news

News October 28, 2024

నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన సాయిపల్లవి

image

ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించిన ఫొటోలను హీరోయిన్ సాయిపల్లవి పంచుకున్నారు. ‘అమరన్ సినిమా ప్రమోషన్లను ప్రారంభించే ముందు అక్కడికి వెళ్లాలనుకున్నా. మనకోసం ప్రాణాలు అర్పించిన సైనికుల జ్ఞాపకార్థం ఇక్కడ వేలాది ఇటుకలను ఉంచారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ AC(P)& సిపాయి విక్రమ్ సింగ్‌లకు నివాళి అర్పిస్తూ నేను భావోద్వేగానికి లోనయ్యా’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ‘అమరన్’ ఈనెల 31న రిలీజ్ కానుంది.

News October 28, 2024

రైతులను దివాలా తీయిస్తారా?: KTR

image

TG: రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనడం లేదన్న మీడియా కథనాలపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘దసరాకే కాదు. దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి’ అని కోరారు.

News October 28, 2024

పాక్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ గుడ్ బై

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టెన్ తప్పుకున్నారు. ప్లేయర్లతో అభిప్రాయ భేదాలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో జాసన్ గిలెస్పీ/ఆకిబ్ జావేద్‌ను కోచ్‌గా నియమించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మేలో కిర్‌స్టెన్ PAK వైట్ బాల్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కాంట్రాక్టు ప్రకారం ఆయన రెండేళ్లపాటు కొనసాగాల్సి ఉంది. కానీ 6 నెలలకే రిజైన్ చేశారు.

News October 28, 2024

భారత్ చరిత్రలో తొలిసారి!

image

ప్రతిష్ఠాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని భారత్ గెలుచుకుంది. పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా పోటీలో విజయం సాధించి మన దేశానికి తొలి కిరీటాన్ని తెచ్చిపెట్టారు. దీంతోపాటు గ్రాండ్ పేజెంట్స్ ఛాయిస్ అవార్డునూ ఆమె గెలుచుకున్నారు. ఇందులో 70 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. ‘మనం సాధించాం. భారత చరిత్రలో మొదటి గోల్డెన్ క్రౌన్‌ను గెలిచాం’ అని రాచెల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News October 28, 2024

అమెరికాకు ఆయుధాలు ఎగుమతి చేస్తున్న భారత్

image

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకొనే స్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది. 2023-24లో మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ విలువ ఏకంగా రూ.21,083 కోట్లకు చేరింది. 100 దేశాలకు ఎగుమతి చేస్తుండగా అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా టాప్-3 కస్టమర్లుగా ఉన్నాయి. బ్రహ్మోస్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్, పినాక మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్, 155mm ఆర్టిలరీ గన్స్‌ను భారత్ ఎగుమతి చేస్తోంది.

News October 28, 2024

‘కటాఫ్ డేట్’తో రైతులకు ఇక్కట్లు

image

కటాఫ్ డేట్ నిబంధన కారణంగా పీఎం కిసాన్ పథకానికి లక్షలాది మంది రైతులు దూరమవుతున్నారు. 2018 డిసెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి 1 మధ్య భూమి ఎవరి పేరుతో ఉంటే వారికే ఏటా రూ.6వేలను కేంద్రం అందిస్తోంది. ఆ తేదీ తర్వాత భూమి కొనుగోలు చేసినవారు, వారసత్వంగా పొలం సంక్రమించినవారికి పీఎం కిసాన్ లబ్ధి చేకూరడం లేదు. అందరికీ డబ్బులు అందేలా కేంద్రం నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నారు.

News October 28, 2024

నేటి నుంచి బీసీ కమిషన్ పర్యటనలు

image

TG: జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నేటి నుంచి బీసీ కమిషన్ జిల్లాల్లో పర్యటించనుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాతో ఈ పర్యటన ప్రారంభం కానుంది. రేపు నిజామాబాద్, ఆ తర్వాత వరుసగా సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో విచారణ ఉంటుంది.

News October 28, 2024

విషాదం.. ప్రాణం తీసిన చికెన్ ముక్క

image

AP: అన్నమయ్య(D) రాజంపేట(మ) మన్నూరులో విషాదం చోటుచేసుకుంది. చికెన్ ముక్క రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. నిన్న ఆదివారం కావడంతో కృష్ణయ్య, మణి దంపతులు చికెన్ వండారు. పొరపాటున కింద పడ్డ చికెన్ ముక్కను సుశాంక్ తినేందుకు యత్నించాడు. గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతోనే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News October 28, 2024

పవన్ కళ్యాణ్ ఆఫీసులో లేపాక్షి బొమ్మల ఎగ్జిబిషన్ స్టాల్

image

AP: లేపాక్షి బొమ్మలపై ఇష్టంతో డిప్యూటీ సీఎం పవన్ తన క్యాంప్ కార్యాలయంలో లేపాక్షి బొమ్మల శాశ్వత ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేయించారు. వీటితో పాటు సవర తెగకు చెందిన గిరిజనులు ఎంతో ఇష్టంతో పంపించిన బహుమతులను అందుకుని ఆయన సంతోషించారని Dy.CM కార్యాలయం ట్వీట్ చేసింది. అలాగే తన పుట్టినరోజు సమయంలో వారు చేసిన కార్యక్రమాలు, వేడుకలను గురించి తెలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారని ఫొటోలు పోస్ట్ చేసింది.

News October 28, 2024

టపాసుల వ్యాపారం.. తుస్సు.. తుస్సు..

image

AP: మరి కొద్ది రోజుల్లో దీపావళి పండుగ. కానీ బాణసంచా మార్కెట్‌లో సందడి లేదు. ఏటా ఈ సమయానికి హోల్‌సేల్ మార్కెట్‌లో 70-80% వరకు అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 25శాతం వ్యాపారం కూడా జరగలేదని విజయవాడలో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రతి ఇంట్లో చెప్పుకోలేనంత నష్టం జరిగింది. దీనికి తోడు పెరిగిన నిత్యావసర ధరలతో టపాసుల కొనడంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిందంటున్నారు వ్యాపారులు.