news

News February 20, 2025

కృష్ణా జలాల పంపిణీలో ఏమార్పూ ఉండదు: KRMB

image

తెలుగు రాష్ట్రాలకు కృ‌ష్ణాజలాల పంపిణీలో ఈ సీజన్‌కు ఎటువంటి మార్పూ లేదని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(KRMB) తేల్చిచెప్పింది. ఈ నెల 21న నిర్వహించిన సమావేశం తాలూకు వివరాల్ని ఇరు రాష్ట్రాలకు పంపించింది. జలాల్ని 66:34 రేషియోలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు పంచనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్-జులై వరకు ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీ జలాలు మిగిలి ఉన్నట్లు పేర్కొంది.

News February 20, 2025

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సాయం

image

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయాన్ని విడుదల చేసింది. ఏపీకి రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లను ఇచ్చింది. మొత్తంగా ఐదు రాష్ట్రాలకు నిధుల్ని విడుదల చేసింది. వాటిలో త్రిపుర(రూ.288.93 కోట్లు), ఒడిశా(రూ.255.24 కోట్లు), నాగాలాండ్(రూ.170.99 కోట్లు) ఉన్నాయి. ఈ సాయంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు.

News February 20, 2025

మళ్లీ భూ సర్వే?

image

TG: భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు భూముల సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. భూ వాస్తవ విస్తీర్ణానికి, ధరణిలో పెరిగిన విస్తీర్ణానికి మధ్య గందరగోళం పోవాలంటే సర్వే ఒక్కటే మార్గమని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 150 మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున పైలట్ సర్వే నిర్వహించే అవకాశం ఉంది.

News February 20, 2025

గర్భాలు నిలబడటం లేదు!

image

వెనకటి తరాల వారు పదిమంది పిల్లల్ని కనేవారు. కానీ నేడు గర్భం దాల్చడమే గగనమవుతోంది. మరికొంతమందిలో గర్భాన్ని నిలబెట్టుకోవడం సమస్య అవుతోంది. రెండు మెట్లెక్కితే చాలు గర్భస్రావం అయిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారిన జీవనశైలి, స్త్రీపురుషులిద్దరిలోనూ తగినంత దృఢత్వం లేకపోవడం, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు.

News February 20, 2025

నేడే టీమ్ ఇండియా తొలి సమరం

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నేడు తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌పై ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపులో ఉన్న భారత్‌కు బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టం కాకపోవచ్చు. విరాట్, రోహిత్ ఫామ్‌లో ఉన్నారు. అయితే బుమ్రా లేని బౌలింగ్ దళం ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. అటువైపున్నది బంగ్లాయే అయినా తక్కువ అంచనా వేయొద్దని, నిర్దయగా ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలుకానుంది.

News February 20, 2025

‘శంభాజీ’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

image

‘ఛావా’లో శంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టిన సన్నివేశం చరిత్రలో జరగలేదంటూ నటి స్వరభాస్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదువుకున్నాను. సినిమాలో చూపించిన హింసలో ఏమాత్రం కల్పితం లేదు’ అని ఒకరు పేర్కొనగా.. ‘శంభాజీ త్యాగాన్ని చులకన చేయడానికి నీకెంత ధైర్యం’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.

News February 20, 2025

మహా కుంభమేళాను వాడుతున్న సినీ మేకర్స్

image

మహా కుంభమేళా సినీజనానికి మంచి అవకాశంగా మారింది. ఇప్పటికే బాలయ్య ‘అఖండ-2’కి కొంత షూటింగ్‌ను కుంభమేళాలో తీసినట్లు సమాచారం. తాజాగా తమన్నా నాగ సాధువుగా నటిస్తున్న ‘ఓదెల-2’ ప్రమోషన్లకి కూడా కుంభమేళా వేదికగా మారింది. మూవీ టీజర్‌ను ఈ నెల 22న అక్కడే లాంఛ్ చేయనున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అటు భక్తితో పాటు ఇటు సినిమా పనిని కూడా మూవీ టీమ్స్ చక్కదిద్దుకుంటున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

News February 20, 2025

భారత్‌లోకి ఐఫోన్ 16ఈ.. ధర ఎంతంటే..

image

భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించడంపై యాపిల్ కన్నేసింది. రూ.59వేలకే ఐఫోన్ 16ఈని తీసుకొస్తోంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ జీబీతో రానుంది. రేపటి నుంచే అడ్వాన్స్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి పూర్తి స్థాయి అమ్మకాలు మొదలవుతాయని యాపిల్ తెలిపింది. ఈ ఫోన్‌లో సింగిల్ కెమెరా మాత్రమే ఉండటం గమనార్హం. ఇక ఐఫోన్ SE అమ్మకాల్ని యాపిల్ భారత్‌లో ఆపేయనున్నట్లు సమాచారం.

News February 20, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయినా రోహితే కెప్టెన్: కైఫ్

image

‘ఛాంపియన్స్ ట్రోఫీ’ని భారత్ గెలుచుకోలేకపోయినా సరే 2027 వరల్డ్ కప్ వరకూ రోహిత్ శర్మనే భారత కెప్టెన్‌గా కొనసాగించాలని మాజీ క్రికెటర్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సాధించిన ఘనతలు అందరూ సాధించలేరు. టీమ్ ఇండియాను 2023 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చారు. వన్డే ఫార్మాట్లో ఆయన ఆటను, కెప్టెన్సీని ఎవరూ ప్రశ్నించలేరు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్ గెలుపు శాతం అద్భుతం’ అని గుర్తుచేశారు.

News February 20, 2025

జెలెన్‌స్కీ ఓ నియంత: ట్రంప్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఉక్రెయిన్‌లో ఎన్నికల్ని నిర్వహించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు. స్వదేశంలో ఆయనకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఎన్నికల్ని కూడా జరగనివ్వడం లేదు’ అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన జెలెన్‌స్కీ పదవీకాలం ముగిసిపోయినా యుద్ధం పేరు చెప్పి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.