news

News September 4, 2024

మళ్లీ సున్నా నుంచి జీవితం..

image

AP: విజయవాడ వరదల్లో నష్టపోయిన బాధితులు తమకు ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, గ్రైండర్లు.. ఇలా అన్ని వస్తువులు పాడైపోయాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. చాలా వరకు EMIలోనే కొన్నామని, రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. మళ్లీ సున్నా నుంచి జీవితం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

News September 4, 2024

కృష్ణా కంటే బుడమేరే ప్రమాదం!

image

విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువగా బుడమేరు కట్ట లోపల నిర్మించినవే ఉన్నాయి. గత 2 దశాబ్దాల్లో వాగు ప్రవాహ మార్గం కబ్జాలకు గురైందనే ఆరోపణలున్నాయి. ఈ ఆక్రమణలతో వాగు ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డట్లయిందని, కృష్ణా నది కంటే బుడమేరు వరదలే బెజవాడకు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణలు తొలగించి, వాగు మలుపులు సరి చేయాలని, నీరు వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

News September 4, 2024

విజయవాడ మునగడానికి కారణం ఇదే..

image

బుడమేరు వాగుకు 2005లో 70వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో విజయవాడ మునిగింది. దీంతో దాన్ని పోలవరం కుడికాలువకు లింక్ చేసి, రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. తద్వారా <<14015211>>బుడమేరుకు<<>> ప్రవాహం తగ్గడంతో ఆక్రమణదారులు గద్దల్లా వాలారు. ఆ వాగు కనిపించకుండా కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు. తాజాగా ప్రకాశం బ్యారేజీలో భారీ ప్రవాహం ఉండటంతో కుడికాలువ నీటిని పైకి ఎగదోసింది. దీంతో బుడమేరుకు నీటిని వదలడంతో బెజవాడ ‘జలవాడ’ అయింది.

News September 4, 2024

ఓవైపు దోపిడీ.. మరోవైపు మానవత్వం

image

AP: విజయవాడలోని పరిస్థితులు కొందరిలోని డబ్బు ఆశను, మరికొందరిలోని మానవత్వాన్ని బయటపెడుతున్నాయి. శివారు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కొందరు ప్రైవేటు బోట్ల ఓనర్లు ₹10,000-₹20,000 వరకు వసూలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు సత్యనారాయణపురం నుంచి రైల్వే స్టేషన్‌కు రూ.30కి బదులు ₹.200 తీసుకుంటున్నారు. మరోవైపు కొందరు వాహనదారులు మాత్రం బాధితుల్ని ఫ్రీగా తరలిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.

News September 4, 2024

బుడమేరుకు గండి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన

image

AP: విజయవాడలోని బుడమేరు వాగుకు గండి పడింది. దేవీనగర్ వద్ద గండి పడటంతో నీరు గట్టుపై ఉన్న ఇళ్లల్లోకి చేరే అవకాశం ఉంది. రామవరపాడు, ప్రసాదంపాడు, ఏనికేపాడు, నిడమానూరు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

News September 4, 2024

ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?

image

ఇవాళ NTR జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని స్కూళ్లకు హాలిడే ఇచ్చారు. తెలంగాణలో ఏ జిల్లాలోనూ సెలవు ఇవ్వలేదు. అయితే ఇవాళ విజయవాడ, ప.గో. తదితర ప్రాంతాలతో పాటు తూర్పు, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశముందని అంచనా. దీంతో స్కూళ్లకు సెలవుపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

News September 4, 2024

రికార్డు.. దీప్తికి బ్రాంజ్

image

పారిస్ పారాలింపిక్స్: తెలుగు అథ్లెట్ దీప్తి జీవాంజి చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్ హిస్టరీలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా రికార్డులకెక్కారు. నిన్న రాత్రి జరిగిన 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచారు. దీంతో ఆమెకు కాంస్య పతకం వచ్చింది. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా పర్వతగిరి మం. కల్లెడ.

News September 4, 2024

నేడు డీఎస్సీ ఫైనల్ కీ విడుదల?

image

TG: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేసే ఛాన్సుంది. దీని ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను ఎవరికివారు తెలుసుకోవచ్చు. తుది కీ విడుదలైన తర్వాత 2, 3 రోజుల్లో డీఎస్సీ మార్కులకు (80%), టెట్ మార్కులు (20%) కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టును అధికారులు విడుదల చేస్తారు.

News September 4, 2024

రూ.5 లక్షలు విరాళమిచ్చిన అనన్య నాగళ్ల

image

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం యువ నటి అనన్య నాగళ్ల రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో రూ.2.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళాన్ని అందజేశారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, బాలకృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్సేన్, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ విరాళాలు ఇచ్చారు.

News September 4, 2024

1,53,278 ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల

image

TG: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 1,53,278 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయని, పంట నష్టం 4 లక్షల ఎకరాలకు పెరగొచ్చని అన్నారు. అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు కొత్త పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు.