Y.S.R. Cuddapah

News July 29, 2024

దువ్వూరు: చల్లబసాయపల్లె డ్యామ్‌లో ముగ్గురు గల్లంతు

image

కడప జిల్లా దువ్వూరు మండలంలోని చల్లబాసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్-1లో ముగ్గురు గల్లంతయ్యారు. ఆదివారం విహారయాత్ర కోసం వెళ్లిన ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు డ్యామ్‌లో ఈత కొడుతుండగా గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 29, 2024

కమలాపురం: పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు

image

సుమారు 75 మందిని మోసం చేసిన ఘరానా మోసగాడు పోలీసులకు చిక్కాడు. కమలాపురానికి చెందిన కైప నాగేంద్రప్రసాద్ శర్మ తక్కువ ధరలకే కార్లు, భూములు ఇప్పిస్తానని చెప్పి రూ.12.83కోట్లు దండుకున్నాడు. ఇతడిని 2021లో KPHB పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్ట్ చేద్దామని వస్తే వాగ్వాదం పెట్టుకునేవాడు. బెంగళూరులో ఉన్న అతడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండుకు తరలించారు.

News July 29, 2024

వేముల: 37 ఏళ్ల తర్వాత కలిశారు

image

వేముల మండలంలో ఓ అపూర్వ ఘటన చోటుచేసుకుంది. 1987-88లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 10వ తరగతి విద్యార్థులు ఒక్క చోటకి చేరుకున్నారు. ఆదివారం వారంతా వారు చదువుకున్న పాఠశాలలో గడిపారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత చిన్నప్పుడు వాళ్లు చేసిన చిలిపి పనులు, టీచర్లతో తిట్లు, అభినందనలు, తోటి స్నేహితుడికి ఏడిపించడం ఇలా చిన్నప్పుడు వారు చేసిన మధుర స్మృతులను నెమరేసుకున్నారు.

News July 29, 2024

రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రొద్దుటూరు విద్యార్థులు

image

నంద్యాలలో నేడు జరిగిన జిల్లా స్థాయి జంప్ రోప్ పోటీలలో ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పసిడి, రజతం, కాంస్య పథకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ షేక్ ఇలియాస్ తెలిపారు. ఆగస్టు నెలలో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగే రాష్ట్రస్థాయి జంప్ రోప్ పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు. అనంతరం పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

News July 29, 2024

కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

image

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

News July 28, 2024

ఓబులవారిపల్లి: ముగ్గురాళ్ల గుట్ట కింద మృతదేహం

image

ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటలో ముగ్గు రాళ్ల కుప్ప కింద ఓ మృతదేహం కలకలం రేపింది. మృతుడు మంగంపేట ఎస్టీ కాలనీకి చెందిన వెలుగు రాజేంద్ర (35)గా స్థానికులు గుర్తించారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 28, 2024

కడప: రేపు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రేపు ఉదయం కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు నేరుగా 08562-244437 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలుపవచ్చన్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

News July 28, 2024

కడప జిల్లాలో పింఛన్ల పంపిణీలో 5,594 ఉద్యోగులు

image

కడప జిల్లాలో 645 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, వాటిలో పనిచేసేవారు 6,877 మంది. కాగా వారిలో 5,594 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 724 చోట్ల ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరో 559 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే నెల 1న పైన తెలిపిన 5,594 మంది సచివాలయ ఉద్యోగులు పింఛను నగదును అందజేయాలని జిల్లా DRDO తెలిపారు. ఒక్కో ఉద్యోగి 50 నుంచి 100 మందికి ఇవ్వాలని, అంతకుమించి ఎక్కువ మందికి ఇవ్వకూడదన్నారు.

News July 28, 2024

కడప-పులివెందుల రహదారిపై ప్రమాదం.. ఒకరు మృతి

image

వేముల మండలం బెస్తవారిపల్లె గ్రామ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో నేషనల్ హైవే పనుల కోసం బిహార్ నుంచి వచ్చిన ఓ కార్మికుడు బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు రూట్ లైన్ ఇనుప కడ్డీలను ఢీకొట్టాడు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News July 28, 2024

కడప: వర్షాలు లేక జలాశయాలు ఖాళీ

image

కడప జిల్లాలో ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో జలాశయాలు వెలవెలబోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 11 జలాశయాలు ఉండగా వాటిల్లో కనీసం 50% నీటి సామర్థ్యం కూడా లేదని అధికారులు చెబుతున్నారు. సగిలేరు, బుగ్గ వంక జలాశయాలయితే పూర్తిగా ఖాళీ అయినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జలాలను తరలించి జలశయాలను నీటితో నింపాలని రైతులు కోరారు.