Visakhapatnam

News March 19, 2024

విశాఖ సాగర జలాల్లో నేవీ విన్యాసాలు

image

విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో సాగర జలాల్లో భారత్ అమెరికా దేశాల మధ్య హెచ్ఎడిఆర్-హ్యుమానిటీరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ పేరుతో నేవీ విన్యాసాలు ప్రారంభమైనట్లు నేవీ అధికారులు తెలిపారు. 18న ప్రారంభమైన విన్యాసాలు సీఫేజ్, హార్బర్ ఫేజ్‌ల్లో కొనసాగుతాయన్నారు. ఇరుదేశాల అధికారులు భారత్ నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, అమెరికాకు చెందిన యుద్ధనౌక టైగర్ ట్రయాంప్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయన్నారు.

News March 19, 2024

విశాఖలో కొత్త తరహా చోరీ

image

సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీహరిపురం ఏటీఎం కేంద్రంలో కార్డు వినియోగించే చోట ఓ ముఠా కొద్దిపాటి మార్పులు చేసి నలుగురి నుంచి రూ. లక్ష కాజేసింది. నగదు డ్రా చేసేందుకు వచ్చినవారు కార్డు పెట్టగా అది లోపలికి పోతోంది. వెంటనే ముఠాలో ఒకడు వచ్చి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ముఠా అతికించిన నంబర్‌కి ఫోన్ చేయాలని సలహా ఇస్తాడు. నంబర్‌కి ఫోన్ చేయగా ముఠాలో మరొక సభ్యుడు వివరాలు సేకరించి వేరే ATMలో నగదు డ్రా చేస్తాడు.

News March 19, 2024

విశాఖ: ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

image

తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపలవేటను నిషేధిస్తారు. ఏపీతోపాటు తీరప్రాంతం విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ తెలిపారు.

News March 19, 2024

విశాఖలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది: సబ్బవరం సీఐ

image

విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సబ్బవరం సీఐ పిన్నింటి రమణ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ దౌర్జన్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పోతారన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

News March 19, 2024

విశాఖ: మనస్తాపంతో విద్యార్థి సూసైడ్

image

విశాఖ నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథపురంలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి భాను చైతన్య(20) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో భాను చైతన్య బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 19, 2024

మాజీ ఎమ్మెల్యేని కలిసిన మంత్రి గుడివాడ

image

గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్యను గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మంత్రి అమర్నాథ్ సోమవారం చింతలపూడి ఇంటికి వెళ్లి ఈ ఎన్నికలలో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై ఇరువురు చర్చించుకున్నారు. తన విజయానికి కృషి చేస్తానని చింతలపూడి హామీ అమర్నాథ్ తెలిపారు. 

News March 18, 2024

విశాఖలో ‘టైగర్‌ ట్రయాంఫ్‌–2024’ విన్యాసాలు

image

భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం బలోపేతానికి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో టైగర్‌ ట్రయాంఫ్‌–2024 సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకూ రెండు ఫేజ్‌లలో విన్యాసాలు జరగనున్నాయి. యూఎస్‌కు చెందిన యూఎస్‌ఎస్‌ సోమర్‌సెట్‌ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్, ఎమ్మార్కెడ్‌ దళాలు విశాఖకు చేరుకున్నాయి.

News March 18, 2024

విశాఖ: ‘ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలి’

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహనతో విధులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులను జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు. ఎన్నికల నిర్వాణపై జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన వివిధ మానిటరింగ్ కేంద్రాలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నెరవేర్చాలన్నారు.

News March 18, 2024

అనకాపల్లి: సచివాలయ ఉద్యోగి మృతి.. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా 

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ములకలపల్లిలో విద్యుత్ షాక్‌కి గురై మృతి చెందిన సచివాలయ ఉద్యోగి డి.చిరంజీవి కుటుంబానికి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చెక్కుని మృతుడి భార్య హేమలతకు దేవరాపల్లి హెచ్‌డీటీ డీ.ఆనంద్ రావు సోమవారం అందజేశారు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా కటౌట్లు తొలగిస్తూ విద్యుత్ షాక్‌తో చిరంజీవి ఆదివారం మృతి చెందాడు.

News March 18, 2024

అనకాపల్లి జిల్లాలో వాలంటీర్స్ ప్రచారంపై విచారణ

image

గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటీర్స్ చేస్తున్న ప్రచారంపై ఎంపీడీవో రత్నకుమారి ఆధ్వర్యంలో సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాలంటీర్స్ ప్రచారం చేయడంపై విచారణ చేపట్టామని, నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్, ఈవోపీఆర్డీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.