news

News July 13, 2024

‘మహిళలకు ఉచిత బస్సు’ ఏది?: షర్మిల

image

AP: మహిళలకు ఉచిత బస్సు అన్న హామీ అమలు ఏమైందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెలరోజులు గడిచినా వాగ్దానం నిలబెట్టుకోలేదంటూ ప్రెస్‌మీట్‌లో విమర్శించారు. ‘తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన రెండోరోజు, కర్ణాటకలో 3 వారాలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఏపీలో చంద్రబాబుకు ఎంత సమయం పడుతుంది? ఆయన సమాధానం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News July 13, 2024

ఎన్డీయే సర్కారు మనుగడ కష్టమే: మమతా బెనర్జీ

image

మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మనుగడ కష్టమేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అస్థిరంగా కనిపిస్తోందని, పూర్తి కాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తాజాగా ముంబైకి చేరుకున్న ఆమె, ఇండియా కూటమి నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ubt) తరఫున ప్రచారం చేయనున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

News July 13, 2024

అవే తప్పులు చేస్తే మనకీ వారికి తేడా ఏంటి?: గడ్కరీ

image

కాంగ్రెస్ చేసిన తప్పుల్నే చేస్తే బీజేపీకి, ఆ పార్టీకి తేడా ఏంటంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. గోవాలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీజేపీ మిగతావాటికంటే భిన్నమైన పార్టీ. అదే మన ప్రత్యేకత అని అద్వానీ చెప్పేవారు. అధికారంలో ఉండగా చేసిన తప్పుల వల్లే కాంగ్రెస్ ఓడింది. మనం ఆ తప్పులకు దూరంగా ఉండాలి’ అని సూచించారు. అవినీతిరహిత దేశం కోసం పాటుపడాలని కోరారు.

News July 13, 2024

ఫ్యాన్స్ బాధపడొద్దు.. వాళ్లు ఇంకా ఆడతారు: వీవీఎస్ లక్ష్మణ్

image

టీ20ఐలకు రోహిత్, విరాట్, జడేజా వీడ్కోలు పలకడంపై భారత జట్టు అభిమానులు చాలామంది బాధపడ్డారు. వారికి టీమ్ ఇండియా తాత్కాలిక కోచ్ VVS లక్ష్మణ్ ఉపశమనం కలిగించే మాటలు చెప్పారు. ఆ ముగ్గురూ భారత్‌కు ఇంకా చాలా రోజులు ఆడతారని ఆయన అన్నారు. ‘వన్డే, టెస్టు ఫార్మాట్లలో వారి సేవలు అమూల్యమైనవి. ఆ ఫార్మాట్లలో వాళ్లు కచ్చితంగా దేశానికి మరిన్ని ట్రోఫీలు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News July 13, 2024

నా సినిమా ఫ్లాపయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు: అక్షయ్

image

తన సినిమాలు ఫ్లాపయితే కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాజాగా వాపోయారు. ఆయన గత సినిమాలు బడే మియాన్ చోటే మియాన్, రామ్ సేతు, రక్షాబంధన్, బచ్చన్ పాండే, సెల్ఫీ బాక్సాఫీస్ వద్ద వరసగా విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వైఫల్యాల్ని ఎదుర్కోవడాన్ని అమితాబ్ బచ్చన్‌ నుంచి తాను నేర్చుకున్నానని, శ్రమనే నమ్ముకుంటానని తెలిపారు.

News July 13, 2024

ఆ వర్సిటీలో 94 ఏళ్లలో తొలిసారిగా మాంసాహారం

image

కేరళలోని కళామండలం యూనివర్సిటీలో 94 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్యాంటీన్‌లో మాంసాహారాన్ని యాజమాన్యం ఏర్పాటు చేసింది. సంస్థ మొదలైనప్పటి నుంచి శాకాహారమే ఇక్కడ అందుబాటులో ఉండేది. నాన్ వెజ్ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తుండటంతో తాజాగా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసింది. దాన్ని త్రిస్సూర్‌లోని వియ్యూర్ జైలు ఖైదీలు తయారుచేయడం విశేషం. 1930లో ప్రారంభమైన కళామండలం గురుకుల వ్యవస్థలో నడుస్తోంది.

News July 13, 2024

వింబుల్డన్ ఫైనల్స్‌కు చేరుకున్న జకోవిచ్

image

సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల వింబుల్డన్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టిని ఆయన 3 వరస సెట్లలో ఓడించారు. రేపు జరిగే ఫైనల్‌లో ఆయన కార్లోస్ ఆల్కరాజ్‌తో తలపడతారు. అటు కార్లోస్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

News July 13, 2024

15 నుంచి సర్దార్-2 షూటింగ్ షురూ

image

పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో కార్తీ హీరోగా సర్దార్-2 షూటింగ్ ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇవాళ చెన్నైలో పూజా కార్యక్రమాలు జరిగాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సర్దార్ సినిమా 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ‘కాంబోడియా స్పై మిషన్’లో హీరో ఏం చేశాడనే కథాంశంతో సీక్వెల్ రూపొందనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.

News July 13, 2024

గంభీర్ 100శాతం ప్రదర్శనను ఆశిస్తారు: ఆవేశ్

image

భారత హెడ్ కోచ్ గంభీర్ జట్టు ఆటగాళ్ల నుంచి వందశాతం ప్రదర్శనను, అంకితభావాన్ని ఆశిస్తారని బౌలర్ ఆవేశ్ ఖాన్ అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారని కొనియాడారు. ‘ఆయన ఎక్కువ మాట్లాడరు. కానీ ఆటగాళ్లకు వారి వారి బాధ్యతల్ని సక్రమంగా కేటాయిస్తారు. ఏం చేయాలన్న పాయింట్‌ను సూటిగా అర్థమయ్యేలా చెబుతారు’ అని పేర్కొన్నారు. గంభీర్, ఆవేశ్ ఇద్దరూ లక్నో జట్టులో కలిసి పనిచేశారు.

News July 13, 2024

160 ఏళ్ల నాటి చీర ధరించిన అలియా!

image

అనంత్ అంబానీ వివాహానికి నటి అలియా భట్ అత్యంత స్వచ్ఛమైన పట్టుతో నేసిన చీరను ధరించారు. డిజైనర్ మనీశ్ మల్హోత్రా కలెక్షన్‌కు చెందిన ఆ చీర ప్రత్యేకత దాని వయసే. 160 ఏళ్ల క్రితం గుజరాత్‌లో నేసిన ఆశావలి చీర అది. 99శాతం స్వచ్ఛమైన వెండి, 6 గ్రాముల బంగారంతో కలగలిపి నేసిన నిజమైన జరీ అంచుతో ఉంటుంది. అలియా ఒంటిపై ధగధగలాడిపోయిన ఆ చీర గురించే ప్రస్తుతం మగువల మధ్య చర్చ నడుస్తోంది.