Visakhapatnam

News March 19, 2024

అనకాపల్లి: భవనం మీద నుంచి పడి మృతి   

image

కోటవురట్ల మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఇసరపు రామకృష్ణ (25) కోటవురట్లలో మంగళవారం నాలుగు అంతస్తుల భవనం నిర్మాణ పనులు చేస్తూ అదుపుతప్పి కిందకు జారిపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతునికి మూడు నెలల క్రితమే వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.

News March 19, 2024

సింహాచలం: మే 10న జరిగే చందనోత్సవంపై సమీక్ష

image

సింహాచలం ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించనున్న చందనోత్సవం పై మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఈఓ శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను వివరించారు. ముఖ్యంగా కొండపైన ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు క్యూలైన్ల ఏర్పాటు తదితర విషయాలపై అధికారులతో ఈఓ చర్చించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.

News March 19, 2024

అనకాపల్లి: ఇద్దరు వాలంటీర్స్ తొలగింపు

image

గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటర్లు వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసింది. ఈ విషయంపై సోమవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామంలో విచారణ చేపట్టి, కలెక్టర్‌కి నివేదిక అందించారు. ఎన్నికల అధికారి జయరాం వాలంటీర్స్ ఓంకార విజయలక్ష్మి, సింగంపల్లి భవానీలను తొలగించినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్న వాలంటీర్స్ ఏ పార్టీ తరఫున ప్రచారం చేయకూడదని హెచ్చరించారు.

News March 19, 2024

అల్లూరి జిల్లాలోని చట్టి చెక్ పోస్టు మూసివేత

image

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను G.O.MS-24 ప్రకారం మూసివేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు మండలంలోని రవాణా శాఖ చట్టి చెకపోస్ట్‌‌ను కూడా మూసివేయటం జరిగిందని జిల్లా రవాణాధికారి లీలా ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఇతర రాష్ట్ర వాహనదారులు పన్నులు, పర్మిట్‌లు ఇతర సేవలను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని సూచించారు.

News March 19, 2024

విశాఖ సాగర జలాల్లో నేవీ విన్యాసాలు

image

విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో సాగర జలాల్లో భారత్ అమెరికా దేశాల మధ్య హెచ్ఎడిఆర్-హ్యుమానిటీరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ పేరుతో నేవీ విన్యాసాలు ప్రారంభమైనట్లు నేవీ అధికారులు తెలిపారు. 18న ప్రారంభమైన విన్యాసాలు సీఫేజ్, హార్బర్ ఫేజ్‌ల్లో కొనసాగుతాయన్నారు. ఇరుదేశాల అధికారులు భారత్ నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, అమెరికాకు చెందిన యుద్ధనౌక టైగర్ ట్రయాంప్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయన్నారు.

News March 19, 2024

విశాఖలో కొత్త తరహా చోరీ

image

సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీహరిపురం ఏటీఎం కేంద్రంలో కార్డు వినియోగించే చోట ఓ ముఠా కొద్దిపాటి మార్పులు చేసి నలుగురి నుంచి రూ. లక్ష కాజేసింది. నగదు డ్రా చేసేందుకు వచ్చినవారు కార్డు పెట్టగా అది లోపలికి పోతోంది. వెంటనే ముఠాలో ఒకడు వచ్చి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ముఠా అతికించిన నంబర్‌కి ఫోన్ చేయాలని సలహా ఇస్తాడు. నంబర్‌కి ఫోన్ చేయగా ముఠాలో మరొక సభ్యుడు వివరాలు సేకరించి వేరే ATMలో నగదు డ్రా చేస్తాడు.

News March 19, 2024

విశాఖ: ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

image

తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపలవేటను నిషేధిస్తారు. ఏపీతోపాటు తీరప్రాంతం విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ తెలిపారు.

News March 19, 2024

విశాఖలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది: సబ్బవరం సీఐ

image

విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సబ్బవరం సీఐ పిన్నింటి రమణ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ దౌర్జన్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పోతారన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

News March 19, 2024

విశాఖ: మనస్తాపంతో విద్యార్థి సూసైడ్

image

విశాఖ నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథపురంలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి భాను చైతన్య(20) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో భాను చైతన్య బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 19, 2024

మాజీ ఎమ్మెల్యేని కలిసిన మంత్రి గుడివాడ

image

గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్యను గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మంత్రి అమర్నాథ్ సోమవారం చింతలపూడి ఇంటికి వెళ్లి ఈ ఎన్నికలలో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై ఇరువురు చర్చించుకున్నారు. తన విజయానికి కృషి చేస్తానని చింతలపూడి హామీ అమర్నాథ్ తెలిపారు.