాని లహరి, డి.హర్షిత పాల్గొంటారు. వీరు ఇరువురు రాష్ట్రం తరఫున అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు.

News October 17, 2024

ఏయూ: MHRM, MBA సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న MHRM రెండో సెమిస్టర్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో నిర్వహిస్తున్న MBA నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల వివరాలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

News October 17, 2024

మల్కాపురం: పోర్టు, హెచ్పీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం

image

విశాఖ పోర్ట్ ట్రస్ట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. విశాఖ పోర్ట్ ట్రస్ట్ అథారిటీ అవసరాలకు 60 టన్నుల సామర్థ్యం గల బొలార్ట్ పుల్ టగ్ నిర్మించే బాధ్యతను హెచ్పీసీఎల్‌కు అప్పగించింది. హెచ్పీసీఎల్ తరఫున డైరెక్టర్ గిరిదీప్ సింగ్, పోర్టు తరఫున డిప్యూటీ కన్జర్వేటర్ కెప్టెన్ టి.శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 18 నెలల్లో పెగ్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది.

News October 17, 2024

రేవల్లపాలెంలో పెళ్లింట ప్రమాదం.. యువకుడి మృతి

image

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కొమ్మాదిలో బుధవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. మృతుడు బేవర.సాయి కుమార్ రేవల్లపాలెం నివాసితునిగా గుర్తించారు. ఒక వివాహనికి విద్యుత్ సంబందిత పని చేస్తుండగా పిడుగు పడటంతో విద్యుత్ ప్రమాదం జరిగింది. వెంటనే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News October 17, 2024

విశాఖ: యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు

image

ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టాలు పంపిణీ చేసినట్లు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. వీరందరికి యాజమాన్యం హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు పొందిన వారికి రెండేళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. యాజమాన్య హక్కు లేకపోవడంతో నిర్మాణాలు జరగలేదన్నారు.

News October 16, 2024

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రగతిపై విశాఖ ఎంపీ సమీక్ష

image

భోగాపురం విమానాశ్రయం ప్రగతిపై విశాఖ ఎంపీ శ్రీభరత్ జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ ప్రస్తుత పనులు, డిజైన్, భవిష్యత్తు ప్రణాళిక వంటి అంశాలపై ఎంపీ చర్చించి పలు సూచనలు చేశారు. రాబోయే 50 ఏళ్ల వరకు ఎటువంటి అవాంతరాలు రాకుండా తీరప్రాంత వాతావరణ పరిస్థితులకు తగ్గ మెటీరియల్ వాడాలన్నారు. విమానాశ్రయం పనులు 45 శాతం పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా ఎంపీకి తెలిపారు.

News October 16, 2024

విశాఖ కోర్టుకు రానున్న మంత్రి లోకేశ్

image

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈనెల 17వ తేదీన విశాఖ వస్తున్నారు. రాత్రి 10:00 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం 10:30 గంటలకు జిల్లా కోర్టుకు వెళతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కోర్టు నుంచి ఎన్టీఆర్ భవన్ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదల చేశారు.

News October 16, 2024

ఏయూ: పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్‌లో ప్రవేశాలకు ఏయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏడాదికి ఫీజుగా రూ.30 వేల చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు AU వెబ్సైట్ నుంచి పొందవచ్చు. MA, MSC సైకాలజీ, MBBS, BA, BSC సైకాలజీ, MSC సోషల్ వర్క్, BSC నర్సింగ్ కోర్సులు చేసిన వాళ్లు దీనికి అర్హులు.

News October 16, 2024

కసింకోట నేషనల్ హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

కసింకోట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కసింకోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మృతులు నక్కపల్లి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.