Y.S.R. Cuddapah

News April 29, 2024

సిద్దవటం: వడదెబ్బతో యువకుడి మృతి

image

సిద్దవటం మండలంలో వడదెబ్బకు గురై నాగేంద్ర అనే యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. లింగంపల్లికి చెందిన నాగేంద్ర పనులు ముగించుకొని ఆటోలో వెళుతుండగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News April 29, 2024

మే 2న జిల్లాకు రానున్న చంద్రబాబు, లోకేశ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. మధ్యాహ్నం రాయచోటిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్న చంద్రబాబు సాయంత్రం కడప నగరానికి చేరుకుని రోడ్ షోలో పాల్గొని ప్రజాగళం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రానున్నారు. యువతతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

News April 29, 2024

కడప: నంది వాహనంపై రామలింగేశ్వర స్వామి

image

ప్రొద్దుటూరు రామేశ్వరంలోని శ్రీముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి, రాజరాజేశ్వరి దేవీకి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. రాత్రి గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి నంది వాహనంపై ఆశీనులు చేశారు. భక్తులు స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు.

News April 28, 2024

BREAKING: కడప-తాడిపత్రి హైవేపై రోడ్డు ప్రమాదం

image

కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని వల్లూరు మండలం తోల్లగంగనపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కడప నుంచి కమలాపురం వైపు బైక్‌లో వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News April 28, 2024

ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి: ఎస్పీ సిద్ధార్థ కౌశల్

image

ఎన్నికల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశించారు. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరులోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఆదివారం దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలన్నారు.

News April 28, 2024

కమలాపురం-యర్రగుంట్ల హైవేపై రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

ఖాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్ బాబాఫకృద్దీన్(40) రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బాబాఫకృద్దీన్ యర్రగుంట్ల నుంచి కమలాపురానికి ఆటోలో వస్తుండగా గ్రామచావిడి వద్ద ఆయనకు ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఆటోను పక్కకు ఆపే క్రమంలో రోడ్డు పక్కన గోడకు ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందాడు.  

News April 28, 2024

స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవాలి: కడప ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అన్నారు. ఆదివారం ఆయన జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నకొమెర్లను సందర్శించారు. ప్రజలు ఎవరి ప్రలోభాలు, బెదిరింపులకు భయపడవద్దని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

News April 28, 2024

శిక్షణకు గైర్హాజరైతే కఠిన చర్యలు: కడప కలెక్టర్

image

సాధారణ ఎన్నికలకు సంబంధించి నియమించిన పోలింగ్ సిబ్బంది ఎవరైనా శిక్షణా తరగతులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జనరల్ అబ్జర్వర్ కునాల్ సిల్ కు పేర్కొన్నారు. జిల్లాలోని 2035 పోలింగ్ కేంద్రాలకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఆరుగురు సిబ్బంది చొప్పున 15% రిజర్వుతో టీంలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశామన్నారు. పీఓ, ఏపీఓలకు మే 2, 3 తేదీల్లో శిక్షణ జరుగుతుందన్నారు.

News April 28, 2024

కడప: మే 4లోపు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాలి

image

ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన అభ్యర్థులు మే 4 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ అనురాధ, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. రూ.25 అపరాధ రుసుంతో మే 5 నుంచి 6 వరకు, రూ.50 అపరాధ రుసుంతో 7 నుంచి 8 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే తత్కాల్ పద్ధతిలో పదో తరగతికి రూ.500, ఇంటర్‌కు రూ.1000తో ఫీజు మే 9 నుంచి 10 వరకు గడువు ఉంటుందని తెలిపారు.

News April 28, 2024

కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసిన కడప SP

image

సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్నపల్లి క్రాస్ చెక్ పోస్టు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ కె.శివప్రసాద్ (పి.సి 2825)ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్.పి సిద్ధార్థ్ కౌశల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ క్రమశిక్షణ ఉల్లంఘించి మద్యం సేవించి విధులకు హాజరయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెన్షన్ వేటు వేశారు.