Adilabad

News May 22, 2024

ADB: ధరణి, ప్రజావాణి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

image

ధరణి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వారంలోగా పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ధరణి, ప్రజావాణి దరఖాస్తులను వారంలోగా పరిశీలించి పరిష్కరించాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

News May 22, 2024

ADB: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ తీవ్రత తగ్గడంలేదు. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కొండాపూర్(మంచిర్యాల) 43.4, ఆసిఫాబాద్ 43.2,  చాప్రాల(ఆదిలాబాద్) 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News May 22, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో ఏడుగురిపై ACB కేసులు

image

ASF జిల్లాకు చెందిన ఏడుగురిపై ACB కేసులు నమోదు చేసింది. జిల్లాలో ఫోర్ వే విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి అందించే పరిహారం చెల్లింపుల్లో రూ.కోట్లల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు RDO దత్తు, డిప్యూటీ తహశీల్దార్ నాగోరావు, మండల సర్వేయర్ భరత్‌, స్తిరాస్థి వ్యాపారస్తులైన శంభుదాస్, లక్ష్మీనారాయణ గౌడ్, తిరుపతితో పాటు పరిహారం పొంది తారాబాయిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 22, 2024

మంచిర్యాల: రవీంద్రభారతిలో 20 కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజం

image

20 కోట్ల ఏళ్ల నాటి అరుదైన వృక్ష శిలాజాన్ని రవీంద్రభారతిలో పొందుపరిచారు. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీన్ని కనుగొన్నారు. జురాసిక్, క్రిటిసియస్ కాలానికి చెందిన ఈ శిలాజం నాటి జీవ పరిణామ క్రమంలోని అనేక అంశాలకు సాక్ష్యాలుగా నిలుస్తుందని తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి ఇరువైపులా ఈ శిలాజాలను ఏర్పాటు చేశారు.

News May 21, 2024

నిర్మల్: ‘ఇక TSకు బదులుగా TG వాడండి’

image

TS స్థానంలో TGగా మార్చాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టీజీతో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని సూచించారు.

News May 21, 2024

ఎన్నికల తర్వాత చావు కబురు చల్లగా చెబుతున్నారు: ఏలేటి

image

కేవలం సన్నం వడ్లకే రూ. 500 బోనస్ ఇస్తామనడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వంపై నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎక్కువగా పండేది దొడ్డుబియ్యమేనని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో మాత్రమే సన్నబియ్యం పండిస్తారన్న ఆయన 30 జిల్లాలోని రైతులు దొడ్డు బియ్యం పండిస్తారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు చావుకబురు చల్లగా చెబుతున్నారని సెటైర్ వేశారు.

News May 21, 2024

రాజీవ్ గాంధీకి ఘన నివాళి అర్పించిన ఎంపీ అభ్యర్థి

image

ఉట్నూర్ మండలంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. త‌న వినూత్న ఆలోచ‌న‌ల‌తో పేద‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలను ఆదుకునేలా అనేక‌ సంక్షేమ ప‌థ‌కాల‌తో దేశాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయనను కొనియాడారు.

News May 21, 2024

మంచిర్యాల: రైలు ప్రమాదాల్లో 377 మంది మృతి

image

మంచిర్యాల జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కింద పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వివిధ కారణాలతో క్షణికావేశంలో ప్రతి ఏడాది వందల సంఖ్యలో నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. 2022 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 377 మంది రైలు పట్టాలపై ప్రాణాలు తీసుకున్నారు. కాగజ్‌నగర్, తాండూద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

News May 21, 2024

కాగజ్‌నగర్‌లో యువకుడి దారుణ హత్య 

image

స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కాగజ్‌నగర్‌లోని గన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు సోమవారం పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో వారు గొడవ పడ్డారు. దీంతో నలుగురు యువకులు చంద్రశేఖర్‌(28)ను తలపై రాయితో కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఈజ్‌గాం SI రామన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News May 21, 2024

ఆదిలాబాద్: 4 రోజులు కొనుగోలు బంద్

image

ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మేరకు జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా మద్దతు ధరతో చేపడుతున్న జొన్నల కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు కొనుగోళ్లు నిలివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 26 నుంచి కొనుగోళ్లు చేపడుతామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని సూచించారు.