Vizianagaram

News April 10, 2024

రామభద్రపురం: నిన్న టీడీపీ లోకి… నేడు వైసీపీ లోకి

image

మండల పరిధిలోని ఆరికతోట గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు మాజీ సర్పంచ్‌ పెంకి భీమయ్య ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. స్థానిక మండల వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి కండువాలు వేయించి పార్టీలో చేర్చారని చెప్పారు.

News April 9, 2024

VZM: దండూరమ్మ ఉత్సవాలలో ఉమ్మడి జిల్లా ఎస్పీలు

image

విజయనగరం పట్టణంలో వెలసిన శ్రీ దేవీ దండుమారమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను ఏప్రిల్ 9 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపికా పాటిల్, మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఎస్పీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News April 9, 2024

VZM: జిల్లాలో అత్యల్ప పోలింగ్ ఇక్కడే.. ఈసారి పెరిగేనా?

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. కురపాం-77.7, పార్వతీపురం- 76.9, సాలూరు-79.4, బొబ్బిలి-78.9, చీపురుపల్లి-83.3, గజపతినగరం-86.9, నెల్లిమర్ల-87.9, ఎస్.కోట-86.1 శాతంగా నమోదు కాగా విజయనగరంలో అత్యల్పంగా 70.8 శాతం నమోదయ్యింది. ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారో కామెంట్ చేయండి.

News April 9, 2024

పార్వతీపురం: ఘనంగా ఉగాది వేడుకలు

image

శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది వేడుకలు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాయింటు కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని, అన్ని కుటుంబాలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కలగాలని జాయింటు కలెక్టర్ ఆకాక్షించారు.

News April 9, 2024

సాలూరు: కేజీన్నర బంగారం చీరతో అలంకరణ

image

సాలూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఉగాది పర్వదినం సందర్భంగా బంగారు చీరతో అలంకరించారు. సుమారు 1500 గ్రాముల బంగారు తాపడంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బంగారు చీరలో తల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల నుంచి అధిక మొత్తంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

News April 9, 2024

విజయనగరం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు విజయనగరం డిపో మేనేజరు జే.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు ఏప్రిల్ 16 సాయంత్రం 4.30 నుంచి బయలుదేరునని, టిక్కెట్లు కావలసినవారు WWW.APSRTCONLINE.IN ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చునని తెలిపారు.

News April 9, 2024

ఉగాది స్పెషల్.. పైడితల్లమ్మకు ప్రత్యేక అలంకరణ

image

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్బంగా విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. నైవేద్యంగా బూరెలు, అరెసెలు, పండ్లు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

News April 9, 2024

విజయనగరం: సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలు

image

విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సర్టిఫికెట్, డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కేఏవీఎల్ఎన్ . శాస్త్రి బుధవారం తెలిపారు. భారతీయ సంస్కృతి, కళల పట్ల అవగాహన కలిగించి ఆకర్షితులను చేసే ఉద్దేశంతో సంగీత కళాశాలలో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సు, రెండేళ్ల డిప్లమో కోర్సులను నిర్వహిస్తున్నామన్నారు.

News April 9, 2024

విజయనగరంలో రూ.9.30 లక్షల వెండి సీజ్

image

విజయనగరం పట్టణంలోని గంట స్తంభం సమీపంలో సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి వద్ద ఉన్న 14.405 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని 1వ పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. వెండి వస్తువులకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దార్‌కు అప్పగించామని చెప్పారు. సీజ్ చేసిన వెండి వస్తువుల విలువ సుమారు రూ.9.30 లక్షలు ఉంటుందని తెలిపారు.

News April 9, 2024

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. సోమవారం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు. వచ్చే పది రోజులు కీలకమని, ప్రతి అంశంపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు.