news

News July 2, 2024

రామ్‌లల్లా పూజారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్!

image

అయోధ్య రామాలయంలోని పూజారుల డ్రెస్ కోడ్‌లో తీర్థ క్షేత్ర ట్రస్ట్ మార్పులు తీసుకొచ్చింది. ఇకపై పూజారులు తప్పనిసరిగా పసుపు రంగు తలపాగా, కుర్తా, ధోతీలను ధరించాలని తెలిపింది. గతంలో కొందరు కాషాయ రంగు, పసుపు రంగు దుస్తులు ధరించేవారు. వారిలో సారూప్యం తీసుకొచ్చేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, గర్భాలయం లోపలికి పూజారులు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకెళ్లడాన్ని నిషేధించింది.

News July 2, 2024

7 నెలల పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామాలకు రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ భవన్‌లో మీడియాకు తెలిపారు. స్థానిక సంస్థల పాలకవర్గాలకు కాలం చెల్లినా ప్రభుత్వం ఎన్నికల ఆలోచన చేయట్లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలన్నారు.

News July 2, 2024

రికవరీ చట్టంతో వైసీపీ నేతల అక్రమార్జనను రాబట్టాలి: యనమల

image

AP: గత ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆ నష్టాన్ని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. వైసీపీ నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రాబట్టాలని కోరారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను సూచించారు.

News July 2, 2024

వెంకటేశ్- అనిల్ కాంబోలో మూడో సినిమా!

image

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వగా ముచ్చటగా మూడోసారి జతకట్టనున్నారు. ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమంతో రేపు ఉదయం 11.16 గంటలకు లాంఛనంగా ప్రారంభంకానుంది. SVC బ్యానర్‌లో రాబోతున్న 58వ సినిమాను శిరీశ్ నిర్మించనున్నారు.

News July 2, 2024

వైసీపీ హయాంలో టీచర్ల బదిలీల్లో భారీ అవినీతి: లోకేశ్

image

AP: వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని, ఈ బదిలీల అంశంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదల్చుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌ను ఉపాధ్యాయ సంఘాలు కలిశాయి. ఎన్నికల కోడ్‌తో నిలిచిన బదిలీ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయనను కోరాయి.

News July 2, 2024

ప్రభుత్వం ఘోరం.. ప్రైవే‘టూ భారం’..

image

జూన్‌లో బడి గంట మోగితే పేరెంట్స్ గుండె చప్పుడు మే నుంచే ఎక్కువ మోగుతుంది. డొనేషన్, అడ్మిషన్, ట్యూషన్ పేర్లతో పిండే ఫీజులకు యునిఫాం, స్టేషనరీ, ట్రాన్స్‌పోర్టు పోటులు అదనం. వీటి నుంచి కోలుకునేలోపు టర్మ్, యాక్టివిటీ, ఎగ్జామ్స్ ఫీజు రిమైండర్లు మైండ్‌ను వదలవు. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకమే ఉంటే ఇలా జరగదు కదా. ఆ టీచర్లే వారి పిల్లల్ని బయట చదివిస్తే భరోసా వచ్చేదెలా? ఈ భారాలు తగ్గేదెలా?

News July 2, 2024

కాకినాడ కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం రివ్యూ

image

AP: కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ నిర్వహిస్తున్నారు. తొలుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు కార్యకలాపాలపై సమీక్షిస్తున్నారు. అనంతరం శాఖల వారీగా జిల్లాలో స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం నానాజీ, చినరాజప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News July 2, 2024

విరాట్ కోహ్లీకి టార్గెట్ పెట్టిన రాహుల్ ద్రవిడ్

image

టీమ్ ఇండియా కోచ్‌గా రిటైరైన రాహుల్ ద్రవిడ్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించారు. టెస్టుల్లోనూ భారత్‌ను ఛాంపియన్‌గా నిలపాలని సూచించారు. ‘తెల్ల బంతితో ఆ మూడూ సాధించాం. ఇక ఎరుపే ఉంది. అది కూడా సాధించండి’ అని కోహ్లీకి చెప్పారు. కాగా T20WC, వన్డే WC, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్‌కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలవాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. 2021, 2023 WTC ఫైనల్స్‌లో ఓడింది.

News July 2, 2024

ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది: అఖిలేశ్ యాదవ్

image

ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదే. మతతత్వ రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయాయి. బీజేపీ 400 సీట్ల అజెండా ఫెయిలైంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈవీఎంల మీద మాకు ఇప్పటికీ నమ్మకం లేదు. వాటిని తొలగించే దాకా మా పోరాటం ఆగదు’ అని లోక్‌సభలో వ్యాఖ్యానించారు.

News July 2, 2024

రూ.249కి BSNL అదిరిపోయే ప్లాన్!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించేలా రూ.249 ప్లాన్‌ను పరిచయం చేస్తోంది. 45 రోజుల కాలవ్యవధితో అన్‌లిమిలిటెడ్ కాల్స్, రోజుకి 2GB డేటా, 100 ఫ్రీ SMSలు ఈ ప్యాక్‌లో అందిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలు ఇదే ధరకు 1GB డేటానే ఇస్తుండగా వ్యాలిడిటీ 28 రోజులే ఉంటుండటం గమనార్హం. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ తమ టారిఫ్‌లను భారీగా పెంచిన వేళ వినియోగదారులకు ఇది పెద్ద ఊరటనే చెప్పొచ్చు.