news

News April 14, 2025

విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు.. కొత్త వివాదంలో TN గవర్నర్

image

తమిళనాడు గవర్నర్ R.N.రవిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మధురైలోని ఓ కళాశాల విద్యార్థులతో ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయించారు. మతాలకు అతీతమైన పదవిలో ఉండి ఇలా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని DMK, కాంగ్రెస్, CPI నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

News April 14, 2025

అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం: CM

image

AP: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి అంబేడ్కర్ పునాదులు వేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామన్నారు. ‘ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దాం. అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం’ అని ట్వీట్ చేశారు.

News April 14, 2025

అంబేడ్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన: KCR

image

TG: డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మాజీ సీఎం KCR నివాళులు అర్పించారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా BRS పాలన సాగిందని, దళితబంధు సహా అనేక పథకాలను అమలు చేశామని తెలిపారు. నేటి ప్రభుత్వం వాటిని కొనసాగించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News April 14, 2025

రూ.13వేల కోట్ల మోసం.. మెహుల్ ఛోక్సీ అరెస్టు

image

వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)ను మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. భారత ఏజెన్సీలైన CBI, ED విజ్ఞప్తి మేరకు అతడిని అరెస్టు చేశారు. ఛోక్సీపై గతంలో ముంబైలో నాన్-బెయిలబుల్ వారెంట్లు నమోదయ్యాయి. PNBని రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా ఛోక్సీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. అతడి మేనల్లుడు నీరవ్ లండన్ జైలులో ఉన్నారు.

News April 14, 2025

మే నాటికి GPOల నియామకం: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్రంలోని 10,956 గ్రామాల్లో మే నాటికి గ్రామ పాలనాధికారుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం 480 మంది సర్వేయర్లు ఉన్నారని, వారి సంఖ్యను 1000కి పెంచుతామని తెలిపారు. ‘భూ భారతి’ చట్టాన్ని జూన్ 2లోగా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామన్నారు. ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News April 14, 2025

‘రాజీవ్ యువ వికాసం’.. నేడే చివరి తేదీ.. గడువు పొడిగిస్తారా?

image

TG: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. గడువును ఈనెలాఖరు వరకు లేదా మరో 10 రోజులపాటు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకు 14 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం.

News April 14, 2025

రెండ్రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు మండుతాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర, యానాం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News April 14, 2025

సిక్స్ కొట్టినా, వికెట్ తీసినా రూ.లక్ష.. ఎందుకో తెలుసా?

image

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)కు చెందిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు, బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కు లక్ష పాకిస్థానీ రూపాయల($356) చొప్పున పాలస్తీనా చారిటబుల్ సంస్థలకు విరాళంగా ఇస్తామని ప్రకటించింది. అక్కడి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే వాటికి ప్రాధాన్యత ఇస్తామంది. కరాచీ కింగ్స్‌తో తొలి మ్యాచ్ తర్వాత 1.5M PKRను డొనేట్ చేసినట్లు తెలిపింది.

News April 14, 2025

ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో మన వాటా 3.54%

image

ప్రపంచ వ్యాప్తంగా 2022లో 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగైతే, అందులో 95 లక్షల టన్నులతో భారతదేశం 3.54 శాతం వాటా కలిగి ఉందని నేచర్ జర్నల్‌లోని ఓ కథనం తెలిపింది. 8.15 కోట్ల టన్నుల చెత్త ఉత్పన్నంతో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతూనే ఉన్నా ప్రజల్లో ఆచరణ అంతంతమాత్రంగానే ఉంటోంది.

News April 14, 2025

కాంగోలో మళ్లీ అల్లర్లు.. 50 మంది మృతి

image

ఆఫ్రికా దేశం కాంగోలోని గోమాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. దీనికి రువాండా మద్దతుతో M23 రెబల్స్ చేస్తున్న దాడులే కారణమని సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారుల చర్యల వల్ల శాంతి చర్చలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ‘గోమా’తోపాటు దేశంలో రెండో అతిపెద్ద నగరమైన బుకావు కూడా రెబల్స్ అధీనంలోనే ఉంది. మూడేళ్లుగా జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 7వేల మంది మరణించగా, 2.5M మంది వలస వెళ్లారు.