Visakhapatnam

News July 1, 2024

హోంమంత్రి అనిత ఓ.ఎస్.డీ.గా అనిల్ కుమార్

image

హోం మంత్రి వంగలపూడి అనిత ఓ.ఎస్.డీ.గా అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనిల్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనకు ఇంటిలిజెన్స్‌లో పోస్టింగ్ ఇస్తూ హోంశాఖ మంత్రి ఓ.ఎస్.డీ.గా విధులు అప్పగించారు. గతంలో అనిల్ కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్ద ఓ.ఎస్.డీగా పనిచేశారు.

News July 1, 2024

సింహాచలం: 3న వైకుంఠ వాసునికి వరద పాయసం

image

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థిస్తూ ఈ నెల మూడవ తేదీన సింహాచలం వైకుంఠ వాసుని మెట్ట మీద వైకుంఠవాసునికి వరద పాయసం పోయనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ మేరకు వైదిక వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు వారి నిర్ణయం మేరకు 3న ఉదయం 8 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, విరాటపర్వం పారాయణం నిర్వహిస్తామన్నారు. అనంతరం వరుణ మంత్ర జపం చేసి పాయసం నివేదన సమర్పిస్తామన్నారు.

News July 1, 2024

విశాఖ సీపీగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చీ

image

విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్‌లో పని చెయ్యడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు ఇక్కడ పని చెయ్యడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు పెళ్లి అయ్యాక హనీమూన్ ఎక్కడకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అందరూ స్విట్జర్లాండ్ వెళ్లాలన్నారు కానీ.. అప్పుడు డబ్బులు లేకపోవడంతో విశాఖనే ఎంచుకున్నాని తెలిపారు.

News July 1, 2024

విశాఖ నగరానికి తలమానికంగా క్లాక్ టవర్

image

విశాఖ మహా నగరానికి జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ తలమానికంగా నిలిచింది. నగరాభివృద్ధిలో భాగంగా అధికారులు సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలోని అతి ముఖ్యమైన జగదాంబ సెంటర్‌లో క్లాక్ టవర్‌ను నూతనంగా నిర్మించారు. ఈ టవర్ చుట్టూ విద్యుత్ దీపాలను అందంగా అలంకరించారు. ఈ క్లాక్ టవర్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

News July 1, 2024

తగ్గుముఖం పట్టిన పర్యాటకుల తాకిడి

image

ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకుల తాకిడి తగ్గింది. గతవారం రోజులుగా బొర్రాను సందర్శించేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ ఆదివారం 1,700 మంది సందర్శించగా రూ.1.57 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. తాటిగూడ, కటికి, డముకు వ్యూపాయింట్ తదితర సందర్శిత ప్రాంతాలన్నీ ఈవారం వెలవెలబోయాయి. వేసవిసెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతుంది.

News July 1, 2024

నేడు విశాఖ కొత్త పోలీస్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులైన అదనపు డీజీ శంకబ్రత బాగ్చి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు విశాఖలో పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్‌ను సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుత కమిషనర్ రవిశంకర్ నుంచి సీపీగా శంకబ్రత బాగ్చి బాధ్యతలు స్వీకరిస్తారు.

News July 1, 2024

బంగ్లాదేశ్‌కు చేరుకున్న ఐఎన్ఎస్ రణవీర్ నౌక

image

మారిటైం భాగస్వామ్య విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన క్షీపణి విధ్వంసకర యుద్ధనౌక ఐఎన్ఎస్ రణవీర్ బంగ్లాదేశ్‌కు చేరుకుందని విశాఖలో తూర్పు నౌక దళం అధికారులు తెలిపారు. గత నెల 29న చిట్టిగాంగ్‌‌కు చేరుకున్న నౌకకు ఆదేశ నౌకాదళ బృందం సాదర స్వాగతం పలికింది. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బేగం భారత్ సందర్శన అనంతరం రణవీర్ నౌక బంగ్లాదేశ్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

News July 1, 2024

విశాఖ: కోస్టల్ రైడర్స్‌పై రాయలసీమ కింగ్స్ విజయం

image

ఏపీఎల్ సీజన్-3 మ్యాచ్‌లు ఆదివారం రాత్రి విశాఖ వైయస్సార్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం రాయలసీమ కింగ్స్ జట్టు 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి విజయం సాధించింది.

News July 1, 2024

GREAT: శ్రమదానంతో పాఠశాలకు తాత్కాలిక గుడిసె

image

అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో పాఠశాలలకు భవనాలు లేక గిరిజనులు సొంతంగా మట్టి గోడలతో తాత్కాలిక గుడిసెను నిర్మించుకుంటున్నారు. అనంతగిరి మండలంలోని కివర్ల పంచాయతీ పరిధి తంగిలబంధ గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సొంతంగా మట్టి గోడలతో తాత్కాలిక గుడిసె నిర్మించుకుంటున్నామని తంగిలబంధ గిరిజనులు తెలిపారు.

News June 30, 2024

పర్యాటకులతో విశాఖ బీచ్‌లు కిటకిట

image

పర్యాటకులతో విశాఖ బీచ్‌‌లు ఆదివారం కిటకిటలాడాయి. వీకెండ్ కావడంతో పర్యాటకులతో పాటు నగరవాసులు బీచ్‌లోని ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించారు. పిల్లలతో పాటు బీచ్‌కు చేరుకుని స్నానం చేస్తూ గడిపారు. దీంతో ఆర్కే బీచ్‌తో పాటు పరివాహక ప్రాంతమంతా చిన్నారులు, యువతీ యువకులతో కిక్కిరిసిపోయింది. పర్యాటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.