Visakhapatnam

News April 9, 2024

విశాఖ-కిరండోల్ రైలు రద్దు

image

వాల్తేర్ డివిజన్‌లోని కేకే లైన్‌లో బొర్రా గుహల నుంచి కరకవలస మధ్య వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే రైలును రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. విశాఖ నుంచి బయలుదేరాల్సిన కిరండోల్ రైలు(08551)ను ఈనెల 10న రద్దు చేశారు. అలాగే కిరండోల్ నుంచి బయలుదేరే (08552) రైలు కూడా రద్దయింది. ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.

News April 9, 2024

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 248 పోలింగ్ కేంద్రాలు

image

అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 248 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.744 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని ఎన్నికల సంఘానికి నివేదించారు. సున్నిత పోలింగ్ కేంద్రాలు 281 ఉండగా.. అత్యంత సున్నితమైనవి 211 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 7,61,255 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఎన్ని కల నాటికి కొద్దిగా పెరిగే అవకాశాలున్నాయి.

News April 9, 2024

సింహాచలం: నేడు సింహాద్రి అప్పన్నకు పెళ్లి రాట

image

సింహాచలం ఆలయంలో ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం అప్పన్న బాబు పెళ్లి రాట మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 19వ తేదీన స్వామి వారి వార్షిక కళ్యాణం నిర్వాహంలో భాగంగా ఈ వేడుక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయ ఆస్థానం మండపం వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహిస్తారన్నారు.

News April 9, 2024

విశాఖ: ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తులు

image

ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని 200 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సార్వత్రిక ఎన్నికల మానవ వనరుల విభాగ ఇన్ఛార్జి, వీఎంఆర్డీఓ జాయింట్ కమిషనర్ రవీంద్రకు దరఖాస్తులు అందజేశారు. అనారోగ్య కారణాలు, పదవీ విరమణ అంశాలను ప్రధానంగా చూపుతున్నారు. దీంతో అనారోగ్యం కారణాలపై వచ్చిన దరఖాస్తులను వడబోసేందుకు అయిదుగురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు.

News April 9, 2024

విశాఖ: ముగిసిన టెన్త్ మూల్యాంకనం

image

టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ఈనెల ఒకటో తేదీన జ్ఞానాపురం జూబ్లీ హైస్కూలులో మూల్యాంకనం ప్రారంభమైంది. ఎనిమిది రోజుల్లో మొత్తం 1,76,924 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. అత్యధికంగా ఇంగ్లిష్‌ సబ్జెక్టు సంబంధించి 29 వేలు, సోషల్‌ స్టడీస్‌లో 28 వేల పత్రాలు జిల్లాకు వచ్చాయి. మూల్యాంకనం కోసం 104 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 624 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 208 మంది సహాయకులు పనిచేసారు.

News April 9, 2024

పాడేరు ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

image

పాడేరులోని మాతా శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఆహారం తదితర అంశాలపై ఆరా తీశారు. చీడివలసకు చెందిన ఓ బాలింతకు అది నాలుగో కాన్పు అని తెలుసుకొని, ఆమెకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు ఒప్పించినట్లు పేర్కొన్నారు.

News April 9, 2024

విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు

image

ఏయూకి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్-2024, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్-2024లో స్థానం లభించింది. ఈ మేరకు సంస్థ దానికి సంబంధించిన సర్టిఫికేట్, మెడల్, పుస్తకాలను పంపింది. ఫిబ్రవరి 6వ తేదీన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 60 వేల మంది ప్రజలు కలిసి చేంజ్ ఫ్రం హ్యూమన్ బీయింగ్ టు భీయింగ్ హ్యూమన్ ప్రతిజ్ఞ చేయడాన్ని గుర్తిస్తూ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించినట్లు వీసీ తెలిపారు.

News April 8, 2024

గాజువాక CPM ఎమ్మెల్యే అభ్యర్థిగా జగ్గు నాయుడు

image

సీపీఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పోటీ చేయనున్నారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడలో ఆయన పేరును ప్రకటించారు. జగ్గునాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు.

News April 8, 2024

విశాఖ: పిడుగుపాటుతో ఇద్దరు మృతి

image

ఉమ్మడి విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలంలో విషాదం నెలకొంది. వనుగుమ్మ పంచాయతీ అసరాడలో పిడుగుపాటుతో ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం ఆసరాడ కొండపై పశువుల కోసం వెళ్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. అటుగా వెళుతున్న ఇద్దరు గిరిజనులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో ఒకరు పాంగి సుఖదేవ్, మరొకరు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

సివిల్ సర్వీసెస్ అధికారులపై ఆరోపణలు తగదు: బొత్స

image

నిజాయతీగా పనిచేస్తున్న సివిల్ సర్వీసెస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ బృందం నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారులు చాలా కాలం నుంచి ప్రభుత్వ శాఖల్లో కీలకంగా పని చేస్తున్నారని అన్నారు. వారిలో ఇద్దరు, ముగ్గురు కొన్ని పొరపాట్లు చేస్తే అందరిపై అభాండాలు వేయడం తగదన్నారు.