news

News August 23, 2024

రేషన్‌కార్డులు ఉన్న వారికి శుభవార్త

image

TG: రేషన్ కార్డులు ఉన్న వారికి రాయితీపై గోధుమలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం HYDలో మాత్రమే వీటిని అందిస్తుండగా, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. అటు రూ.500కు గ్యాస్ సిలిండర్ల పంపిణీపైనా ఆయన సమీక్షించారు. వినియోగదారులకు సిలిండర్ సరఫరా అయిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ చేయాలని స్పష్టం చేశారు.

News August 23, 2024

ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్

image

SC రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. జైశ్రీపాటిల్ అనే న్యాయవాది ఈ తీర్పును సమీక్షించాలని కోరారు. ‘SC, STల రిజర్వేషన్ల విషయంలో 1950 నాటి ఉత్తర్వులను సవరించే అధికారం పార్లమెంట్‌కు తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఆర్టికల్ 341, 342 ప్రకారం వర్గీకరించే అధికారం రాష్ట్రపతి, పార్లమెంట్‌కు మాత్రమే ఉంది’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

News August 23, 2024

నాడు తప్పుడు పనులు చేసి ఇప్పుడు విమర్శలా?: చంద్రబాబు

image

AP: అధికారంలో ఉండగా తప్పుడు పనులు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి చేతగానితనమని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘వైసీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు అర్థం చేసుకుంటారు. మేం అధికారంలోకి వచ్చి 60 రోజులే అయింది. గత ప్రభుత్వ అసమర్థత కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. వాళ్లలా మేం తప్పుచేయం’ అని స్పష్టం చేశారు.

News August 23, 2024

‘అచ్యుతాపురం’ ప్రమాద బాధితులకు నేడు జగన్ పరామర్శ

image

AP: అచ్యుతాపురం సెజ్‌‌లోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద బాధితుల్ని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేటి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకుంటారు.

News August 23, 2024

మన రాష్ట్రం నుంచి ఒక్కరూ కనిపించలేదా?: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చాక తెలంగాణేతరులకు పదవుల్ని ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. ‘రాజ్యసభ అభ్యర్థిగా మన రాష్ట్రం వారు ఒక్కరూ కాంగ్రెస్‌కు కనిపించలేదా? అభిషేక్ మను సింఘ్వీది ఏ రాష్ట్రం? వీహెచ్ లాంటివారికి రాజ్యసభ సీటు ఎందుకివ్వలేదు?’ అని ప్రశ్నించారు. అదానీ విషయంలో రాహుల్, రేవంత్‌కు విభేదాలున్నాయని ఆయన పేర్కొన్నారు. అదానీపై జేపీసీ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

News August 23, 2024

బంద్ విరమించిన వైద్యుల సంఘం

image

వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న బంద్‌ను విరమిస్తున్నట్లు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్(UDFA) ప్రకటించింది. ‘ఘటనపై న్యాయం చేస్తామన్న సుప్రీం కోర్టు హామీ మేరకు బంద్‌ విరమిస్తున్నాం. రోగులపై శ్రద్ధ తీసుకోవాలన్న నిబద్ధతతో, న్యాయవ్యవస్థఫై ఉన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వైద్యుల రక్షణ కోసం అత్యవసరంగా కేంద్ర రక్షణ చట్టాన్ని(CPA) తీసుకురావాలి’ అని పేర్కొంది.

News August 23, 2024

రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు ఆదేశాలు

image

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై పోరాడుతున్న మహిళా రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రతను తొలగించడంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాల్ని ఇచ్చేవరకూ భద్రతను తిరిగి కల్పించాలని తేల్చిచెప్పింది. భద్రతను ఎందుకు తొలగించారో వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. మరోవైపు.. తాము భద్రతను తొలగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతుండటం గమనార్హం.

News August 23, 2024

వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: YS జగన్

image

AP: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వక్ఫ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీల సమస్యలపై దృష్టి పెట్టాం. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశాం. వక్ఫ్ బిల్లుపై అభ్యంతరాలను పార్లమెంటులో చర్చిస్తాం. ముస్లింల అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తాం’ అని పేర్కొన్నారు.

News August 23, 2024

లౌసానే డైమండ్‌ లీగ్‌లో నీరజ్ చోప్రాకు 2వస్థానం

image

స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న లౌసానే డైమండ్‌ లీగ్‌లో భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా సత్తా చాటారు. ఈ సీజన్‌లో తన బెస్ట్ త్రో(89.49 మీటర్లు) విసిరి 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. 4వ రౌండ్‌లో 4వ స్థానంలో ఉన్న ఆయన, 5వ అటెంప్ట్‌లో 85.58 మీటర్లు, 6వ అటెంప్ట్‌లో 89.49 మీటర్లు విసరడం ద్వారా 2వ ప్లేస్‌కి ఎగబాకారు. ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన గ్రెనడా ఆటగాడు ఆండర్సన్ పీటర్స్ తొలిస్థానంలో నిలిచారు.

News August 23, 2024

ఎంపాక్స్‌లో మరో వేరియెంట్!

image

తూర్పు ఆఫ్రికా దేశం బురుండీలో ఎంపాక్స్‌లో కొత్త వేరియెంట్ వెలుగుచూసింది. తమ దేశంలో ఇప్పటి వరకు 171 కేసులు పాజిటివ్‌గా తేలాయని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. పక్క దేశమైన కాంగో నుంచి కొత్త వేరియెంట్ కేసులు వచ్చాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపాక్స్‌ వైరస్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ‘క్లాడీ 1బీ’ అనే కొత్త స్ట్రెయిన్ కారణంగానే ప్రస్తుతం బాగా విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.