WestGodavari

News July 13, 2024

ప.గో.: అంతర్జాతీయ స్థాయిలో కవి ప్రసాద్‌కు సత్కారం

image

అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ‘పర్యావరణాని కోసం మొక్క నాటుదాం’ అనే అంశంపై కవితల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్‌కు ప్రథమ బహుమతి లభించింది. 350 మంది కవులు పాల్గొన్నారు. ‘తనుత్రాణం’ పేరుతో రచించిన కవితకు ప్రశంసలు లభించాయి.

News July 12, 2024

నరసాపురం: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నరసాపురం మండలం కొప్పర్రులో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. నరసాపురం పట్టణానికి చెందిన వీర వెంకట సూర్యనారాయణ మూర్తి (62) భీమవరంలో బ్యాంక్‌ పనిమీద బైక్‌పై బయలుదేరాడు. కొప్పర్రు గ్రామానికి చేరుకోగానే వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో సూర్యనారాయణ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు రూరల్ SI గుర్రయ్య తెలిపారు.

News July 12, 2024

పోలవరం: 7,080 క్యూసెక్కుల నీటి విడుదల

image

పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 7,080 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పెద్దిరాజు శుక్రవారం తెలిపారు. పట్టిసీమలో గోదావరి నీటిమట్టం 15.387 మీటర్లకు చేరుకుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20 పంపులు, 20 మోటార్లతో నీటిని విడుదల చేశామని వివరించారు.

News July 12, 2024

వరి రైతులతో ఏలూరు ఎంపీ సమావేశం

image

రాజమండ్రిలో అతిపెద్ద వరి ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం, నిత్యం 3,000 టన్నుల నుంచి 3,500 టన్నుల ధాన్యం అవసరమవుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. ఏలూరులో వరి రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారని, తడిసిన ధాన్యాన్ని కూడా వారే కొంటారని తెలిపారు. వరి రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారించటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

News July 12, 2024

ఏలూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలప్రోలు రైల్వేస్టేషన్ దాటిన తరువాత అస్సాం రాష్ట్రానికి చెందిన రెబ్బా అనే వ్యక్తి కదులుతున్న రైలులోంచి జారిపడి శుక్రవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే SI నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డెడ్ బాడీని భద్రపరిచామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 12, 2024

పామాయిల్ బోర్డు ఏర్పాటుపై ఏలూరు MP హామీ

image

పొగాకు, కొబ్బరికి బోర్డులు ఉన్నట్లుగా, పామాయిల్ బోర్డు ఏర్పాటుకు కృషిచేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఏలూరులో వరి, పామాయిల్ రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పామాయిల్‌కు బేసిక్ ధరగా రూ.17,000 నిర్ణయించమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదామన్నారు. ఆ ధర నుంచి ఏటా మరింత పెంచేలా ప్రయత్నిస్తానన్నారు.

News July 12, 2024

ప.గో జిల్లాలో 2.42 లక్షల మందికి లబ్ధి

image

తల్లికి వందనం పథకం కింద టీడీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు చొప్పుల తల్లుల ఖాతాలో జమచేయనుంది. దారిద్ర్య రేఖ దిగువన ఉండి, 1 నుంచి 12 తరగతి చదువుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 2.42లక్షల మందికి ఈ సొమ్ము అందనున్నట్లు డిఈవో జి.నాగమణి తెలిపారు.

News July 12, 2024

నరసాపురం: మత్స్యకారుల గోడు

image

సముద్ర తీర మండలాల్లోని మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందని ద్రాక్షగా మారింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు రెండు నెలలపాటు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ కాలంలో మత్స్యకారుల ఉపాధి నిమిత్తం ప్రభుత్వం నెలకు రూ.10 వేలు చొప్పున రెండు నెలలకు రూ.20 వేలు ఇవ్వాలి. వేట నిషేధ గడువు ముగిసినా భృతి అందకపోవడంతో సొమ్ముల కోసం వీరంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

News July 12, 2024

చింతలపూడి: సోదరిని చూసేందుకు వెళ్తూ మృతి

image

చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గాలంకి శ్యామ్ యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. అతని తల్లితో కలిసి విజయవాడలోని తన సోదరిని చూసేందుకు వెళ్తుండగా మృత్యువు కబలించింది. ప్రమాదంలో మృతుని తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. శ్యామ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB)లో పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు.

News July 12, 2024

మున్సిపల్ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష

image

పాలకొల్లులో గురువారం సాయంత్రం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా టిడ్కో ఇళ్ల కాలనీలో మౌలిక సమస్యలు, బొండాడ వెంకటరాజు గుప్తా, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, హెల్త్ పార్క్, హిందూ స్మశానవాటిక పనులపై ఆరా తీశారు.