India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రొద్దుటూరులో గురువారం 2,893 మద్యం బాటిళ్లను కడప సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు సమక్షంలో ధ్వంసం చేశారు. ప్రొద్దుటూరు రూరల్, వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లు, రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 98 కేసుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సీఐలు రమణారెడ్డి, శ్రీకాంత్, అబ్దుల్ కరీం, మహేష్ కుమార్ పాల్గొన్నారు.

టీడీపీ అధికారంలోకి రావడంతో పోలీసుశాఖ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో సీఐలు, ఎస్ఐల బదిలీలు ప్రారంభమయ్యాయి. బుధవారం కొంతమందిని వివిధ ప్రాంతాలకు మార్చారు. మరో రెండు రోజుల్లో సీఐ, ఎస్ఐలతో పాటు డీఎస్పీలకు స్థానచలనం కలగనుంది. వైసీపీ ప్రభుత్వంలో లూప్‌లైన్‌లో ప్రాధాన్యం లేని విభాగాల్లో ఉన్న వారందరూ ప్రస్తుతం తెరపైకి వస్తున్నారు. కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.

యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొందరు టీడీపీ నాయకులు తొలగించాలని వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రం అందించడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ యోగివేమన విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడని, దాదాపు 16 ఏళ్ల నుంచి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించబడి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల ద్వారా విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు.

కడప రాజారెడ్డి వీధి సమీపంలోని పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ స్థలంలో మీకు 4.. మాకు 4 రూములు అని వైసీపీ &టీడీపీ నాయకులు పంచుకున్నట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. అక్రమంగా లీజు పొందడమే కాకుండా టౌన్ ప్లానింగ్ విభాగంతో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆ భవనాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామం మొటుకువాండ్లపల్లికు చెందిన సంతోష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ కుమారుడు సంతోష్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఉన్నట్లుండి ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ముక్కవారిపల్లిలో ఎస్వీ కళ్యాణ్ మండపం దగ్గర జాతీయ రహదారిపై కారును లారీ ఢీ కొన్న సంఘటనలో కారు నుజ్జైంది. కారులో డ్రైవర్‌తో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి సిమ్స్‌కు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించి కేసు నమోదుచేశారు.

ఇప్పటి వరకు ముగ్గురు సీఎంలు శంకుస్థాపనలు చేశారు కానీ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేయలేకపోయారు. 2007లో దివంగత CM రాజశేఖర్ రెడ్డి మొదటిసారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2018లో CM చంద్రబాబు, 2019లో మాజీ CM జగన్ కన్యతీర్థం వద్ద, తిరిగి 2023లో జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి జగన్ టెంకాయ కొట్టారు. ఈ స్టీల్ ప్లాంట్ వస్తే పరోక్షంగా కాని, ప్రత్యక్షంగా కాని వేల ఉద్యోగాలు వస్తాయి.

రాయచోటిలో వైసీపీ కౌన్సిలర్లపైన దాడి చేయడం దురదృష్టకరమని వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడ్డ రాయచోటి ప్రజలకు ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ పార్క్ సమీపంలో ఓ యువకుడు, మరో యువకుడిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి పది గంటల సమయంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని సీఐ సి.భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బ్లూ కోల్ట్స్ సిబ్బంది హుటాహుటిన చేరుకున్నారు. గాయపడిన యువకుడిని రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటన వివరాలు తెలియాల్సి ఉంది.

వర్షాల కారణంగా టమాట పంటలు దెబ్బతింటున్నాయి. ఈ కారణంగా వ్యాపారులు టమాటాలను దిగుమతి చేయట్లేదు. వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ శాఖ పుంగనూరు నుంచి టమాటాలను కొనుగోలు చేసి కడప రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ ద్వారా అమ్మకాలు చేపట్టింది. వినియోగదారులకు కిలో రూ.60 విక్రయిస్తున్నారు. కాగా కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది.
Sorry, no posts matched your criteria.