news

News June 8, 2024

రామోజీరావుకు తీవ్ర అస్వస్థత

image

ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గుండె సంబంధిత సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం రామోజీరావు ఐసీయూలో కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

News June 8, 2024

‘గ్రూప్-1 వాయిదా కష్టం’.. సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు

image

TG: గ్రూప్-1 వాయిదాకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ దశలో నిర్ణయం తీసుకోలేమన్న సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ఇప్పుడు వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బందులకు గురవుతారనే వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకూ జూన్ 9నే పరీక్ష ఉండటంతో పలువురు కోర్టును ఆశ్రయించారు.

News June 8, 2024

రెవెన్యూ చట్టంలో మార్పులు?

image

TG: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ చట్టాల్లో మార్పులు చేయాలని ధరణి కమిటీ భావిస్తోంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ యాక్ట్, 2020లో పలు లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఇందుకు సంబంధించి కమిటీ ఓ నివేదికను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగా చట్టంలో మార్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

News June 8, 2024

స్టాక్ మార్కెట్ క్రాష్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్

image

ఎన్నికల ఫలితాల సందర్భంగా జూన్ 4న స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అదానీ హిండెన్‌బర్గ్ కేసు రిట్ పిటిషన్‌కు అనుబంధంగా ఈ పిటిషన్‌ ఫైల్ అయింది. మార్కెట్లు ఆ స్థాయిలో క్రాష్ కావడంపై విచారణ జరిపి సెబీ, కేంద్రం నివేదికలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపైన కూడా సెబీ తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సమర్పించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.

News June 8, 2024

T20WC: నేడు నాలుగు మ్యాచ్‌లు

image

టీ20 ప్రపంచకప్‌లో నేడు నాలుగు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ (గ్రూప్ సీ) మధ్య ఉదయం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మరోవైపు శ్రీలంక-బంగ్లాదేశ్ (గ్రూప్ డీ) మ్యాచ్ ఉదయం 6 గంటలకు, నెదర్లాండ్స్-సౌతాఫ్రికా (గ్రూప్ డీ) మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీ జట్లు అయిన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ కూడా రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.

News June 8, 2024

జగన్ ప్రభుత్వం నా ఫోన్లను ట్యాప్ చేసింది: లోకేశ్

image

AP: YCP ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేసి, ఆపై ఆధారాలను ధ్వంసం చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ‘దీనిపై నాకు స్పష్టమైన సమాచారం అందింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయం మాకందరికీ తెలుసు. నా ఫోన్‌పై పెగాసస్ దాడి జరిగిందని గతంలో చెప్పాను. నా ఫోన్‌పై రెండుసార్లు పెగాసస్ అటాక్ జరిగిందనటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చివరగా ఏప్రిల్‌లో అటాక్ అయింది’ అని ANI ఇంటర్వ్యూలో తెలిపారు.

News June 8, 2024

‘మోదీ స్టాక్స్’ ఇంకా కోలుకోలేదు!

image

ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి స్టాక్ మార్కెట్ కోలుకుంటున్నా ‘మోదీ స్టాక్స్’ ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఫైనాన్స్ సంస్థ CLSA పేర్కొన్న ఈ 54 స్టాక్స్‌లో 8 మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌కు ముందున్న (జూన్ 1కు ముందు) స్థాయికి చేరుకున్నాయి. వీటిలో కొన్ని మే 31తో పోలిస్తే ఇంకా 10శాతానికిపైగా నష్టాల్లో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా మోదీ స్టాక్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, HAL, SBI తదితర సంస్థలు ఉన్నాయి.

News June 8, 2024

ప్రధాని మోదీకి మస్క్ అభినందనలు

image

ఎన్నికల్లో విజయంపై ప్రధాని మోదీకి టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ Xలో అభినందనలు తెలియజేశారు. భారత్‌లో తన సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో టెస్లా ప్లాంట్ సహా పలు వ్యాపారాలపై ప్రధాని మోదీని ఏప్రిల్‌లోనే కలవాల్సి ఉన్నా ఆఖరి నిమిషంలో మస్క్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే దీనిపై అప్పట్లో స్పందించిన మస్క్, ఈ ఏడాదిలో తప్పకుండా భారత్ వస్తానన్నారు.

News June 8, 2024

నాకు ఇవే ఆఖరి ఎన్నికలు కావొచ్చు: థరూర్

image

తాను 2029 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. ఎంపీగా తనవంతు కృషి చేశానని, ఇక యువతకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాని పేర్కొన్నారు. ‘భవిష్యత్తులో ప్రజాసేవను కొనసాగిస్తాను. అందుకు ఎంపీగానే ఉండక్కర్లేదు. ఎప్పుడు తప్పుకోవాలి అనే విషయంపైన నేతలకు అవగాహన ఉండాలి’ అని తెలిపారు. కాగా 2009 నుంచి ఇప్పటివరకు తిరువనంతపురం ఎంపీగా థరూర్ నాలుగుసార్లు గెలుపొందారు.

News June 8, 2024

ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌లోకి దూసుకెళ్లిన అల్కరాజ్

image

ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ కేటగిరి సెమీస్‌లో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) గెలుపొందారు. జానిక్ సిన్నర్‌ (ఇటలీ)పై 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. మూడు రకాల మైదానాల్లో (గ్రాస్, క్లే, హార్డ్) గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరిన పిన్నవయస్కుడిగా (21) అల్కరాజ్ నిలిచారు. ఇప్పటికే వింబుల్డన్, US ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న అల్కరాజ్‌కు ఇది తొలి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్.