Visakhapatnam

News May 29, 2024

పలాస-విశాఖ-పలాస రైళ్లు రద్దు

image

పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న పలాస నుంచి విశాఖ వచ్చే పాసింజర్ రైలును, విశాఖ నుంచి పలాస వెళ్లే పాసింజర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 29, 2024

చింతపల్లిలో బాణంతో దాడి.. వ్యక్తి మృతి

image

చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ పెడకొండలో బాణం తగిలి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. బుధవారం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న వంతాల సోనిపై కాకరి బాబ్జీ బాణంతో దాడి చేశాడు. అది గుండెల్లో దిగడంతో సోని అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. నిందితుడు స్థానికుల నుంచి తప్పించుకొని పరారయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 29, 2024

విశాఖ: ఐదేళ్లలో రాష్ట్రంలో భూదోపిడీ పెరిగింది.. లంకా దినకర్

image

గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో భూదోపిడీ బాగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. బుధవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ, వైసీపీ నాయకుల ప్రోద్బలంతో భూకబ్జాలు జరిగాయన్నారు. బెదిరించి తక్కువ ధరకు లాగేసుకోవడం, డీ పట్టా భూములు సొంతం చేసుకోవడంతో పాటు అక్రమ డెవలప్మెంట్ అగ్రిమెంట్ల ద్వారా దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు.

News May 29, 2024

విశాఖ: ఫోన్ చూడొద్దన్నందుకు బాలిక సూసైడ్

image

విశాఖ వాంబే కాలనీలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మరణించడంతో తల్లితో కలిసి బాలిక(15) వాంబే కాలనీలో నివాసం ఉంటుంది. బాలికను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News May 29, 2024

కే‌జీహెచ్ సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు

image

కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తనను లైంగికంగా వేధించినట్లు ఇటీవల సరండర్ అయిన ఓ గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2023 జనవరి నుంచి అశోక్ కుమార్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని, కులం పేరుతో దూషించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వన్ టౌన్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందినట్లు తెలిపారు.

News May 29, 2024

విశాఖ: మరో ఐదుగురు ఏజెంట్లు అరెస్టు

image

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని కాంబోడియా పంపించి మోసం చేసిన ఘటనలో మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. కమిషన్ కోసం ఆశపడిన ఏజెంట్లు బోనుల జాన్ ప్రసాద్, కింతాడ అశోక్, పప్పల నానాజీ, మండ ప్రదీప్ చంద్ర, పెద్ద పాట విజయ్ కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన బాధితులు 1930కు సంప్రదించాలన్నారు.

News May 29, 2024

విశాఖ: లవర్ బర్త్‌డే.. ఫోన్ తియ్యలేదని సూసైడ్

image

ప్రియురాలు పుట్టినరోజు నాడు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎలమంచిలిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన రోమాల గంగాధర్(24) చాలా కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఏడాదిగా వీరు మాట్లాడుకోవడం లేదు. సోమవారం ఆమె పుట్టినరోజు కావడంతో ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా.. ఆమె ఫోన్ తియ్యకపోవడంతో మనస్తాపం చెంది అదే రోజు రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై పాపినాయుడు వెల్లడించారు.

News May 29, 2024

విశాఖ: ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంగా పరమేశ్వర్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ గా పరమేశ్వర్ ఫంక్వాల్ నియమితులయ్యారు. ఆయన కాన్పూర్ ఐఐటీలో చదివి 1998లో ఇండియన్ రైల్వే సర్వీస్ ఇంజనీర్‌గా రైల్వే శాఖలో చేరారు. రైల్వే ట్రాక్ వంతెనలు పర్యావరణ ఇంజనీరింగ్‌పై ఆయన రాసిన పరిశోధన పత్రాలు పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. డెన్మార్క్ స్వీడన్ ఫ్రాన్స్ జర్మనీ చైనా సింగపూర్ తదితర దేశాల్లో పర్యటించి పలు అధ్యయనాలు నిర్వహించారు.

News May 29, 2024

విశాఖ: మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారులు ఎంపిక

image

మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారుల ఎంపికను అధికారులు పూర్తి చేశారు. విశాఖ జిల్లాలో 13,530 కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.పదివేలు చొప్పున మొత్తం రూ.13.53 కోట్లను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతుంది. జూన్ 4 తర్వాత పంపిణీ చేస్తారు.

News May 29, 2024

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖలో 2017లో సంచలనం రేపిన కిడ్నాప్, రేప్ కేసులో పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆనంది మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడు గణేశ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.