Y.S.R. Cuddapah

News June 27, 2024

కడప జిల్లా విజిలెన్స్ ఏఎస్పీగా నీలం పూజిత

image

ఉమ్మడి కడప జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ఏఎస్పీగా నీలం పూజితను నియమిస్తూ బుధవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నీలం పూజిత గతంలో ప్రొద్దుటూరు డీఎస్పీగా, జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన)గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కర్నూలులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేస్తూ బదిలీపై జిల్లాకు రానున్నారు. నాలుగైదు రోజుల్లోనే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

News June 27, 2024

పులివెందుల: YSR పేరు తీసేసిన కూటమి నేతలు

image

పురాతన రంగనాథస్వామి ఆలయం ఎదురుగా నిర్మించిన కూరగాయల మార్కెట్ పేరును టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మార్చారు. వైఎస్సార్ కూరగాయల మార్కెట్ గా ఉన్న పేరును మారుస్తూ బుధవారం రంగనాథస్వామి కూరగాయల మార్కెట్ అని బోర్డు ఏర్పాటు చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులు శశి భూషణ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల కూరగాయల మార్కెట్ కు గత ప్రభుత్వంలో వైఎస్సార్ కూరగాయల మార్కెట్‌గా పేరు పెట్టిందన్నారు.

News June 27, 2024

కడప: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జులై 1 వరకు గడువు

image

పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 27వ తేదీ నుంచి జులై 1వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజును హెచ్ఎంకు మాత్రమే సమర్పించాలన్నారు. ప్రతి సబ్జెక్టు జవాబు స్క్రిప్ట్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుం రూ.500 చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కోసం రూ. 1000 చెల్లించాలని తెలిపారు.

News June 27, 2024

కడపలో యువతి ఆత్మహత్య

image

కడప నగరంలోని ప్రకాష్ నగర్‌లో నివాసం ఉంటున్న భాను శ్రీ అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు చిన్న చౌక్ ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. భాను శ్రీ కడప నగర శివార్లలోని బుడ్డాయిపల్లెలో ఉన్న కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. బుధవారం ఉదయం ఓ ఫంక్షన్‌కు వెళ్లే విషయంలో అక్కాచెల్లెళ్లు గొడవ పడడంతో తల్లి భాను శ్రీని మందలించింది. దీంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

News June 27, 2024

IIIT అడ్మిషన్ల పక్రియ కన్వీనర్‌గా అమరేంద్ర

image

ఆర్జీయూకేటీ పరిధిలోని ఆయా IIITలో 2024-25 సంవత్సరానికి జరిగే అడ్మిషన్ల పక్రియ అధ్యాపకుడిగా డా.అమరేంద్ర కుమార్‌ను అధికారులు నియమించారు. దీనిపై ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో అమరేంద్ర కుమార్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా పని చేశారన్నారు.

News June 27, 2024

కడపను కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: డీఆర్ఓ గంగాధర్

image

వైఎస్సార్ జిల్లాను కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీఆర్ఓ గంగాధర్ గౌడ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో లెప్రసీ కేసెస్ డిటెక్షన్ క్యాంపెయిన్‌పై జిల్లా సమన్వయ కుష్ఠు వ్యాధి కమిటీ సమావేశం జరిగింది. డీఆర్ఓ మాట్లాడుతూ.. జాతీయ కుష్ఠు వ్యాధి గుర్తింపు అవగాహన కార్యక్రమాన్ని జిల్లాలో జులై 18 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు 15 రోజులు నిర్వహిస్తామన్నారు.

News June 26, 2024

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 5వ స్థానంలో కడప

image

కాసేపటి క్రితం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కడప జిల్లా నుంచి 2,566 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,083 మంది పాసయ్యారు. జిల్లాలో 81.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోనే కడప జిల్లా 5వ స్థానంలో నిలిచింది

News June 26, 2024

కడప: రీజనల్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ బదిలీ

image

కడప, అనంతపురం జిల్లాల రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ షేక్ మసూం బాషాను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో కర్నూలు విజిలెన్స్ అధికారిగా ఉన్న నీలం పూజితను నూతన రీజనల్ విజిలెన్స్ అధికారిగా నియమించారు. ఇదివరకే జిల్లాలో నీలం పూజిత అడిషనల్ ఎస్పీగా పని చేశారు.

News June 26, 2024

ఖాజీపేట: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి..

image

కడప జిల్లా ఖాజీపేట వాసి ముత్తూరు రమణ నాయుడు తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామ సమీపంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన చెల్లి గ్రామమైన వేముల గొందికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం చికెన్ కోసం బైక్‌పై వెళుతుండగా అదుపుతప్పి కింద పడి మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 26, 2024

ముద్దనూరులో విద్యార్థులకు అస్వస్థత

image

కడప జిల్లా ముద్దనూరులోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తిన్న తరువాత విద్యార్థులకు వాంతులు అయ్యాయి. వెంటనే సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి కడప జిల్లా కలెక్టర్ మాట్లాడి సమాచారం తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.