Y.S.R. Cuddapah

News July 27, 2024

వల్లూరు: ట్రాక్టర్ కింద పడి విద్యార్థిని మృతి

image

వల్లూరు మండల పరిధిలోని పెద్దపుత్తలో శనివారం సాయంత్రం ట్రాక్టర్ కింద పడి విద్యార్థిని మృతి చెందింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న రెడ్డెమ్మ అనే బాలిక పాఠశాల ముగిసిన అనంతరం సైకిల్లో ఇంటికి వస్తుండగా రాళ్ళ లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని ఎస్సై వెంకటరమణ పరిశీలించారు.

News July 27, 2024

కడప: త్వరలో జిల్లాలో డీఎస్పీలు, సీఐల బదిలీలు

image

కడప జిల్లాలో వివిధ ప్రదేశాల్లో డీఎస్పీలుగా, సీఐలుగా పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేస్తారని పోలీసు వర్గాల ద్వారా వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కడప డీఎస్పీతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు మెడికల్ లీవ్‌లో వెళ్లడం గమనార్హం.

News July 27, 2024

కడప జిల్లాలో 40 మంది తహసీల్దార్లు రిలీవ్

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై కడప జిల్లాకు వచ్చిన 40 మంది తహశీల్దార్లను తిరిగి ఆయా జిల్లాలకు బదిలీ చేస్తూ కలెక్టర్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం వారంతా రిలీవ్ అయ్యారు. ఇక్కడి నుంచి వెళ్లిన వారు సోమవారం జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. బదిలీపై వెళ్లిన తహశీల్దార్ల స్థానంలో డిప్యూటీ తహశీల్దార్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

News July 27, 2024

మైదుకూరు: కులం పేరుతో దూషించారని ఫిర్యాదు

image

మైదుకూరు మండలంలోని ఓ ZPHSలో ఉపాధ్యాయుడు ఏడో తరగతి విద్యార్థిని కులం పేరుతో దూషించి పాఠశాల నుంచి గెంటేశారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్వ విద్యార్థి చరణ్ కుమార్ పాఠశాలకు వచ్చి బాధిత విద్యార్థిని పిలిచి మాట్లాడుతుండగా ఆ ఉపాధ్యాయుడు జోక్యం చేసుకుని దాడి చేసి కులం పేరుతో దూషించారు. చరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

News July 27, 2024

వైసీపీ హయాంలో బీటెక్ రవిపై 10 కేసులు: టీడీపీ

image

వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులుపై 2,560 కేసులు నమోదు చేశారని చంద్రబాబు అన్నారు. కడప జిల్లాలో జగన్ పై పోటీ చేసిన బీటెక్ రవిపై జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డిపై నాలుగు కేసులు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై ఒక కేసు నమోదయ్యాయని అన్నారు. అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై కేసుల పరంపర కొనసాగిందని ఆరోపించారు.

News July 27, 2024

రాయచోటి: నారా లోకేశ్‌ను కలిసిన డిప్యూటి ఛైర్ పర్సన్

image

YCP ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం శుక్రవారం నారా లోకేశ్‌ మర్యాదపూర్వంగా కలిశారు. ఒకవైపు YCP నేతలు చట్ట సభలను బహిష్కరించినా, జకియా ఖానం మండలికి హాజరవుతున్నారు. దీంతో ఆమె TDPలోకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 2019లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 2021లో డిప్యూటి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

News July 27, 2024

వీఆర్‌కు కడప ఒకటో పట్టణ ఎస్ఐ

image

కడప ఒకటో పట్టణ ఠాణా ఎస్ఐ మధుసూదన్‌రెడ్డిని వీఆర్‌కు పంపుతూ జిల్లా పోలీసు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల కిందట ఎస్ఐ రాజీవ్ పార్కు వద్ద ఓ యువకుడిని లాఠీతో చితకబాదిన విషయం తెలిసిందే. దీనిపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్‌కు పంపినట్లు పోలీసు శాఖ తెలిపారు.

News July 27, 2024

అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: డీఎస్పీ

image

అప్రమత్తంగా ఉండటం వల్ల సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం వద్ద ఉన్న పశువైద్య కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ అడిక్షన్, యాంటీ ర్యాగింగ్, రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. అమ్మాయిలు సైబర్ క్రైమ్స్ బారిన పడి లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. ఆన్లైన్ గేమ్స్, యాప్స్ వల్ల నష్టపోతున్నారని తెలిపారు.

News July 27, 2024

కడప: వైవీయూ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందండి

image

వైవీయూ డిగ్రీ కోర్సులలో నమోదైన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని ప్రవేశాలు పొందాలని వైవీయూ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ వెబ్ ఆప్షన్ ప్రారంభమైందన్నారు. బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీకాం కంప్యూటర్ ఆనర్స్ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి వైవీయూలో ప్రారంభించామన్నారు.

News July 26, 2024

ప్రొద్దుటూరు: పాలిటెక్నిక్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్

image

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల స్పాట్ అడ్మిషన్లు జులై 31వ తేదీన నిర్వహించినట్లు జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్ జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, సెకండ్ షిఫ్ట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో జులై 31 తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.