India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిషేధిత తాబేళ్లను రవాణా చేస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. షాలీమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో నక్షత్రపు తాబేళ్లు రవాణా చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందడంతో బుధవారం విశాఖ రైల్వేస్టేషన్‌లో నిఘా పెట్టారు. ఇద్దరు అనుమానితులను తనిఖీల్లో 396 నక్షత్రపు తాబేళ్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడుకు రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు.
సముద్రంలోని నౌకల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యులు వీర్రాజు, బడే రాజు, సూరాడ రాములును అరెస్టు చేసినట్లు డీసీపీ-2 ఎం.సత్తిబాబు తెలిపారు. సముద్రంలో ఉన్న నౌకల నుంచి డీజిల్ దొంగలించి బోట్లు ద్వారా తీరానికి తీసుకువచ్చి వారు విక్రయిస్తున్నట్లు తెలిపారు. సుమారు 13 మంది నౌకల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వీరిలో ముగ్గురు పట్టుబడుగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేసును హైకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. అన్యాయంగా తొలగించారని తన కేసు తేలాకే కొత్త ఎండీ, సీఈఓ నియామకం నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ పాత ఎండీ జార్జి విక్టర్ కేసు వేశారు. ఆ మేరకు నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని డీసీఐ వాదించింది. ఈ కేసులో తీర్పును ఏప్రిల్ 11న వెలువరిస్తామని విచారణను హైకోర్టు వాయిదా వేసినట్టు డీసీఐ వర్గాలు తెలిపాయి.
విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కొత్తగా నాలుగు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశీయ సర్వీసుల్లో ఈ నెల 31 నుంచి విశాఖపట్నం–ఢిల్లీ మధ్య ఎయిర్ ఇండియా, విశాఖపట్నం–హైదరాబాద్ మధ్య ఇండిగో విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ సర్వీసుల్లో విశాఖ–బ్యాంకాక్(థాయ్‌లాండ్) విమానం ఏప్రిల్ 9 నుంచి, విశాఖ–కౌలాలంపూర్ (మలేసియా) విమానం ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఆర్ఓ కూడా తమ విధులను బాధ్యతగా వ్యవహరించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ బృందాలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
భారత్, యూఎస్‌ల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్–2024 సీఫేజ్ విన్యాసాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బుధవారం విశాఖ సముద్ర తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో విన్యాసాలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ, మానవతా సహాయం పేరుతో రెండో రోజు విన్యాసాలు సాగాయి. భారత్‌కు ఐఎన్‌ఎస్ జలశ్వా ప్రాతినిధ్యం వహించగా, యూఎస్‌కు యూఎస్‌ఎస్ సోమర్‌సెట్, యూఎస్‌ఎస్ హాల్‌సే యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మందికి సొంత ఇంటి కలలు నిజం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మంత్రి అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి ఝాన్సీ పాల్గొన్నారు.
అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావును అధిష్ఠానం ఎంపిక చేసింది. నెల రోజుల కిందట టీడీపీ అభ్యర్థి దున్నుదొరని ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి పాడేరు అసెంబ్లీ ముందు కేటాయించినా పోటీలో సరైన అభ్యర్థి లేనందున అరకు అసెంబ్లీ సీటుని కోరుకున్నారు. దీంతో అరకు నియోజకవర్గ అభ్యర్థిగా పాంగి రాజారావుకు సీటు కేటాయించారు.
బీజేపీ కూటమిలో భాగంగా విశాఖ నార్త్ సీటుకి విష్ణుకుమార్ రాజు పేరును ప్రకటించింది. ఈయన 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి గెలుపొందగా, 2019లో ఓడిపోయారు. 2014లో 18,240 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియెజకవర్గంలో నమోదు అయిన అత్యధిక మెజారిటీ ఇదే కావడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, జనసేన , టీడీపీ కూటమిలో భాగంగా మరోసారి బరిలో నిలుస్తున్నారు.
సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ ఆలయాన్ని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సుదర్శన నరసింహ మహా యజ్ఞంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో పూజలు చేశారు. అనంతరం స్వామీజీలను వేద పండితులు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి సత్కరించారు.
Sorry, no posts matched your criteria.