Adilabad

News March 28, 2024

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఉపాధ్యాయులే

image

అదిలాబాద్ ఎంపీకి జరుగుతున్న పోటీల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు గతంలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గతంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. BRS అభ్యర్థి ఆత్రం సక్కు సైతం గతంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఇటీవల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలిచారు.

News March 28, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్‌లో త్రిముఖ పోటీ

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలోనే తమ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించడంలో ఉత్కంఠ జరుగగా తాజాగా తమ అభ్యర్థి పేరు ప్రకటించేశారు. BJP నుండి గోడం నగేష్, CONG నుంచి సుగుణక్క, BRS నుండి ఆత్రం సక్కు ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఇక ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మూడు పార్టీల నుండి ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

News March 28, 2024

ఆదిలాబాద్: ప్రజలను హడలెత్తిస్తున్న సూర్యుడి భగభగలు

image

వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాల్లో ఆరు ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలంలో 42.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా సత్నాలలో 42.3, చాప్రాలలో 42.1, ఆసిఫాబాద్లో 42.0 , అర్లి(టి)లో 42.0, దస్తురాబాద్ మండలంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 28, 2024

నిర్మల్: మద్యం మత్తులో ఆత్మహత్య

image

మద్యం మత్తులో నీటి ట్యాంకులో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బైంసా మండలంలో చోటుచేసుకుంది. టాక్లీ గ్రామానికి చెందిన తలుపుల రాజు(32)అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇదే విషయమై తరుచూ భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతుండడంతో రాజు భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మద్యం మత్తులో గ్రామంలోని వాటర్ ట్యాంకులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భైంసా రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

News March 28, 2024

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ 

image

ఆదిలాబాద్ పార్లమెంట్ (కాంగ్రెస్ పార్టీ) ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే బొజ్జుకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

News March 28, 2024

నిర్మల్ : సీఎంఆర్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్

image

ప్రభుత్వం సూచించిన గడువులోగా (సీఎంఆర్) కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రైస్‌మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సీఎంఆర్ లక్ష్యాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాల పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ 2023-24 సంవత్సరం లక్ష్యాలను గడువులోగా వెంటనే పూర్తి పూర్తిచేయాలని తెలిపారు

News March 27, 2024

భైంసా: ఎలక్షన్ వేళ డేగ కన్ను

image

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. లోక్‌సభ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తే గుర్తించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రత్యేకబృందానికి కేటాయించిన వాహనానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. ఈ బృందం రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అభ్యర్థుల ర్యాలీలు జరిగే చోటుకు వెళితే చాలు అవన్నీ కెమెరాలో రికార్డయి అధికారులకు సమాచారం పోతుంది.

News March 27, 2024

నేషనల్ సైక్లింగ్ పోటీలకు ఆదిలాబాద్ బిడ్డ ఎంపిక

image

నేరడిగొండ మండలం మర్లపల్లికి చెందిన జాదవ్ కిరణ్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల రామాయంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అండర్-18 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు. ఈనెల 28 నుంచి 31 వరకు హరియాణాలో నిర్వహించే జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

News March 27, 2024

నిర్మల్: అతిగా మద్యం తాగి పర్మిట్ రూంలోనే మృతి

image

అతిగా మద్యం తాగిన వ్యక్తి వైన్స్ పర్మిట్ రూంలోనే మృతి చెందిన ఘటన లోకేశ్వరంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలు.. లోకేశ్వరానికి చెందిన ప్రశాంత్ కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రశాంత్.. సాయంత్రం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న వైన్స్ పర్మిట్ రూంలో అతిగా మద్యం తాగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News March 27, 2024

జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఆదిలాబాద్ యువకుడు

image

నేరడిగొండ మండలం మర్లపల్లికి చెందిన జాదవ్ కిరణ్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల రామాయంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అండర్ 18 విభాగంలో చక్కని ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు హరియాణాలోని పంచకులలో నిర్వహించే జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్
పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు.