Visakhapatnam

News August 28, 2024

నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ దినేశ్

image

ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకం చాలా ముఖ్యమైందని, నర్సరీల నుంచి సకాలంలో మొక్కలు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. కడియం నుంచి మొక్కల సరఫరా సరిగా లేదని, రానున్న సంవత్సరం నుంచి వారి దగ్గర మొక్కలు కొనేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానికంగానే నర్సరీల ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు.

News August 27, 2024

‘భైరవకోన వద్ద భక్తులకు కనీస వసతులు కల్పించాలి’

image

సింహాచలం ఆలయ సమీపంలో భైరవకోన వద్ద భక్తులకు కనీస వసతులు కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆలయ ఈవో శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. ఈవో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి భైరవకోన స్థితిగతులు, భక్తుల రద్దీ గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులపై వారికి సూచనలు చేశారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.

News August 27, 2024

వచ్చే నెల13న మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి నారాయణ

image

రాష్ట్రంలో వచ్చే నెల 13న మరో 75 అన్న క్యాంటీన్‌లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు 202 క్యాంటీన్లు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఫుడ్ సప్లయ్ చేసేవారు అవసరమైన వాటిని సమకూర్చుకునేందుకు సమయం అడిగినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో మిగిలినవి ప్రారంభిస్తామన్నారు.

News August 27, 2024

వాల్తేర్ రైల్వే డివిజన్ కనుమరుగు?

image

వాల్తేరు రైల్వే డివిజన్ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఈనెల 24న భవనాలు ఉద్యోగుల క్వార్టర్స్ ఇతర విభాగాల నిర్మాణానికి రైల్వే ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. 125 ఎకరాల్లో వీటి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

News August 27, 2024

అనకాపల్లి జిల్లాలో హత్య 

image

అన్నదమ్ముల మధ్య జరిగిన తగాదాలో చిన్నాన్నను హత్యచేసిన ఘటన మాకవరపాలెం మండలంలోని తాడపాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గనిశెట్టి జోగులు(72) అన్న కొడుకులు భాస్కరరావు, దొరబాబు సోమవారం రాత్రి స్థల వివాదమై గొడవపడ్డారు. దీంతో జోగునాయుడు మధ్యలోకి వెళ్లడంతో దొరబాబు కత్తితో పొడిచి హత్యచేశాడు. పాత తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్టు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 27, 2024

విశాఖ: ప్రమాదానికి ముందే సంకేతాలు..!

image

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించి సిబ్బందికి గంటన్నర ముందే ప్రమాద సంకేతాలు అందినట్లు తెలిసింది. బల్క్ డ్రగ్ తయారీలో ఉపయోగించే ఎంటీబీఈ రసాయనం లీక్ అవుతున్నా సిబ్బంది, కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తనిఖీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తక్షణం స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని వారు నివేదికలో పేర్కొన్నారు.

News August 27, 2024

విశాఖలో విమానం అత్యవసర ల్యాండింగ్

image

విశాఖ విమానాశ్రయంలో అగర్తల నుంచి బెంగళూరు వెళ్లే విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బెంగళూరు వెళుతున్న నారాయణ చంద్ర గౌస్(62)కు గుండెపోటు రావడంతో విశాఖ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం 6.04 గంటలకు విమానాన్ని ల్యాండ్ చేశారు. వెంటనే అంబులెన్స్‌లో షీలా నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చంద్ర‌గౌడ్ బంగ్లాదేశ్‌కు చెందిన వాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

News August 27, 2024

విశాఖ సీపీ చొరవతో బస్సు సౌకర్యం 

image

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చొరవతో 77వ వార్డు నమ్మి దొడ్డి జంక్షన్‌కు బస్ సౌకర్యం కలిగింది. ఇటీవల సీపీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో వారి సమస్యలు తెలుసుకున్నారు. నమ్మిదొడ్డి ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదని ప్రజలు సీపీకి తెలియజేయడంతో తక్షణమే స్పందించి ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌తో మాట్లాడారు. దీంతో సోమవారం గాజువాక డిపో నుంచి నమ్మి దొడ్డి జంక్షన్ వరకు బస్సును ప్రారంభించారు.

News August 26, 2024

అనకాపల్లి జిల్లాలో 912 కిలోల గంజాయి స్వాధీనం

image

లారీలో అక్రమంగా తరలిస్తున్న 912 కిలోల గంజాయిని సబ్బవరం మండలం గుల్లేపల్లి జంక్షన్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా వస్తున్న లారీపై ఆదివారం పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుపడగా, మరో ఐదుగురు పరారైనట్లు తెలిపారు.

News August 26, 2024

వర్షం కారణంగా ఆర్కేబీచ్ రోడ్డులో ర్యాలీ

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆర్.కె.బీచ్ వద్ద నిర్వహించారు. ర్యాలీ నిర్వహణకు పోర్టు స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షం కారణంగా ట్రాక్ అంతా తడిసిపోయింది. దీంతో బురద కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడతారని భావించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సూచనతో అధికారులు ర్యాలీని బీచ్ రోడ్‌లో నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.