Adilabad

News April 11, 2024

ADB: యువకుల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో యువకులు కొందరు డబ్బుల లావాదేవీల విషయమై గురువారం ఘర్షణ పడ్డారు. అనంతరం కోలిపుర కాలనీకి చెందిన ముజాహిద్, షాహిద్‌లపై కత్తులతో దాడిచేశారు. గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న DSP ఎల్.జీవన్ రెడ్డి, సీఐ సత్యనారాయణ అశోక్ రిమ్స్‌కు వెళ్లి వివరాలు సేకరించారు.

News April 11, 2024

జన్నారం: కడుపునొప్పి భరించలేక మహిళా ఉద్యోగి మృతి

image

కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి మహిళా మృతిచెందిన ఘటన జన్నారం మండలం మురిమడుగులో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల వివరాలిలా.. గద్దల నవ్య (28 ) ఉట్నూర్ RDO కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బుధవారం నొప్పి తీవ్రమవ్వడంతో బాధ భరించలేక పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందింది.

News April 11, 2024

బెల్లంపల్లి: గంజాయి సేవిస్తూ గొడవలు.. విద్యార్థులపై ఫిర్యాదు

image

బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే కొంతమంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ గొడవలు చేస్తున్నారని ఇందిరమ్మ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డికి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. గంజాయి సేవిస్తూ పెద్దగా అరుస్తూ, వెకిలి చేష్టలు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం ప్రిన్సిపల్‌కు చూపించారు.

News April 11, 2024

మంచిర్యాల: భారీగా పెరిగిన ధరలు

image

ఉమ్మడి ADB జిల్లాలో కోడి మాంసం ధర కొండెక్కింది. వారం క్రితం కిలో రూ. 200 ఉండగా అమాంతం రూ.300 చేరుకోవటంతో మాంసాహారుల నోరు చప్పబడింది. ఉమ్మడి జిల్లాలో నిత్యం 65 టన్నుల వరకు కోడి మాంసం విక్రయాలు జరుగుతాయి. ఆదివారం 100 టన్నుల వరకు విక్రయాలు జరుగుతాయి. వేసవి తాపం ప్రారంభం..కూరగాయలతో పాటు మాంసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 10 రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో వేడి ఉష్ణోగ్రతకు కోళ్లు మృత్యువాతపడుతున్నాయి.

News April 11, 2024

ADB: ఒకేసారి 2 సీట్లు సాధించిన విహాన్

image

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయ దంపతులు రాథోడ్ కృష్ణారావు శోభారాణి కుమారుడు విహాన్ ఒకే సారి రెండు సీట్లు సాధించాడు. ఇటీవల దేశ వ్యాప్తంగా నిర్వహించిన నవోదయ విద్యాలయ, సైనిక్ స్కూలులో 241మార్కులతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవ పాఠశాలలో సీటు దక్కించుకున్నాడు. దీంతో బుధవారం ప్రధానోపాధ్యాయుడు రాజ్‌కుమార్, కార్తీక్ ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

News April 11, 2024

ADB: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

ఈనెల 11న రంజాన్ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమాసమైన రంజాన్ నెలరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాను ప్రార్థించి ఆధ్యాత్మిక జీవనం కొనసాగించారన్నారు. జిల్లాలోని ముస్లిం సోదరులు, సోదరీమణులు అనందోత్సవాలతో, భక్తిశ్రద్ధలతో పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఆ అల్లా దీవెనలు ఎప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు.

News April 10, 2024

తాండూరు: మద్యానికి బానిసైన భర్త.. భార్య ఆత్మహత్య

image

తాండూరు మండలం మాదారం గ్రామానికి చెందిన గుమాస భారతి (30) హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారతికి లక్ష్మణ్ తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని చికెన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మణ్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతున్నారు. ఇదే విషయమై భార్యల మధ్య గొడవ జరిగింది. భారతి ఆవేశంతో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

News April 10, 2024

తానూర్‌లో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

image

తానూర్ మండల కేంద్రానికి చెందిన అవదూత్వార్ లచ్చిరాం(59) చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. ఎస్‌ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చిరాం గత కొన్ని రోజులుగా బోదకాలు వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో పాటు తన కాలికి సర్జరీ అయ్యింది. దీంతో ఆ నొప్పులు భరించలేక బుధవారం వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య గంగాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 10, 2024

ASF: 108లో ప్రసవం

image

108లో అంబులెన్స్‌లో ఓ గర్భిణీ ప్రసూతి అయిన ఘటన సిర్పూర్ (U) మండలంలో జరిగింది. 108 EMT ఆత్రం రామేశ్వరి, పైలెట్ దయాకర్ తెలిపిన వివరాలు.. మత్తురతాండకు చెందిన జ్యోతికి పురుటి నొప్పులు రావడంతో కుటంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ రామేశ్వరి సహాయంతో జ్యోతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలింతను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని EMT తెలిపారు.

News April 10, 2024

ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన రైల్వే కానిస్టేబుల్

image

బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన వాసీమ కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు మైక్రో స్టేషన్ క్వారీకి వెళ్లింది‌. ఆమె భర్త షబ్బీర్ విషయం తెలుసుకుని జీఆర్పీ కానిస్టేబుల్ ఎండీ రషీద్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ ఘటనాస్థలికి చేరుకుని కాపాడాడు. ముగ్గురి ప్రాణాలను
కాపాడిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.