Y.S.R. Cuddapah

News July 25, 2024

కడప: మంత్రి ఫోన్ చేస్తే ఎవరు అంటూ ప్రశ్న.. అధికారిపై వేటు

image

RTC కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరావుపై బదిలీ వేటు పడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించినా ఈడీ పట్టించుకోలేదు. మంత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోగా, తరువాత ఎవరంటూ ఎదురు ప్రశ్నించారని అన్నారు. ఈడీ YCP నేతలకు అనుకూలంగా ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై పలు ఫిర్యాదులు రాగా, ఈడీ పోస్టు నుంచి తప్పించారు.

News July 25, 2024

కడప RIMSలో నిఫా వైరస్‌కు ప్రత్యేక వార్డు

image

కడప ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఐపీ విభాగంలో ‘నిఫా వైరస్’ బాధితుల కోసం 10 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయగా, బుధవారం దీనిని ప్రారంభించారు. ఎవరైనా ఈ తరహా వైరస్‌తో బాధపడుతూ వస్తే వారికి ప్రత్యేకంగా చికిత్స చేసేందుకు ఈ వార్డును ఉపయోగించుకోవచ్చని రిమ్స్ ఆర్ఎంఓ వై.శ్రీనివాసులు తెలియజేశారు. ఈ వైరస్‌తో బాధపడేవారికి మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, అనస్తీషియా వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు.

News July 25, 2024

అన్నమాచార్య కళాశాల అధ్యాపకునికి డాక్టరేట్

image

రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న అల్లూరయ్యకు వేలూరు విఐటి యూనివర్సిటీ వారు పీహెచ్డీ ప్రదానం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ తెలిపారు. తాను చేసిన పరిశోధన వల్ల హైబ్రిడ్ మైక్రో గ్రిడ్ సిస్టమ్ ద్వారా తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ ఇవ్వవచ్చని డాక్టర్ అల్లూరయ్య తెలిపారు. డీన్స్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక బృందం అల్లూరయ్యను అభినందించారు.

News July 25, 2024

కడప: 27 లోపు వివరాలను నమోదు చేయాలి

image

వైవీయూలోని అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్‌ అందరికీ, డిగ్రీ 2023-24 సంవత్సరాలకు సంబంధించిన II, IV సెమిస్టర్‌ల EDX కోర్సు వివరాలను 27వ తేదీలోపు నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్. ఈశ్వర్ రెడ్డి తెలిపారు. హార్డ్ కాపీని పరీక్షా శాఖ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఇప్పటికే YVUకు హార్డ్ కాపీలు పంపిన వారు మళ్లీ పంపవద్దని సూచించారు.

News July 24, 2024

కడప: బాలికపై అత్యాచారం.. నిందితుడికి రూ.3 వేలు జరిమానా

image

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన కేసులో బాలుడికి రూ.3 వేల జరిమానా, 2 ఏళ్లపాటు అబ్జర్వేషన్ హోంకు పంపుతూ కడప జువైనల్ జస్టిస్ బోర్డ్ జడ్జి నందిని మంగళవారం తీర్పు చెప్పారు. 2021 ఆగస్టు 12న చక్రాయపేట లో 9 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

News July 24, 2024

మైదుకూరు మాజీ ఎమ్మెల్యేకి బెయిల్ మంజూరు

image

మైదుకూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. రూ.30 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ మంగళవారం ఈమేరకు తీర్పు ఇచ్చారు. ఎన్నికల సమయంలో చాపాడు పోలీసులు తనపై నమోదు చేసిన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని రఘురామిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

News July 24, 2024

ప్రొద్దుటూరు వాసికి YVU డాక్టరేట్

image

వైవీయూ కెమిస్ట్రీ స్కాలర్ వై.వి. దివ్యశ్రీకి వైవీయూ డాక్టరేట్ ప్రదానం చేసింది. కెమిస్ట్రీ ప్రొ. ఎన్.సి. గంగిరెడ్డి పర్యవేక్షణలో ‘ఇటానియం బేస్డ్ నానో క్యాటలిస్ట్ డే డిగ్రీడేషన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్’పై చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వైవీయూ పరీక్షల నిర్వహణాధికారి ప్రొ. ఎన్. ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఈమె ప్రొద్దుటూరులో వార్డు సెక్రటరీగా పనిచేస్తున్నారు.

News July 24, 2024

మైలవరం: నలుగిరి ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బంది

image

మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ, ఇద్దరు పిల్లలతో పాటు మంగళవారం రాత్రి 8గం. మైలవరం డ్యామ్ 13వ గేటు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు వెంటనే ఎస్సై, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇంట్లో సమస్యలే కారణమని అందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో అంజనమ్మ తెలిపింది.

News July 24, 2024

జిల్లాలోని ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో పారామెడికల్ సిబ్బంది నియామక నోటిఫికేషన్‌పై, కడప జీజీహెచ్, క్యాన్సర్ కేర్ సెంటర్, జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు, జీజీహెచ్ పులివెందుల ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

News July 24, 2024

వాణిజ్య శాస్త్ర విద్యార్థులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు: వీసీ

image

కామర్స్ చదివిన వారికి విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వైవీయూ వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఉద్బోధించారు. విశ్వవిద్యాలయంలో కామర్స్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి ఒక దీపదారిలా ఉండేలా జ్ఞానాన్ని పొందాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. నిత్యం సానుకూల ఆలోచనలు చేయాలని సూచించారు.